మామిడిపండులా ప్రేమ తీపి పెరగాలి

మంజూ.. నీతో ప్రేమ నాకు ఇప్పటికీ కలగానే ఉంది. ఎవరైనా ప్రేమించిన వ్యక్తితో షాపింగ్‌కో.. సినిమాకో.. రెస్టరంట్‌కో వెళ్దాం అంటారు. నువ్వు మాత్రం వెరైటీగా మామిడి తోటకి పోదాం అన్నావు.

Published : 06 Apr 2024 00:04 IST

మంజూ.. నీతో ప్రేమ నాకు ఇప్పటికీ కలగానే ఉంది. ఎవరైనా ప్రేమించిన వ్యక్తితో షాపింగ్‌కో.. సినిమాకో.. రెస్టరంట్‌కో వెళ్దాం అంటారు. నువ్వు మాత్రం వెరైటీగా మామిడి తోటకి పోదాం అన్నావు. సరేలే చిన్న కోరికే కదాని.. తీసుకెళ్లాను. అక్కడ బంగినపల్లి మామిడి పండు కావాలి అని ముద్దుముద్దుగా అడిగేసరికి ఓ కేజీ కోసుకొచ్చి ఇచ్చాను. పర్సులోంచి డబ్బు తీసి ఇచ్చేలోగానే అన్నీ ఖాళీ చేసేసి తోతాపురి అడిగావు. ఇవ్వగానే వాటినీ పావు గంటలోనే మొత్తం జ్యూస్‌ చేసి జుర్రుకున్నావు. ఆపై నీలం కావాలని గోల పెడుతుంటే.. నీ తీరు ఏదోలా ఉందని అప్పుడే కొద్దికొద్దిగా అర్థమైంది. పోనీలే అడిగింది నా బంగారమే కదాని అష్టకష్టాలు పడి తీసుకొస్తే, అరగంటలోనే తొక్క మిగల్చకుండా తినేశావు. రోజులు గడిచినకొద్దీ నీకు మన ప్రేమకన్నా.. పండ్లపై మోజే ఎక్కువని తెలిసింది. నువ్వు సువర్ణరేఖ కోసం అలిగితే మార్కెట్లన్నీ గాలించి పట్టుకొస్తే.. అవి తినేసి, మాల్గోవ ఇస్తేనే మాట్లాడతానని పేచీ పెట్టావు. వాటితో పాటు అల్ఫోన్సా తెచ్చి మరీ నిన్ను ఐస్‌ చేశాను.

ఇక దశేరి పండు కొని తెస్తేనే.. మన ప్రేమ గురించి ఇంట్లో మాట్లాడతాననీ, హిమసాగర్‌ చేతుల్లో పెడితేనే నీ చేయి పట్టుకొని ఏడడుగులు వేస్తానని చెప్పినప్పుడు నిజంగానే చిరాకేసింది. ఆఖరికి ఓ ముద్దు కోసం నిన్ను బతిమాలితే రత్నగిరి తెస్తేనే అంటూ నా ఆశలపై నీళ్లు చల్లడం నేనెలా మర్చిపోను? ఆఖరికి అక్షరాలా కేజీ రూ.రెండున్నర లక్షలుండే.. అత్యంత ఖరీదైన మియాజాకి జపాన్‌ పండు ఇస్తేనే మన హనీమూన్‌ అని షరతు పెట్టినప్పుడు, నాకు ప్రేమ మీదే నమ్మకం పోయింది. హనీ.. నీ పండ్ల కోరికలు తీరాలంటే నా జీతం, జీవితం సరిపోయేలా లేవు. మంజూ.. నీవల్ల ఇప్పటికే నేను అప్పుల పాలయ్యాను. ఆఖరిగా నీకో మాట విన్నవించు కుంటున్నాను. నీకిష్టమైతే నేను లెక్కలేనన్ని కలెక్టర్‌ కాయలు కొంటాను. శుభ్రంగా ఆవకాయ పెట్టుకొని సంవత్సరమంతా తిందాం. మిగిలిన డబ్బులతో సుఖంగా ఉందాం. అర్థం చేసుకుంటావనే ఆశతో..

నల్లపాటి సురేంద్ర, అనకాపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని