నాన్నకు వందనం..

నాన్న నిన్నామొన్నలా లేడు.. రోజురోజుకీ మారిపోతున్నాడు. చిన్న తప్పు చేసినా గుడ్లురిమి కట్టడి చేసే నాన్న, పిల్లలు క్షణం కళ్లముందు కనబడకుంటే తల్లడిల్లిపోతున్నాడు.

Published : 17 Jun 2023 00:12 IST

నాన్న నిన్నామొన్నలా లేడు.. రోజురోజుకీ మారిపోతున్నాడు. చిన్న తప్పు చేసినా గుడ్లురిమి కట్టడి చేసే నాన్న, పిల్లలు క్షణం కళ్లముందు కనబడకుంటే తల్లడిల్లిపోతున్నాడు. పెద్దరికం ప్రదర్శించడం కోసం.. ప్రేమనంతా మనసులోనే దాచుకున్న ఆయన.. ఆ ధోరణి చాలించి.. అమ్మలా లాలి పాడుతున్నాడు. అవసరమైతే లాల పోస్తున్నాడు. చిన్నప్పుడు చిటికెనవేలు పట్టుకొని నడిపించి.. పెద్దయ్యాక బాధ్యతలు గుర్తు చేసే డాడీ.. గడ్డంమీసం వచ్చిన కొడుకునీ గుండెలకు హత్తుకోవడానికీ వెనకాడటం లేదు. అమ్మ అనురాగం పంచితే.. నాన్న బాధ్యతల బరువు మోయాలనే సంప్రదాయాన్ని రద్దు చేసి.. అమ్మకేమాత్రం తగ్గకుండా అన్నివేళలా పిల్లలకు మురిపాలు పంచుతున్నాడు. తప్పు చేసినా.. తప్పటడుగులు వేసినా.. నిందించి, దండించే ఆనాటి నాన్న.. నేడు చిరునవ్వుతోనే మందలిస్తున్నాడు. సంతానాన్ని సరైన దారిలో పెట్టాలనే తపనతో.. గాంభీర్యం ప్రదర్శిస్తూ.. అందరినీ అడుగు దూరంలో ఉంచే ఆ తరం మనిషి.. భుజం భుజం కలుపుతూ.. స్నేహితుడిలా మెలుగుతూ అంతులేని సంబరాలు పంచుతున్నాడు. ఆనందం అనే ఊయలలో వేసి.. నా వారసులు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని జోల పాడుతున్నాడు. మనకి ఒకేసారి జన్మనిచ్చి.. వంద జన్మలకు సరిపడా సంతోషాన్నివ్వాలని తపించే నాన్నకి మనమేం చేయగలం? మనసారా వందనం చేయడం తప్ప.
ఈ ఆదివారం జూన్‌ 18న ఫాదర్స్‌ డే.


29%
పిల్లల కోసం మందు, సిగరెట్‌ మానేసిన తండ్రులు


30%
తమ రోజువారీ ప్రణాళికలో పిల్లల అవసరాల్నీ గుర్తిస్తున్న తండ్రులు


70%
సంతానానికి రోజూ తప్పనిసరిగా సమయం కేటాయిస్తున్నవారు


60%
పిల్లలతో తరచూ ఆడుకునే తండ్రులు


40%
పిల్లలని స్కూల్లో దింపుతున్నవారు


36%
పిల్లలకు టీకాలు ఇప్పించే నాన్నలు


35%
పేరెంట్‌-టీచర్‌ సమావేశానికి హాజరవుతున్నవారు


30%
డైపర్లు మార్చడం, అన్నం తినిపించడం.. లాంటి పనులు చేస్తున్నారు


ఎంత ప్రేమో..

పాప కోసం చిన్నచిన్న పనులు చేయడం నాన్నకి సరదా. బాబు కోసం కొన్ని అలవాట్లు మానుకుంటే ఆయనకు సంతోషం. ఈ కాలం నాన్న.. పిల్లల కోసం చాలానే చేస్తున్నాడు. ఒక పేరెంటింగ్‌ యాప్‌ చేసిన అధ్యయనంలో తేలిన విషయాలివి.


పెళ్లికాని డాడీలు!

అమ్మ ఉండి, నాన్నలేని పిల్లలు ఈ సమాజంలో చాలామందే ఉంటారు. అమ్మ లేక.. నాన్నే అమ్మైన పిల్లలు అక్కడక్కడా కనిపిస్తుంటారు. అసలు పెళ్లే కాకుండా నాన్నగా మారినవాళ్లు అరుదు. అలాంటి నాన్నలు వీళ్లు.

* కరణ్‌జోహార్‌ అంటే.. బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌. దర్శకనిర్మాతగా, పెద్ద హీరోలకు సన్నిహితుడిగా ఎంతో పేరుంది తనకి. యాభై ఏళ్లు దాటినా కరణ్‌ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఐవీఎఫ్‌, సరోగసీ ద్వారా యశ్‌, రూహీ అనే ఇద్దరు పిల్లలకు ఎప్పుడో తండ్రి అయ్యాడు. వాళ్ల ఫొటోల్ని తరచూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటాడు. నా జీవితంలో నాకు అత్యంత ఆనందం పంచేది నా పిల్లలే అని చెబుతుంటాడు.

* బాలీవుడ్‌లో ఐవీఎఫ్‌, సరోగసీ ద్వారా తండ్రి అయిన మరో హీరో తుషార్‌కపూర్‌. ‘‘బ్యాచిలర్‌ నాన్న’ హోదాను నేను బాగా ఎంజాయ్‌ చేస్తున్నా’నని పదేపదే చెబుతుంటాడు తుషార్‌. తన పిల్లాడు లక్ష్య కపూర్‌తో తనకున్న అనుభవాలతో ‘బ్యాచిలర్‌ డాడ్‌’ అనే పుస్తకం కూడా రాశాడు.

* కొడుకు కోసం సినిమా కెరియర్‌నే వదులుకున్నాడు చంద్రచూడ్‌సింగ్‌. 2007లో పెళ్లి కాకుండానే శరణ్‌జైకి తండ్రి అయ్యాడు చంద్రచూడ్‌. ఆ పిల్లాడు కాస్త పెరిగి పెద్దయ్యాకే 2020లో మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఆ కుర్రాడికి అమ్మను మించి ప్రేమను అందిస్తున్నానని గర్వంగా చెబుతుంటాడు.

* మిగతా సెలెబ్రిటీలంతా సరోగసీ, ఐవీఎఫ్‌ ద్వారా తండ్రి అవుతుంటే.. ఆరుగురు అనాథ పిల్లలను చేరదీసి అసలైన హీరో అనిపించుకున్నాడు రాహుల్‌ బోస్‌. ఆర్భాటం కోసం ఆ పిల్లల్ని చేరదీయడం కాదు.. దాదాపు తన ఆస్తినంతా వాళ్ల పేరు మీద రాశాడు. వీళ్లందరినీ వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా చేరదీశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని