anant ambani and radhika merchant: ప్రేమ అనంతం

మూగజీవాలపై ఇద్దరికీ ఉన్న ప్రేమే అనంత్, రాధికలను ప్రేమలో పడేలా చేసింది. చిన్నప్పుడు ఇద్దరూ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనే పెరిగారు.

Published : 09 Mar 2024 19:59 IST

ఎక్కడ చూసినా... ఆ జంట చర్చలే.. అన్ని చోట్లా ఆ అందాల భరిణ ముచ్చట్లే... తనేమో అపర కుబేరుడి వారసుడు... ఆమె అందం, తెలివీ మేళవించిన ఆధునిక అమ్మాయి... వాళ్లు అనంత్‌ అంబానీ.. రాధిక మర్చంట్‌లని మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది! అట్టహాసంగా జరిగిన పెళ్లి ముందస్తు వేడుక గురించి అంతర్జాలం ఇంకా జోరుగానే వెతుకుతోంది... అసలు వీళ్లెలా ప్రేమ కథేంటి? ఎక్కడ మొదలై, ఇక్కడిదాకా వచ్చారు అని ఆరా తీస్తే.. ఇవిగోండి ఇవీ విశేషాలు..

అనంత్‌ అంబానీ.. పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు. డబ్బు, సౌకర్యాలకు ఏమాత్రం కొదవలేదు. అమెరికాలోని రోడ్‌ఐస్‌లాండ్‌ బ్రౌన్‌ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివాడు. లక్షల కోట్ల రూపాయలకు వారసుడైనా అనంత్‌ది ఒదిగి ఉండే మనస్తత్వం. అందుకు కారణం నానమ్మ కోకిలాబెన్, తల్లి నీతా అంబానీ నేర్పిన విలువలేనంటాడు. ప్రస్తుతం తను రిలయన్స్‌ గ్రూప్‌కి సంబంధించిన జియో, ఎనర్జీ, రిటైల్, సోలార్‌ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చిన్నప్పట్నుంచి ఉన్న ఆస్తమా కారణంగా విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయినా సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటాడు. మనిషి ఎంత భారీకాయుడో అనంత్‌ మనసు అంత సున్నితం. ముఖ్యంగా మూగజీవాలపై ఎనలేని ప్రేమ. జామ్‌నగర్‌లో మూడు వేల ఎకరాల్లో ‘వంతారా’ అనే వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఏర్పాటు చేశాడు. అక్కడ గాయపడ్డ, ఆశ్రయం లేని 200 ఏనుగులు, ఇతర ప్రాణులను సంరక్షిస్తున్నారు.

రాధికా మర్చంట్‌.. అంబానీలంత కాదుగానీ.. తను సైతం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. ఆమె నాన్న వీరేన్‌ మర్చంట్‌ ఒక ఔషధ తయారీ కంపెనీకి సీఈవో. ఆస్తుల విలువ రూ.3వేల కోట్ల వరకు ఉంటుంది. వాళ్లది ముంబయిలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబం. సొంతూరు కచ్‌. తనకో అక్క. నాలుగేళ్ల వయసు నుంచే ఎనిమిదేళ్లపాటు భరతనాట్యం నేర్చుకుంది. ఇంటర్‌ అయ్యాక వ్యాపారం, నాయకత్వ లక్షణాల్లో సుశిక్షితులుగా మలిచే ఐబీ డిప్లమో కోర్సు చేసింది. ఆపై అమెరికా న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. వచ్చీ రాగానే.. కుటుంబ వ్యాపారాల్లో స్థిరపడలేదు. ముంబయిలోని ఒక స్థిరాస్తి వ్యాపారసంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. స్వతంత్ర భావాలు, ఓపిక, ప్రతిభ ఉన్న అమ్మాయి కదా.. తనని తాను నిరూపించుకుంటూ త్వరత్వరగానే ఎదిగింది. తను పుస్తకాల పురుగు. ఏమాత్రం తీరిక దొరికినా పుస్తకం ముందేసుకుంటుంది. తన వ్యాయామం, సరదా.. ఈత కొట్టడమే. రోజుకి అరగంటైనా స్విమ్మింగ్‌పూల్‌లో సేదతీరుతుంది. కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌ టూర్లకు వెళ్లేదట. ఎంత ఆధునికంగా ఉంటుందో.. సంప్రదాయాల్నీ అంతగా ఇష్టపడుతుంది. గాఘ్రా చోళీ తనకి ఫేవరెట్‌. నగలంటే చాలా ఇష్టం. డబ్బులో పుట్టిపెరిగినా.. సాయం చేసే మనసు తనది. టీనేజీ నుంచే కొన్ని స్వచ్ఛందసంస్థలతో కలిసి పని చేస్తోంది.

ప్రేమ మొదలైందిలా..

మూగజీవాలపై ఇద్దరికీ ఉన్న ప్రేమే అనంత్, రాధికలను ప్రేమలో పడేలా చేసింది. చిన్నప్పుడు ఇద్దరూ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనే పెరిగారు. చదువుకున్నారు. కలిసి ఆడుకునేవాళ్లు. ఉన్నత చదువుల కోసం ఇద్దరూ అమెరికా వెళ్లారు. అప్పుడప్పుడు అక్కడే కలుసుకుంటూ మరింత సన్నిహితమయ్యారు. చదువులయ్యాక తిరిగొచ్చారు. అయితే అనంత్‌ మదిలో ఏనాడూ పెళ్లి ఆలోచన లేదు. తనకి చిన్నప్పట్నుంచీ మూగ జీవాలంటే ప్రాణం. కుటుంబ వ్యాపారాలు చూసుకుంటూ మూగజీవుల కోసం పని చేయాలనుకునేవాడు. అయితే ఒక్క సంఘటన మొత్తం కథే మార్చింది. ఓరోజు ఒక ఏనుగు పిల్ల ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అనంత్‌ దాన్ని ఓ వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో రాధిక సైతం అనంత్‌ వెంట ఉంది. ఆ ఏనుగుపిల్లకి చికిత్స పూర్తయ్యేదాకా ఎనిమిది గంటలు ఇద్దరూ ఒకేచోట ఉన్నారు. తను అప్పటికే ముంబయిలోని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తోంది. అప్పట్నుంచి ఏనుగులు, శునకాలు.. ఇలాంటి మూగజీవాల సంరక్షణ కోసం పని చేయడం ప్రారంభించారు. అలా వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి ఇంటి మధ్య రాకపోకలు పెరిగాయి. అనంత్‌ తల్లి నీతా అంబానీ, అక్క ఇషాలతోనూ తన బంధం గాఢంగా అల్లుకుంది. కష్టకాలంలోనే ఎవరిపై ఎవరికి ఎంత ప్రేమ ఉందో బయట పడుతుందంటారు. అనంత్‌కి మొదట్నుంచీ ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా విపరీతంగా బరువు పెరిగిపోయాడు. బరువు తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ని నియమించుకొని కసరత్తులు చేసేవాడు. ఆ సమయంలో రాధిక అతడి వెంటే ఉండేది. ఏడాదిన్నరలో అనంత్‌ 108 కేజీలు తగ్గాడు. అయితే ఆస్తమా కోసం వాడిన మందుల కారణంగా మళ్లీ బరువు పెరిగాడు. ఈ కష్టకాలంలోనూ తను అతడికి అండగా ఉంది. ఈ పరిస్థితుల్లోనూ షరతుల్లేని ప్రేమ చూపించింది. కేవలం అనంత్‌ వ్యక్తిత్వం నచ్చే అతడిని ఇష్టపడ్డానని చెప్పుకొచ్చింది. అనంత్‌తో ఎంతగా ప్రేమలో మునిగిపోయిందో.. అంతకన్నా ఎక్కువగా వాళ్ల కుటుంబాన్నీ ఇష్టపడింది. ‘నేను వందశాతం లక్కీఫెలోని.. ఇంతమంచి అమ్మాయి నా జీవితంలోకి వస్తుందంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. మేం ఏడేళ్లుగా అనుబంధంలో ఉన్నా.. ఇప్పటికీ నిన్నామొన్నా కలిసినట్టే ఉంది. రోజూ తనతో ప్రేమలో పడుతూనే ఉన్నాను’ అంటూ పెళ్లి ముందస్తు వేడుక వేదికపై రాధికపై ఉన్న ప్రేమని మాటల్లో వ్యక్తం చేశాడు అనంత్‌. డిసెంబరు 2022లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట.. వచ్చే జులైలో పెళ్లి పీటలెక్కనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని