చెరకు రైతుల మహాధర్నా భగ్నం

విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం పరిధిలోని రైతుల బకాయిలు రూ.16.33 కోట్లు చెల్లించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం పిలుపునిచ్చిన మహాధర్నాను పోలీసులు భగ్నం చేశారు. కర్మాగారం ఎదుట

Published : 21 Jan 2022 05:51 IST

ముందస్తు అరెస్టులతో అడ్డుకున్న పోలీసులు

సీతానగరం, బొబ్బిలి, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం పరిధిలోని రైతుల బకాయిలు రూ.16.33 కోట్లు చెల్లించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం పిలుపునిచ్చిన మహాధర్నాను పోలీసులు భగ్నం చేశారు. కర్మాగారం ఎదుట గురువారం ధర్నా చేపట్టనున్న నేపథ్యంలో బొబ్బిలి డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30, కర్మాగారం ఆవరణలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ మోహనరావు ముందుగానే ప్రకటించారు. సీతానగరం, బొబ్బిలి, బలిజిపేట మండలాల నుంచి ధర్నాలో పాల్గొనే రైతులను గుర్తించి ఆయా గ్రామాల్లోనే అడ్డుకున్నారు. మరోపక్క పలువురు నాయకులు రహస్య ప్రాంతాల్లో ఉండి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. కొందరు లచ్చయ్యపేట గ్రామ కూడలి నుంచి కర్మాగారానికి ర్యాలీగా వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రైతులు, నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. వారిని బలవంతంగా పోలీసులు లాక్కెళ్లి బొబ్బిలి పోలీసుస్టేషన్‌కు తరలించారు. 26 మంది రైతు నాయకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మోహనరావు వెల్లడించారు.

బకాయిలపై లభించని హామీ

2019-20, 2020-21 సీజన్‌లకు సంబంధించి ఎన్‌సీఎస్‌ యాజమాన్యం చెరకు రైతులకు చెల్లించాల్సిన రూ.16.33 కోట్ల బకాయిలపై ఎటువంటి హామీ లభించలేదు. ఆర్‌ఆర్‌ చట్టం అమలు చేసి రైతుల బకాయిలు చెల్లిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు గతంలోనే హామీ ఇచ్చినా వాస్తవ రూపం దాల్చలేదు. కర్మాగార గిడ్డంగిలోని 34,672 క్వింటాళ్ల పంచదార వేలం వేసినా.. న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరో పక్క కర్మాగార భూములు 19.90 ఎకరాలు అధిక ధరకు వేలం నిర్వహించడంతో ఎవరూ ముందుకు రాక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో గతంలో జేసీ కిశోర్‌కుమార్‌ సంక్రాంతి నాటికి చెల్లింపులు పూర్తి చేస్తామన్న హామీ అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని