కళ్లాల నిండా కన్నీళ్లే!

పంట ఇంటికి చేరే సమయంలో వరుణుడు మళ్లీ పంజా విసిరాడు. కళ్లాల్లో మిరప, ధాన్యం తడిసిపోతోంది. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతినగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిరప.. ఈ సారి తక్కువ దిగుబడి రాగా..

Published : 14 Jan 2022 04:45 IST

చేతికొచ్చిన పంటపై వరుణుడి పంజా
2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు

ఈనాడు, అమరావతి: పంట ఇంటికి చేరే సమయంలో వరుణుడు మళ్లీ పంజా విసిరాడు. కళ్లాల్లో మిరప, ధాన్యం తడిసిపోతోంది. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతినగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిరప.. ఈ సారి తక్కువ దిగుబడి రాగా.. అదీ కాస్త కళ్లాల్లోనే తడుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల వరి పనలు నీటిలో తేలుతున్నాయి. కొన్నిచోట్ల కుప్పలేసిన మినుము, ధాన్యం తడిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో సెనగకు కొంతమేర మేలైనా.. వర్షం ఎక్కువైతే అదీ దెబ్బతింటుంది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారి, విస్తారంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి జల్లులతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. విజయవాడలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా జల్లులు పడ్డాయి. గాలులకు వరి నేలకొరుగుతుంటే.. వర్షాలకు కోసిన పనలు, ధాన్యం తడుస్తోంది. ధాన్యం కాపాడుకునేందుకు రూ.5 వేల నుంచి రూ.8 వేలు వెచ్చించి రైతులు టార్పాలిన్లు కొంటున్నా ప్రయోజనం ఉండటం లేదు.

వర్షపాతం ఇలా..
వర్షానికి గుంటూరు జిల్లాల్లో దాదాపు అన్ని మండలాలు ప్రభావితమయ్యాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 86.5 మి.మీ వర్షం పడింది. ఆ తర్వాత పార్వతీపురం 83.0 మి.మీ, గొలుగొండ 63.5, గుంటూరు జిల్లా పొన్నూరులో 60.0, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో 54.0, కృష్ణా జిల్లా గూడూరులో 49.5, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 43.75 మి.మీ వాన కురిసింది.
*బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల మధ్య నెల్లూరు జిల్లా చిల్లకూరులో 65.5మి.మీ, అనంతసాగరం మండలం రేవూరులో 47.5, కర్నూలు జిల్లా పగిడ్యాలలో 46.0, కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో 41.0, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 40.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల జల్లులు పడ్డాయి.

నేడు, రేపు వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.

నీటమునిగిన ధాన్యం రాశులు
చీరాల గ్రామీణం, వేటపాలెం, న్యూస్‌టుడే :  ప్రకాశం జిల్లాలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, వరి పనలు తడిసి పోయాయి. చీరాల ప్రాంతాల్లోని తోటవారిపాలెం ఎత్తిపోతల కింద 500 ఎకరాల్లోని కోతకొచ్చిన వరి నీట మునిగింది. వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి, దేశాయిపేట గ్రామాల్లో 320 ఎకరాల్లో కోసిన వరి పనలు, 45 ఎకరాల్లోని ధాన్యం దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. రాజుబంగారుపాలెం, పెదగంజాం పంచాయతీ పరిధిలోని 40 ఎకరాల్లోని వరి కోసి కుప్ప చేయగా మొత్తం నీట మునిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని