Published : 08/12/2021 05:46 IST

ప్రత్యేక హోదా ఉన్నా లేకున్నా పన్నుల పంపిణీలో వివక్ష ఉండదు

ఈనాడు, దిల్లీ: కేంద్ర పన్నుల వాటా పంపిణీలో ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాయేతర రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్ష చూపొద్దని 14వ ఆర్థికసంఘం చెప్పినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించే అంశం గురించి తెరాస ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘నీతి ఆయోగ్‌ నుంచి అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేకహోదా కోసం విజ్ఞప్తులు అందాయి. రాష్ట్రాలకు పంపిణీచేసే పన్నుల్లో ప్రత్యేకహోదా, సాధారణ రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్షత చూపొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఆ సిఫారసులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2015-20 మధ్యకాలంలో రాష్ట్రాలకు పంపిణీచేసే పన్నుల వాటాను 32% నుంచి 42%కి పెంచింది. రాష్ట్రాలకు ఎదురయ్యే రెవెన్యూ లోటును పన్ను వాటా బదలాయింపు ద్వారా సాధ్యమైనంత మేరకు భర్తీచేస్తున్నాం. లోటు భర్తీకాని రాష్ట్రాలకు..రెవెన్యూలోటు గ్రాంట్లు మంజూరు చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2015 ఫైనాన్స్‌ యాక్ట్‌ ద్వారా కొన్ని ఆదాయ పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించాం. రెండు రాష్ట్రాల్లో గుర్తించిన(నోటిఫై) వెనుకబడిన ప్రాంతాల్లో 2015 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో నెలకొల్పే కొత్త యంత్రాలపై చేసే వాస్తవ ఖర్చుపై ఇచ్చే 20% అదనపు రాయితీని 35%కి పెంచుతూ ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 32ను సవరించాం’’ అని నిత్యానందరాయ్‌ వివరించారు. 


ఏపీలో రూ.1,340 కోట్ల ‘మెటీరియల్‌’ బకాయిలు 

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకుగానూ ఆంధ్రప్రదేశ్‌లో   రూ.1,340.68 కోట్ల మెటీరియల్‌ బకాయిలు ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ఆమె లోక్‌సభలో తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి మెటీరియల్‌ బకాయిలు రూ.8,445.65 కోట్ల మేర ఉన్నట్లు చెప్పారు. కూలీకి సంబంధించి 16 రాష్ట్రాల్లో  రూ.3,338 కోట్ల బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు.  


శ్రీశైలం, సాగర్‌ డ్యాంలకు భద్రత పరీక్షలు చేయించండి: లావు శ్రీకృష్ణదేవరాయలు

తెలుగు రాష్ట్రాల్లో అత్యధికులు ఆధారపడిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల పటిష్ఠతను తెలుసుకోవడానికి డ్యాం బరస్ట్‌ అనాలిసిస్‌ నిర్వహించాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడుతూ... ‘‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణ పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలి. శ్రీశైలం దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్తు కేంద్రం. నాగార్జునసాగర్‌ ఎత్తైన, అతిపెద్ద కాలువల వ్యవస్థ ఉన్న డ్యాం. శ్రీశైలం జలాశయానికి కొన్ని మరమ్మతులు చేసినా... డ్యాం రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (డ్రిప్‌) కింద నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయలేదు. ముఖ్యంగా శ్రీశైలం అడుగుభాగాన మడుగు వెడల్పుకావడంతో ప్రమాదకరంగా తయారైంది. ప్లంజ్‌పూల్‌ నిర్వహణ జలాశయం భద్రత దృష్ట్యా అత్యంత ప్రధానమైంది. 2020లో నాగార్జునసాగర్‌ కుడికాలువ గేటు విరిగింది. దానివల్ల పెద్దఎత్తున నీరు వృథా అయింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇందుకు నిధులను, మానవ వనరులను సమకూర్చాలి. ప్రస్తుతం ఈ రెండు జలాశయాలు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వస్తున్నాయి. అందువల్ల జల్‌శక్తి మంత్రి వీటి భద్రతపై దృష్టిసారించాలి. సాంకేతిక కారణాలు చూపి తప్పించుకోవద్దు’ అని కోరారు. 


ప్రభుత్వ తలసరి వైద్య వ్యయం ఏపీలో రూ.1,381

ప్రజల వైద్యం కోసం తలసరిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.1,381, తెలంగాణ రూ.1,698 ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌పవార్‌ తెలిపారు. ప్రజలు వైద్యం కోసం తమ సొంత జేబుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తలసరి రూ.3,102, తెలంగాణలో ప్రజలు రూ.2,120 ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 


కృష్ణపట్నం పోర్టుకు అత్యధిక ఆదాయం 

ఈ ఏడాది ఏప్రిల్‌-అక్టోబరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుకు అత్యధిక ఆదాయం వచ్చినట్లు కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. ఆయన మంగళవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం