Updated : 23/11/2021 06:05 IST

Heavy Rain: ముంపులోనే..


తిరుపతి ఆటోనగర్‌లో నాలుగు రోజులుగా తొలగని వరద

రాష్ట్రంలో సోమవారం వర్షాలు తెరపిచ్చినా.. వరద ప్రభావం కొనసాగుతోంది. తిరుపతి, కడప, నెల్లూరు, చిత్తూరు నగరాల్లోని పలు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. చిత్తూరు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న రాయలచెరువు లీకేజీకి అడ్డుకట్ట వేసేలా పనులు మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో కొట్టుకుపోయిన హైవే, రైల్వే ట్రాక్‌లను పునరుద్ధరించడంతో సోమవారం రాత్రి నుంచి రాకపోకలు మొదలయ్యాయి. వర్షాలు, వరదల ధాటికి రాష్ట్రంలో 34 మంది మరణించారని, 10 మంది గల్లంతయ్యారని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. 8 లక్షల ఎకరాల్లో పంట దిబ్బతిన్నట్లు వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు.


అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూదిలి వద్ద చిత్రావతి నదిపై వంతెన కుప్పకూలి రోడ్డు మార్గం మూసుకుపోయింది. బెంగళూరుకు చుటూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: రాష్ట్రంలో సోమవారం వర్షాలు తెరపిచ్చినా.. వరద ప్రభావం కొనసాగుతోంది. తిరుపతి, కడప, నెల్లూరు, చిత్తూరు నగరాల్లోని పలు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
తిరుపతి నగరంలోని ఆటోనగర్‌, శ్రీకృష్ణనగర్‌, గాయత్రినగర్‌, ఎమ్మార్‌పల్లె, సరస్వతీనగర్‌, గాంధీపురం ఇంకా ముంపులోనే ఉన్నాయి. ప్రభుత్వం నిత్యావసరాలను అందిస్తోంది. శ్రీనివాసపురంలో 132 కేవీ ఉపకేంద్రం మునకలోనే ఉండటంతో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేకపోయారు. జిల్లావ్యాప్తంగా 75 చెరువులకు గండ్లు పడగా.. 456 దెబ్బతిన్నాయి. తిరుపతి నుంచి సెవెన్‌ హిల్స్‌, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లతో పాటు ధర్మవరం-నరసాపురం స్పెషల్‌ రైళ్లు మాత్రమే నడిచాయి.


తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటున్న నెల్లూరులోని టిడ్కో కాలనీవాసులు

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు సమీపంలోని జనార్దన్‌రెడ్డికాలనీలో కొట్టుకుపోయిన 16వ నంబరు జాతీయ రహదారిని అధికారులు సోమవారం పునరుద్ధరించారు. పడుగుపాడు వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు పూర్తిచేశారు. అర్ధరాత్రి నుంచి ఓ వైపు పట్టాల మీదుగా రైళ్లను పంపిస్తున్నారు. సంగం వద్ద హైవేపై వరద తగ్గడంతో కడప వైపు వాహనాలను అనుమతించారు. పెన్నా నదిపై సోమశిల బ్యారేజీ వద్ద 12 గేట్లు ఎత్తి 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం ప్రాంతానికి ఆదివారం రెండు గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకురాగా, సోమవారం సంగం మండలం కోలగట్ల వద్ద మరో రెండింటిని గుర్తించారు.

* కడప జిల్లా పెనగలూరు మండలంలోని దిగువ సిద్దవరం ఎస్సీకాలనీ, కోడిచెన్నయ్యగారిపల్లె, పద్మయ్యగారిపల్లె, నరసింగరాజపురం, పల్లంపాడు గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతిని నాలుగు రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో వచ్చిన వరద ఇంకా తొలగిపోలేదు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. జమ్మలమడుగు సమీపంలో పెన్నా నదిపై నిర్మించిన వంతెన కుంగి ప్రమాద స్థితికి చేరింది. పోలీసులు ప్రయాణికులను అనుమతించడం లేదు.


రాయలచెరువుకు ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో చిత్తూరు జిల్లా ముండ్లపూడి గ్రామం నుంచి పునరావాస కేంద్రానికి వెళ్తున్న ఓ కుటుంబం


వరదలతో 34 మంది మృతి

రదల కారణంగా ఇప్పటివరకు 34 మంది మృతి చెందారని, గల్లంతైన మరో పది మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. మృతుల్లో రెస్క్యూ బృందంలోని సభ్యులు ముగ్గురు ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక అందిందన్నారు. సోమవారం మంత్రిమండలి సమావేశంలో జరిగిన చర్చ, నిర్ణయాలను మంత్రి శాసనసభలో వివరించారు. ‘మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. బాధితులకు తక్షణ సాయంగా ఖర్చు చేయటానికి కడప, చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లకు రూ.10 కోట్లు, అనంతపురం కలెక్టర్‌కు రూ.5 కోట్లు ఇచ్చాం. ఆవులు, గేదెలు మరణిస్తే పరిహారంగా ఒక్కోదానికి రూ.30 వేలు, గొర్రెలు, మేకలకు రూ.3 వేల వంతున చెల్లిస్తాం. రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాల ఇవ్వనున్నాం’ అని పేర్కొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని