సారా మరణాలపై పక్కదోవ పట్టిస్తున్న సీఎం

జంగారెడ్డిగూడెంలో నాటు సారా మరణాలపై ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. శాసనసభలో తెదేపా

Published : 18 Mar 2022 05:05 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కె. రామకృష్ణ విమర్శ

సారా మృతుల  కుటుంబాలకు పరామర్శ

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెంలో నాటు సారా మరణాలపై ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. శాసనసభలో తెదేపా సభ్యులు సారా మరణాల అంశాన్ని లేవనెత్తితే వారిని సస్పెండు చేశారని, కావాలని సీఎం పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో సారా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను రామకృష్ణతోపాటు సీపీఐ నాయకులు గురువారం పరామర్శించారు. తొలుత కాళ్ల దుర్గారావు, దోసూరి సన్యాసిరావు ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులతో మాట్లాడారు. సంఘటనలపై న్యాయవిచారణ జరిపించి హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, వారికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 40 మంది వరకు చనిపోయారని తమ పార్టీ నాయకులు చెబుతున్నారని వివరించారు. పర్యటన చివరలో సీపీఐ నేతలతో తెదేపా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఘంటా మురళి కలిశారు. వీరంతా కలిసి షేక్‌ యాకుబ్‌ కుటుంబీకులను పరామర్శించారు. ‘ఇద్దరు పోలీసులు మా వద్దకు తెల్ల కాగితాలు తెచ్చి సంతకం పెట్టమన్నారు. నిరాకరించా. సారా తాగడంవల్లే మా నాన్న చనిపోతే సహజ మరణమని చెప్పాలంటూ ఒత్తిడి తెస్తుండటమేంటి?’ అని ఈ సందర్భంగా యాకుబ్‌ కుమార్తె హసీనా రోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని