కొత్త జిల్లాల కలెక్టర్లలో ఒక్క ఎస్సీ అయినా ఉన్నారా?

కొత్త జిల్లాల కలెక్టర్లుగా ఒక్క ఎస్సీ ఐఏఎస్‌ అధికారినైనా నియమించకపోవడం.. ఆ సామాజికవర్గాన్ని అవమానించడమేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Published : 05 Apr 2022 05:10 IST

తిరుపతిలో పదవులన్నీ సీఎం సామాజికవర్గానికే  తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కొత్త జిల్లాల కలెక్టర్లుగా ఒక్క ఎస్సీ ఐఏఎస్‌ అధికారినైనా నియమించకపోవడం.. ఆ సామాజికవర్గాన్ని అవమానించడమేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను సమానంగా చూడాలన్న రాజ్యాంగ ధ్యేయాన్ని ఈ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తిరుపతినే పరిశీలిస్తే, జిల్లా కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, జేఈవో ధర్మారెడ్డి, సిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మరెడ్డి, బర్డ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ రాజారెడ్డి, రెక్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి, వెటర్నరీ వర్సిటీ వీసీ పద్మనాభరెడ్డి, పద్మావతి మహిళా వర్సిటీ వీసీ జమునారెడ్డి, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయరెడ్డి, తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి విజిలెన్స్‌ ఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఓబులకొండారెడ్డి.. ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన 18 మందిని దింపారు. ఇలాంటి చర్యలతో సామాజికన్యాయానికి, లౌకికవాదానికి సీఎం తూట్లు పొడుస్తున్నారు’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ సామాజికవర్గానికి చెందిన ఐదుగురు సీఐలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తే.. 33 మందికి ఇచ్చారని గగ్గోలు పెట్టిన జగన్‌రెడ్డి ఇప్పుడు చేస్తోందేంటని ప్రశ్నించారు. ‘తిరుపతిలోనే కాదు రాష్ట్రమంతా సీఎం తన సామాజికవర్గానికే అగ్రతాంబూలం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ల నియామకంలో సీనియారిటీని విస్మరించారు. సీనియారిటీలో ముందున్న ఎస్సీ వర్గానికి చెందిన పి.రాజబాబు కలెక్టర్‌గా పనికిరారా?’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని