విశాఖలో రక్షణరంగ ఎంఎస్‌ఎంఈ పార్క్‌

విశాఖలో ‘రక్షణరంగ ఎం.ఎస్‌.ఎం.ఇ. పార్క్‌’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. సోమవారం విశాఖలోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌.....

Published : 30 Nov 2021 04:54 IST

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడి

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో ‘రక్షణరంగ ఎం.ఎస్‌.ఎం.ఇ. పార్క్‌’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. సోమవారం విశాఖలోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీ(ఎపీటా) ఆధ్వర్యంలో ‘డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌, స్టార్టప్స్‌ ఇంటెరోపరబిలిటీ కాన్‌క్లేవ్‌(దేశీ-2021)’ పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. విశాఖలో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎం.ఎస్‌.ఎం.ఇ. పార్క్‌ను తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరిన నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలోనే దాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పార్కులో ఒక ప్రతిభాకేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)ను కూడా ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్‌.డి.ఒ.) సహకారం తీసుకుంటామని వెల్లడించారు. విశాఖలో త్వరలో ‘నాస్కామ్‌’ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో ‘డిఫెన్స్‌ ఎరో హబ్‌’ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న డి.ఆర్‌.డి.ఒ. ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి  మాట్లాడుతూ రక్షణరంగ పరిశ్రమలను ప్రోత్సహించడానికి తమ సంస్థ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. క్షిపణులు, బాంబులకు సంబంధించిన పరిజ్ఞానాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా ప్రైవేటు రక్షణరంగ సంస్థలకు అప్పగిస్తున్నట్లు గుర్తుచేశారు. సొంతంగా ఎదగాలనుకునే దేశంలోని ప్రతిభావంతులైన యువకులకు డి.ఆర్‌.డి.ఒ. ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని, ఆయా వివరాలను డి.ఆర్‌.డి.ఒ. వెబ్‌సైట్‌లో చూడొచ్చని సూచించారు. జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌.ఆర్‌.డి.సి.) ఛైర్మన్‌ రస్తోగి , ఎపీటా గ్రూప్‌ సీఈవో నందకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని