‘పోలవరం’ సవరించిన అంచనాలు ఆమోదించాలి

పోలవరం సవరించిన అంచనాలు రూ.55,656 కోట్లను త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు.

Published : 29 Nov 2021 03:29 IST

  వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

ఈనాడు, దిల్లీ: పోలవరం సవరించిన అంచనాలు రూ.55,656 కోట్లను త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన విషయాలను అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులకు తెలియజేశారు. ‘పోలవరం నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.2,006 కోట్లు, రాష్ట్రంలో వరద నష్టం నుంచి తాత్కాలిక ఉపశమనానికి రూ.1,000 కోట్లు విడుదల చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావల్సిన రూ.22,948 కోట్లు విడుదల చేయాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను ఊపసంహరించాలనే అంశాన్ని పునఃపరిశీలించాలి. రబీ కాలానికి రాష్ట్రానికి తగిన మోతాదులో ఎరువులు కేటాయించాలి. మూడు సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నాం. ఎంఎస్‌పీ విషయంలో రైతులు, రైతు సంఘాల వాదన వినేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటు చేయాలి. కేంద్రం కేవలం 23 పంటలకే ఎంఎస్‌పీ ఇస్తోంది. ఏపీ ప్రభుత్వం 24 పంటలకు ఇస్తోంది. ఈ మొత్తానికి చట్టబద్ధత కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తులకే కాకుండా సముద్రపు ఉత్పత్తులు, కోళ్ల పరిశ్రమ ఉత్పత్తులకు ఎంఎస్‌పీ ఇవ్వాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.67 కోట్ల మందికే జాతీయ ఆహార భద్రత కింద రేషన్‌ ఇస్తుండడంతో నష్టపోతున్నాం. ఈ అంశాన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలి. సంక్షేమ పథకాల సమర్థ అమలుకు సామాజిక, ఆర్థిక, కుల గణన చేపట్టాలి. మహిళా రిజర్వేషన్‌, దిశా బిల్లులను ఆమోదించాలి’ అని కోరినట్లు ఆయన తెలిపారు.  ప్రజాక్షేత్రంలో ఓటర్లు తిరస్కరించడంతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని