icon icon icon
icon icon icon

పోలీస్‌.. పక్కా వైకాపా

వైకాపాకు వంతపాడుతున్నారని.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు కూడా పడుతున్నా కొందరు పోలీసు అధికారులు ఇంకా జగన్‌ భజనే చేస్తున్నారు.

Published : 26 Apr 2024 05:39 IST

పలుచోట్ల ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల నామినేషన్లు
వైకాపా నేతల పేర్లతో ఉన్నవారిని అడ్డుకున్న పోలీసులు
గుడివాడలో ఓ దళిత యువకుడిపై ఈఆర్‌ఓ ఆగ్రహం
మచిలీపట్నంలో బాలశౌరిని పోలిన పేర్లతో నామినేషన్లు..
(ఈనాడు యంత్రాంగం)

వైకాపాకు వంతపాడుతున్నారని.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు కూడా పడుతున్నా కొందరు పోలీసు అధికారులు ఇంకా జగన్‌ భజనే చేస్తున్నారు. అక్కడక్కడా ఎన్నికల అధికారులూ వంతపాడుతున్నారు. ఎన్నికల సంఘం ఒకటుందనే భయమైన లేకపోవడం గమనార్హం. వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో ఉన్నవారెవరైనా.. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైతే చాలు దగ్గరుండి అడ్డుకున్నారు. కిడ్నాప్‌ డ్రామాలాడించారు. అదే తెదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో ఉన్న వారెవరైనా ఉంటే.. వైకాపా నేతల సహకారంతో దగ్గరుండి నామినేషన్‌ వేసేందుకు తోడ్పాటు అందించారు. గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో విడదల రజని అనే ఎస్సీ మహిళను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడంలో.. అక్కడి సీఐ లోకనాథం, పోలీసులు కృతకృత్యులయ్యారు. మంగళగిరిలో మురుగుడు లావణ్య అనే మహిళ నామినేషన్‌కు సిద్ధమైతే.. వైకాపా నేతలు ఆమెను బెదిరిస్తున్నా, వాహనాల్లో తీసుకెళ్తున్నా పట్టణ సీఐ శ్రీనివాసరావు కనీసం అడ్డుకోలేదు. గుడివాడలో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అనే వ్యక్తి నామినేషన్‌ వేసేందుకు వస్తే.. అక్కడి ఈఆర్‌ఓ పద్మావతి దురుసుగా మాట్లాడి బయటకు వెళ్లాలంటూ హెచ్చరించడమే కాకుండా పోలీసుల్ని పిలిచి క్రిమినల్‌ కేసు పెట్టమంటూ ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఇటీవలే బాధ్యతలు తీసుకున్న గుంటూరు ఎస్పీ తుషార్‌ డూడీ, కృష్ణా ఎస్పీ అద్నాన్‌ నయీం హస్మీ ఏం చేస్తున్నారు? కొందరు పోలీసులు, ఎన్నికల అధికారులు వైకాపాతో అంటకాగుతున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? 

వ్యక్తుల పేర్లు, పార్టీ పేర్లు అదే మాదిరిగా...

వైకాపా నేతలు చాలాచోట్ల జాతీయ జనసేన పార్టీ, నవరంగ్‌ కాంగ్రెస్‌, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌.. తదితర పార్టీల తరఫున కూటమి అభ్యర్థుల పేర్ల మాదిరే ఉన్న వ్యక్తులతో చివరిరోజున నామినేషన్లు దాఖలు చేయించడం గమనార్హం. మచిలీపట్నం లోక్‌సభకు జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గానికి అదే పేరున్న ఇద్దరు వేర్వేరు పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బాలశౌరమ్మ పాముల, జాతీయ జనసేన పార్టీ నుంచి బాలశౌరి సీహెచ్‌ పేరుతో ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదొక కుట్ర అని, దీని వెనుక మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నట్లు జనసేన నేతలు పేర్కొంటున్నారు.

మంగళగిరిలో లావణ్యను అడ్డుకుని..

మంగళగిరిలో మురుగుడు లావణ్య స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. అదే పేరుతో మరొకరు పోటీ చేస్తే ఇబ్బంది అనే భయంతో వైకాపా నేతలు ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారు. టిడ్కో గృహ సముదాయంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసి వైకాపా నాయకులు అక్కడకు చేరుకుని గృహనిర్బంధం చేశారు. నామినేషన్‌ వేయొద్దని హెచ్చరించారు. సుమారు గంటపాటు ఈ తంతంగం నడిచింది. అనంతరం ఆమెను, కుటుంబ సభ్యుల్ని వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వైకాపా నాయకులు లావణ్య ఇంటికి వచ్చారని తెలిసిన తెదేపా నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే సీఐ శ్రీనివాసరావు, పోలీసులు అక్కడకు చేరుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలను అక్కడ నుంచి బలవంతంగా పంపించారు. వైకాపా నేతలు సుమారు 60 మంది వరకు లావణ్య ఇంటి చుట్టూ ఉన్నా ఎంతమాత్రం పట్టించుకోలేదు. వాహనాల్లో వైకాపా నేతలు వచ్చి లావణ్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్నా.. దగ్గరుండి సాగనంపి విధేయత ఒలికించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచనలతోనే పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.


భీమిలిలో గంటా శ్రీనివాసరావు పేరుతో

భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం గంటాపేటకు చెందిన గంటా శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తి భీమిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. అక్కడి నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు బరిలో నిలిచారు. నామినేషన్ల దాఖలు గడువు మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా గంటాపేటకు చెందిన శ్రీనివాసరావు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ సమర్పించారు. వైకాపా నేతల ప్రమేయంతోనే ఇది జరిగినట్లు చెబుతున్నారు. 


ఎవరీ బత్తుల బలరామకృష్ణులు..

  •  తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. ఇదే పేరుతో జాతీయ జనసేన పార్టీ, నవరంగ్‌ కాంగ్రెస్‌, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థులుగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
  •  జనసేన అభ్యర్థి భార్య బత్తుల వెంకటలక్ష్మి ఒక నామినేషన్‌ దాఖలు చేయగా అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు వేశారు.
  •  కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన తరఫున గిడ్డి సత్యనారాయణ బరిలో ఉన్నారు. అదే పేరుతో మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.

ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు?

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే గుంటూరు, కృష్ణా ఎస్పీలను ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తప్పించింది. అయినా అక్కడ పరిస్థితి మారలేదు. కొందరు పోలీసులు ఇప్పటికీ వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తూ.. అంటకాగుతున్నారని తెదేపా నేతలు పేర్కొంటున్నారు. వీరిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే.. అధికారుల చర్యలకు మద్దతిచ్చినట్లే అవుతుందని వారంటున్నారు.


రజిని పేరుంటే.. కుదరదంతే!

గుంటూరు ఏసుభక్తనగర్‌కు చెందిన విడదల రజని అనే ఎస్సీ మహిళ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ వేయటానికి సిద్ధమయ్యారు. ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. వైకాపా నేతలు విడదల రజిని (ఏసుభక్తనగర్‌)ను అడ్డుకున్నారు. తన కుమార్తెను ఎవరో కిడ్నాప్‌ చేశారని ఆమె తండ్రితో డయల్‌ 100కు ఫోన్‌ చేయించారు. వారు సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ద్వారా ఆమెను గుర్తించి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎస్సై వెళ్లి తమవెంట రావాలని ఆదేశించారు. బలవంతంగా నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి తండ్రికి అప్పగించారు. అప్పటికే అక్కడున్న వైకాపా నేతలు ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకుపోయి నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు. భర్త అనురాగరావు వచ్చి ఆమె ఎక్కడుందో చూపాలని నిలదీయడంతో తండ్రికి అప్పగించామని చెప్పారు. సాయంత్రం వరకు ఆయనను పోలీస్‌స్టేషన్‌ లోపలే నిర్బంధించి నామినేషన్ల దాఖలు సమయం ముగిశాక వదిలిపెట్టారు. పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే వైకాపా నేతలు రజనితో ఉపసంహరణ పత్రాలపై సంతకం పెట్టించినట్లు చెబుతున్నారు. అంటే ఈ అరాచకమంతటికీ ప్రత్యక్ష సాక్షులు పోలీసులే. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని బాధితురాలే చెబుతున్నా పట్టించుకోలేదంటే.. ఖాకీ దుస్తులేసుకున్న ఈ వీరభక్త వైకాపా కార్యకర్తలు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో అర్థమవుతుంది.


గుడివాడలో.. దళిత యువకుడికి అవమానం

కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరున్న దళిత దివ్యాంగ యువకుడు నామినేషన్‌ వేసేందుకు వస్తే.. గుడివాడ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌ఓ) పద్మావతికి ఆగ్రహం వచ్చింది. కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు నామినేషన్‌ వేయడానికి వచ్చారు. అక్కడున్న ఈఆర్‌వో, ఆర్డీవో పద్మావతి.. నామినేషన్‌ తీసుకోవడానికి నిరాకరించారు. తక్షణమే బయటకు వెళ్లాలని అవమానకరంగా మాట్లాడారు. వెంకటేశ్వరరావుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయమంటూ అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆయన ఈఆర్‌వో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి.. ఇక్కడ వాగ్వాదానికి దిగితే.. క్రిమినల్‌ కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నామినేషన్‌ వేయకుండా వెంకటేశ్వరరావును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు వారిని కూడా హెచ్చరించారు. నామినేషన్‌ వేసే హక్కును హరించడానికి మీరెవరంటూ అందరూ కలిసి వాగ్వాదానికి దిగడంతో.. చివరికి అనుమతించారు. ‘నా పేరు కొడాలి వెంకటేశ్వరరావు కావడమే నా తప్పా? నేను పోటీ చేయడానికి అర్హుణ్ని కాదా? నాకు ఏదైనా ముప్పు జరిగితే అధికారులదే బాధ్యత’ అని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.


కూటమి ఓట్లు చీల్చేందుకు వైకాపా కుట్ర

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేస్తుండగా, అదే పేరున్న విజయవాడకు చెందిన తంగిరాల సౌమ్యతో వైకాపా నేతలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయించారు. ఓట్లను చీల్చేందుకు వైకాపా నాయకులు ఇలా కుట్ర పన్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img