మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!

‘‘హైదరాబాద్‌ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి.

Published : 08 May 2024 06:27 IST

వికేంద్రీకరణ పేరిట జగన్‌ విద్వేషం
పదేళ్లయినా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రావని
భూములిచ్చిన రైతుల అరణ్యరోదన 
చంద్రబాబుపై అక్కసుతో రూ.వేలకోట్లు నీటిపాలు
ఈనాడు, అమరావతి

ప్రధానమంత్రి గారూ..

గుర్తుపట్టారా....?
అమరేంద్రపురిలా ఎదగాలని ఆకాంక్షిస్తూ...
మీరు శంకుస్థాపన చేసిన అమరావతిని!
పదేళ్ల కిందట...
ఆంధ్రుల ఆశల భౌతిక రూపంగా...
కలలు పండించే సౌభాగ్య నగరిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ... పవిత్ర నదీ జలాలను, మృత్తికను అందజేస్తూ... వీరు చెప్పిన సంకల్ప వచనాలు
గుర్తుండే ఉంటాయి...
నవ రాజధాని నిర్మాణంతో ఈ మట్టి రత్నగర్భ అవుతుందని,
సంపద సృష్టికి కేంద్రమవుతుందని
యువత కలలు పండించే మాగాణి అవుతుందని
ఐదుకోట్ల ఆంధ్రులూ ఆశించారు!
అన్నదాతలు ముందుకొచ్చి మూడు పంటలు పండే భూములిచ్చారు
దేశవిదేశాల్లోని కంపెనీలూ రావడం మొదలెట్టాయ్‌
అమృత, ఎస్‌ఆర్‌ఎం, విట్‌లాంటి  
విద్యాసంస్థలూ వచ్చాయ్‌
ఒక్కో ఇటుక పేర్చుకుంటూ...  
సౌధాలు తలెత్తుకుంటూ...
అభివృద్ధి డిజైన్లు ఒక్కటొక్కటిగా
పట్టాలకెక్కుతున్న వేళ...
ఒక్క అవకాశమంటూ...
వచ్చాడో మాయల మరాఠీ...
ద్వేషంతో...కుట్రలతో.. వంచనతో...
మూడు రాజధానుల మాటలతో
నిర్మాణాలకు గండికొట్టాడు
మీరు మొదలెట్టిన యజ్ఞాన్ని భగ్నం చేశాడు
ఓ అద్భుత అవకాశాన్ని కాలరాశాడు.
భూములిచ్చిన రైతులకు కన్నీరు మిగిల్చాడు...

ఇప్పుడు...

ఎటు చూసినా శిధిల జ్ఞాపకాలతో
మధ్యలో ఆగిపోయిన మహా యాగశాలలా
నిలిచిపోయా!
‘వికసిత రాజధాని’గా ఎదగాల్సినదాన్ని
విచలితమైపోయా!
విధ్వంసానికి ప్రతీకగా మిగిలిపోయా!
చూడండి ఒకసారి.. మా గోడు వినండి!

‘అమరావతి’పై వ్యతిరేకత లేదని బొంకి...
నా ఇల్లూ ఇక్కడే అని నమ్మించె..
అధికారం రాగానే మాట మార్చి...
వికేంద్రీకరణంటూ విద్వేషపు విషబీజాలు నాటె
ప్రజాధనంతో మొదలెట్టిన అభివృద్ధిని
పునాదుల్లోనే భూస్థాపితం చేయాలని తపించె...
వద్దన్న మట్టిమనుషుల పోరాట స్ఫూర్తిని...
పంతానికి పోయి పతనం చేయజూసె...
దండంపెట్టిన దళితులే... దండుగా కదిలితే
పోలీసులతో తొక్కించె...
హలం పట్టే చేతులే.. ఆగ్రహిస్తే..
అధికార అహంతో అణిచివేసె...
భూములిచ్చిన రైతుల వ్యధలు చూసి భూతల్లే విలవిల్లాడిన వేళ...
ఆంధ్రావని కలల సౌధాన్ని...
రాష్ట్ర రూపురేఖలు మార్చే రాజధానిని...
యువత ఉపాధికి ఊతమిచ్చే యంత్రాన్ని...
పాతాళానికి నొక్కాలని చూసిన పాపి జగన్‌!
నాడు... కంసమామ
చిన్నికృష్ణున్ని చిదిమేయటానికి
ఎన్ని ప్రయత్నాలు చేశాడో....
నేడు...
మామ మామ అంటూ జగన్‌
ఆంధ్రుల కలల సౌధం అమరావతిని
నాశనం చేయటానికి అన్ని ఎత్తులూ వేశాడు!

‘‘హైదరాబాద్‌ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం తమకు సమ్మతమేనని ఎన్నికల ముందు జగన్‌ నమ్మబలికారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని అందుకే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతబెట్టారు. మూడు రాజధానుల పేరుతో కొత్త నాటకానికి తెరతీసి, అమరావతిని ధ్వంసం చేశారు. గత తెదేపా ప్రభుత్వం ఎంత బృహత్‌ సంకల్పంతో అమరావతి ప్రాజెక్టుని పరుగులు పెట్టించిందో... జగన్‌ ప్రభుత్వం అంతే పట్టుదలతో అమరావతి విధ్వంసాన్ని కొనసాగించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిపేసింది. రాజధాని నిర్మాణానికి రూ.7,206 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రపంచబ్యాంకుని, రాజధానిలో స్టార్టప్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్న సింగపూర్‌కి చెందిన ప్రఖ్యాత సంస్థలను, పెట్టుబడిదారులను తరిమికొట్టింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి... శాసన రాజధాని పేరుతో అమరావతిలో కేవలం 100 మంది ఉద్యోగులుండే...ఏడాది మొత్తం మీద 10-15 రోజులు సమావేశాలు జరిగే శాసనసభ భవనాన్ని మాత్రమే ఉంచి... హైకోర్టుని కర్నూలుకి, మొత్తం పాలనను విశాఖకు తరలించేందుకు కుట్ర పన్నింది. విస్తరిలో నవకాయ పిండివంటలు వడ్డించుకుని తినేందుకు సిద్ధమవుతుండగా ఒక అసూయాపరుడు వచ్చి కాలదన్నితే ఎలా ఉంటుందో... ఇప్పుడు అమరావతి పరిస్థితి అలాగే ఉంది..! భూమి, ప్రణాళికలు, వనరులు అంతా సిద్ధం చేసుకుని నిర్మాణాలు మొదలు పెట్టి వేగంగా కొనసాగిస్తున్న దశలో అధికారంలోకి వచ్చిన జగన్‌ అమరావతిపై కక్షగట్టారు.

వైకాపా విధ్వంసంతో తీవ్ర నష్టం..!

అమరావతిపై జగన్‌ ప్రభుత్వం కక్షగట్టి విధ్వంసానికి పాల్పడటంతో... రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇదీ మా రాజధాని నగరం అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. అమరావతి వినాశనానికి జగన్‌ కంకణం కట్టుకోవడం వల్ల... అటు రాజధానితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే పెట్టుబడులు రాలేదు. రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైంది. చదువుకున్న యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సిన దుస్థితి తలెత్తింది. జగన్‌ ప్రభుత్వానికి అమరావతిపైనా, ఈ ప్రాంతంపైనా ఎంత కక్షంటే... కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్టు రద్దు చేసింది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుని తీసేసి కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వేని తెరపైకి తెచ్చింది. అమరావతి మీదుగా విజయవాడ- గుంటూరు రైల్వే ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల పక్కకు వెళ్లిపోయింది, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకి ఉరేసింది. రాజధానిలో కొంత డబ్బు వెచ్చిస్తే అందుబాటులోకి వచ్చే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుని పూర్తి చేయడం మానేసి, కరకట్ట రోడ్డుని విస్తరిస్తామని చెప్పింది. ఇప్పటికీ దానికి అతీగతీ లేదు.

రోజుకో కుట్ర..!

అమరావతి ఓ శ్మశానమని, ఎడారి అని, అక్కడి నేల భారీ నిర్మాణాలకే పనికిరాదని, అది మునిగిపోయే ప్రాంతమని... ఇలా వైకాపా నాయకులు అమరావతిని దెబ్బతీసేందుకు రోజుకో కుట్రను తెరపైకి తెచ్చారు. విపరీతంగా దుష్ప్రచారం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు దాదాపు నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, వారి కన్నీళ్లు, బలిదానం పాలకుల పాషాణ హృదయాల్ని కదిలించలేకపోయాయి. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను విధ్వంసం చేసేందుకు.... ఆర్‌5 జోన్‌ పేరుతో ఇతర ప్రాంతాలకు చెందిన 50 వేల మందికిపైగా రాజధానిలో సెంటు పట్టాలు పంపిణీ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు చేయడం, భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకు అన్ని రకాల కుట్రలూ పన్నారు. పోలీసుల్ని ప్రయోగించి దాష్టీకానికి పాల్పడ్డారు.

ఆ పేరే ఒక బ్రాండ్‌..!

అమరావతి నిర్మాణ దశలోనే ప్రపంచ దేశాలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించింది. సింగపూర్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడి ప్రఖ్యాత సంస్థలతో ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా రైతులనూ రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేస్తూ వారినుంచి సుమారు 34 వేల ఎకరాల భూమిని ‘ల్యాండ్‌ పూలింగ్‌’లో సమీకరించడం వంటి వినూత్న విధానాలతో అందరి దృష్టీ అమరావతిపై పడింది. స్వల్పకాలంలోనే అమరావతికి అంతర్జాతీయంగా ‘బ్రాండ్‌ ఇమేజ్‌’ ఏర్పడింది. ప్రజా రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు ఉత్సాహంగా ముందుకు వచ్చాయి. అన్ని అవసరాలకు పోను ప్రభుత్వం చేతిలో 8 వేల నుంచి 10 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌, తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాలిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ వంటి సంస్థల సంసిద్ధత, రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు సంస్థల ఆసక్తి, ప్రఖ్యాతి చెందిన విదేశీ సంస్థలతో ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పన... ఇలా అమరావతి ఆరంభం నుంచే అనేక విశేషాల సమాహారంగా నిలిచింది. ప్రణాళికలు పూర్తయి, నిర్మాణాలు మొదలైన దశలోనే అమరావతి పరపతి ఎంతగా వ్యాపించిందంటే... బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్‌లు రిలీజ్‌ చేస్తే గంట వ్యవధిలో రూ.2వేల కోట్లు సమకూరాయి. అమరావతికి నిధుల సమీకరణకు మసాలా బాండ్‌లు విడుదల చేసేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అంగీకరించింది.

మూడింటికే కట్టుబడి ఉన్నారట!

రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదని, నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని సాక్షాత్తు హైకోర్టు విస్తృత ధర్మాసనం విస్పష్టంగా చెప్పినా... ముఖ్యమంత్రి ఆలోచనల్లో మార్పు రాలేదు. మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ... జగన్‌ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పడం, కోర్టులు, న్యాయవ్యవస్థ అంటే ఆ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదనడానికి నిదర్శనాలు. అమరావతిపై జగన్‌ ప్రభుత్వం ఎంతగా కక్షగట్టిందంటే... గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఏర్పాటైన ఎస్‌ఆర్‌ఎం, విట్‌, అమృత వంటి యూనివర్సిటీలకు వెళ్లే రోడ్లు కూడా వేయలేదు.

రోడ్లు తవ్వుకుపోతున్నా పట్టదు..!

ముందు నుంచీ అమరావతిపై జగన్‌ ప్రభుత్వం విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఐదేళ్లలో అక్కడ తట్టెడు మట్టి వేయకపోగా, గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లను దుండగులు తవ్వేసి మట్టి, కంకర తరలించుకుపోతున్నా కనీసం రక్షణ కల్పించడంలేదు. భారీ ఇనుప పైపులను దుండగులు కోసేసి పట్టుకుపోతున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రాజధాని నమూనాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీని ఇటీవల దుండగులు విధ్వంసం చేశారు. అయినా ప్రభుత్వంలో కనీస స్పందన లేదు.


నిర్వీర్యం చేశారు...

రింగ్‌ రోడ్డు ఔట్‌...

రాజధాని చుట్టూ 189 కి.మీ.ల పొడవైన ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని రూ.17,761 కోట్లతో ప్రతిపాదించారు. అది కార్యరూపం దాల్చితే ఓఆర్‌ఆర్‌ చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చేవి.


రూ. 10 వేల కోట్లు వృథా

రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి, వివిధ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించింది. ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరైంది.


పెట్టుబడులు అన్నీ వెనక్కి..

అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల విలువే సుమారు రూ.44,300 కోట్లు. అవన్నీ వైకాపా అధికారంలోకి వచ్చేనాటికే అమరావతిలో భూముల కేటాయింపు జరిగిన సంస్థలు చేసిన ప్రతిపాదనలే. అన్నీ పోయాయి.


ప్రఖ్యాత సంస్థలు మాయం

అమరావతిలో స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోటీ పడ్డాయి. 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు 27 ఎకరాల్ని సీఆర్‌డీఏ కేటాయించింది. జగన్‌ ప్రభుత్వ వైఖరితో అవేమీ అక్కడ నిర్మాణాలు చేయలేదు.


విదేశాలు వద్దన్నాయి..

అమరావతిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్న సమయంలో ఎప్పుడు చూసినా రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా 20 వేల మంది కార్మికులు పనిచేసేవారు. దేశ, విదేశీ ప్రతినిధులతో అమరావతి, విజయవాడ ప్రాంతాలు సందడిగా ఉండేవి. అప్పట్లో విజయవాడ నుంచి సింగపూర్‌కి ప్రత్యేక విమాన సర్వీసు నడిచింది.


కంటి తుడుపు చర్యలు

గత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాల్లోనే ఇప్పటికీ సచివాలయం, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. హైకోర్టూ అక్కడి నుంచే పనిచేస్తోంది. ఈ ఐదేళ్లలో హైకోర్టు దగ్గర ఒక అదనపు భవనం నిర్మించడం తప్ప జగన్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఆ భవనం కూడా చోటు సరిపోవడంలేదని హైకోర్టు ఒత్తిడి పెట్టడంతో నిర్మించింది.


ప్రాజెక్టులు పరారు

అమరావతికి సమాంతరంగా కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి అటూ ఇటూ కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు అప్పట్లో మొదలయ్యాయి. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. జగన్‌ ప్రభుత్వం అమరావతి నిర్మాణం నిలిపివేయడంతో వాటిలో భారీ ప్రాజెక్టులు కొన్ని దివాలా తీశాయి. పెట్టుబడిదారులంతా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోయారు.


2.5 లక్షల మందికి ఉపాధి గల్లంతు

అమరావతిలో 1961 ఎకరాల్లో సార్టప్‌ ఏరియా ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సుర్బానా సంస్థల కన్సార్షియం ముందుకు వచ్చింది. ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికే అమరావతి అనేక ఐటీ, ఆర్థిక సేవా సంస్థలకు కేంద్రంగా మారేది. ఈ ప్రాజెక్టు తొలి దశలోనే రూ.50వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చేవని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని