అక్రమ లేఅవుట్లకు రాజకీయ అండ!

రాష్ట్రంలో అనుమతులు లేని లేఅవుట్లు పెద్దఎత్తున వెలుస్తున్నాయి.రాజకీయ నేతల అండ, అధికారుల సహకారంతో కొందరు వ్యాపారులు గ్రామ పంచాయతీల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీటితో పంచాయతీలు, సమీప పట్టణాభివృద్ధి సంస్థలు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి.

Published : 23 Jan 2022 03:24 IST

రాష్ట్రంలో అనుమతులు లేని వెంచర్లు 13,711
చర్యలపై పంచాయతీ అధికారుల ప్రేక్షక పాత్ర
స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి

విజయవాడ నగర శివారులో 12 ఎకరాల్లో ఒకరు అనుమతులు తీసుకోకుండా లేఅవుట్‌ వేశారు. రోడ్లు చదును చేస్తుండగా పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి జోక్యంతో మిన్నకుండిపోయారు.


విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో స్థిరాస్తి వ్యాపారి ఒకరు 15 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి ప్లాట్లు విక్రయించారు. అనుమతులన్నీ ఉన్నట్లు బోగస్‌ పత్రాలు సృష్టించారు. అక్రమ లేఅవుట్‌ అని తెలిసి నిర్మాణాలకు బ్యాంకు రుణాలు రాక కొన్నవారు వాపోతున్నారు.


ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో అనుమతులు లేని లేఅవుట్లు పెద్దఎత్తున వెలుస్తున్నాయి.రాజకీయ నేతల అండ, అధికారుల సహకారంతో కొందరు వ్యాపారులు గ్రామ పంచాయతీల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీటితో పంచాయతీలు, సమీప పట్టణాభివృద్ధి సంస్థలు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొని పలువురు ప్రజలు నష్టపోతున్నారు. రాష్ట్రంలోని పంచాయతీల పరిధిలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 13,711 అనధికార లేఅవుట్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,792 లేఅవుట్లు గుర్తించారు. అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అధికంగా బయటపడ్డాయి.

నిఘా కమిటీలు ఏం చేస్తున్నాయి?

అక్రమ లేఅవుట్లను మొదట్లోనే గుర్తించి నిరోధించేందుకు ఏర్పాటుచేసిన నిఘా కమిటీల పనితీరు అంతంతమాత్రంగా ఉంటోంది. డివిజినల్‌ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) ఆధ్వర్యంలో నిఘా కమిటీలు అనుమతుల్లేని లేఅవుట్లను గుర్తించి బాధ్యులకు నోటీసులివ్వాలి. అనంతపురం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం,ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వెలసిన కొన్ని అక్రమ లేఅవుట్లపై నిఘా కమిటీలకు సమాచారం వెళ్లినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న
ఆరోపణలున్నాయి.

అక్రమ లేఅవుట్లతో ప్రాథమిక దశలో గ్రామ పంచాయతీలు, తరువాత దశలో పట్టణాభివృద్ధి సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. పదెకరాల లేఅవుట్‌పై గ్రామ పంచాయతీ వివిధ రుసుముల కింద రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థలు మరో రూ.5 లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. లేఅవుట్‌లో సామాజిక అవసరాల కోసం పది శాతం ఖాళీ స్థలాన్నీ వదలకుండా అమ్మేస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో కొన్న ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు రావు. పట్టణాభివృద్ధి సంస్థలు లేఅవుట్‌ ప్లాను (ఎల్‌పీ) నంబరు కేటాయించని కారణంగా బ్యాంకులు రుణాలివ్వడం లేదు. దీంతో కొన్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలుగా వస్తున్నాయి.


అక్రమ లేఅవుట్లపై చర్యలకు సిఫార్సు

‘అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్లలో 90% వరకు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నాయి. వీటిపై తదుపరి చర్యల కోసం పురపాలక శాఖలోని పట్టణ ప్రణాళిక విభాగానికి నివేదించాం. అక్రమ లేఅవుట్ల నిరోధానికి ఏర్పాటుచేసిన నిఘా కమిటీల పనితీరు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’.

-కోన శశిధర్‌, కమిషనర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని