సంక్షిప్త వార్తలు(4)

మహారాష్ట్రలో ఎన్నికల బందోబస్తులో ఉన్న ఏపీఎస్పీకిచెందిన 10కంపెనీల సిబ్బంది పోస్టల్‌ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 10న అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Updated : 08 May 2024 05:35 IST

10న పోస్టల్‌ బ్యాలట్‌ సదుపాయం కల్పించాలి: ఏపీఎస్పీ

ఈనాడు, అమరావతి: మహారాష్ట్రలో ఎన్నికల బందోబస్తులో ఉన్న ఏపీఎస్పీకిచెందిన 10కంపెనీల సిబ్బంది పోస్టల్‌ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 10న అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గడ్చిరోలి జిల్లాలో మొదటి దశ ఎన్నికల బందోబస్తులో వారంతా పాల్గొన్నారు. మళ్లీ అయిదో దశ ఎన్నికల్లో 20న నాసిక్‌లో విధులు నిర్వహించాల్సి ఉంది. 13న జరిగే నాలుగోదశ ఎన్నికలకు విధులు కేటాయించలేదు. ఏపీకి వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తే ఈ నెల 9న చేరుకునే అవకాశం ఉంటుంది. 10న పోస్టల్‌ ఓటుకు అవకాశమిస్తే వినియోగించుకుని 11న తిరిగి నాసిక్‌ వెళ్తామని అభ్యర్థిస్తున్నారు. ఒక్కో కంపెనీలో వెయ్యిమంది చొప్పున 10వేల మంది సిబ్బంది ఎన్నికల బందోబస్తులో ఉన్నారు.


వైద్యశాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైద్యశాఖలో ఫేజ్‌-2 స్పెషాలిటీస్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 31 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యసేవల నియామక మండలి మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి బుధవారం నుంచి ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. అర్హత, పూర్తి వివరాలకు https://dme.ap.nic.in  వైబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.


శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


‘తెలుగోడు’ ట్రైలర్‌ విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర పునర్నిర్మాణానికి తెదేపా అధినేత చంద్రబాబు చేసిన కృషిని వివరిస్తూ.. నిర్మించిన ‘తెలుగోడు’ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా ఉంచనున్నట్లు చిత్ర సమర్పకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని