గుడివాడ ఘటనలో తెదేపా నేతలపై కేసులు

గుడివాడ ఘటనలో తెదేపా నేతలపై కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశానికి చెందిన ముఖ్యనేతలు సహా 27 మందిపై గుడివాడ ఒకటో పట్టణ పోలీసులు కేసులు నమోదుచేశారు. వైకాపా నేతల ఫిర్యాదుపై కూడా తెదేపా నేతలపై కేసులు నమోదు చేశారు.

Published : 23 Jan 2022 03:54 IST

ముళ్లపూడి రమేష్‌ ఫిర్యాదు న్యాయసలహాకు
వైకాపా వర్గీయులపై బైండోవర్‌ కేసులు

ఈనాడు, అమరావతి: గుడివాడ ఘటనలో తెదేపా నేతలపై కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశానికి చెందిన ముఖ్యనేతలు సహా 27 మందిపై గుడివాడ ఒకటో పట్టణ పోలీసులు కేసులు నమోదుచేశారు. వైకాపా నేతల ఫిర్యాదుపై కూడా తెదేపా నేతలపై కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు బయటపెట్టడం లేదు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో మంత్రి కొడాలి నాని ఓఎస్‌డీ శశిభూషణ్‌పై కేసు నమోదు చేశారు. గాయపడిన తెదేపా కార్యకర్త ముళ్లపూడి రమేష్‌ పోలీసు అవుట్‌పోస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా కేసు నమోదు చేయలేదు. దీన్ని న్యాయసలహా కోసం పంపినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులు కేసుల నమోదులో పక్షపాతం చూపిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

27 మందిపై కేసు: తెదేపాకు చెందిన 27 మందిపై పోలీసులు సీఆర్‌పీసీ 151 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. పోలీసు నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లు గుడివాడ ఒకటో పట్టణ సీఐ గోవిందరాజు ఫిర్యాదుతో కేసు నమోదైంది. మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, బొండా ఉమా, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, వర్ల కుమార్‌రాజా, నక్కా ఆనంద్‌బాబు, కాగిత కృష్ణప్రసాద్‌, కొనకొళ్ల జగన్నాథరావు తదితరులపై కేసులు నమోదయ్యాయి.

ముళ్లపూడి రమేష్‌పై కేసు: శుక్రవారం జరిగిన దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త ముళ్లపూడి రమేష్‌తో పాటు.. మరికొందరిపై దాడి, హత్యాయత్నం కేసు నమోదైంది. తనపై హత్యాయత్నం చేశారని, తన వాహనాన్ని ధ్వంసం చేశారని వైకాపా కార్యకర్త వాలిశెట్టి సత్యనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

వైకాపా నేతలు 19 మందిపైనా..: 19 మంది వైకాపా నేతలపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. సీఆర్‌పీసీ 151 కింద 19 మందిపై సీఐ గోవిందరాజు కేసు నమోదుచేశారు. కార్యకర్తలు తోట నాగరాజు, జి.శ్రీనివాసరావు, కె.నాగరాజు తదితరులపై కేసు నమోదైంది.

బొండా ఉమా ఫిర్యాదుతో..: తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఒక కేసు నమోదుచేశారు. తమపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఉమా ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఇందులో శశిభూషణ్‌, ఇతరులు ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. తమపై హత్యకు దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా ఆ సెక్షన్‌ నమోదు చేయలేదని తెదేపా నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.

మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి: గుడివాడ ఘటనలో కేసుల     వివరాలు తెలియజేయాలని ఒకటో పట్టణ సీఐ గోవిందరాజును మీడియా కోరగా ‘మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. నేను ఎలాంటి వివరాలు చెప్పను’ అంటూ బూతులు మాట్లాడారు. మీడియా రికార్డు చేసిన దృశ్యాలను తొలగించాలని ఒత్తిడి తెచ్చారు.

పామర్రులోనూ తెదేపాపై కేసు: కృష్ణాజిల్లా పామర్రు పోలీసుస్టేషన్‌లోనూ తెదేపా నేతలపై కేసు నమోదైంది. పైవంతెన వద్ద 30 కార్లలో వచ్చిన తెదేపా నేతలు తమ విధులకు ఆటంకం కలిగించారని నూజివీడుకు చెందిన సీసీఎస్‌ సీఐ బాలశౌరి ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని