Chandrababu: ప్రత్యేక హోదాపై దగా

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మాట తప్పను, మడమ తిప్పనని మాట్లాడే జగన్‌ .. ప్రతి విషయంలోనూ యూటర్న్‌ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Updated : 12 Dec 2021 06:16 IST

మాట తప్పను, మడమ తిప్పనని మోసం చేశారు
ఇప్పుడు అన్ని విషయాల్లోనూ యూటర్న్‌ తీసుకుంటున్నారు
ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడ్డ తెదేపా అధినేత చంద్రబాబు
హోదాపై ఎంపీల రాజీనామాలకు సిద్ధమా అంటూ సవాల్‌

ఈనాడు, అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మాట తప్పను, మడమ తిప్పనని మాట్లాడే జగన్‌ .. ప్రతి విషయంలోనూ యూటర్న్‌ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాజీనామా చేస్తానన్న ఆయన.. ఇప్పుడు భాజపాకు పూర్తి మెజారిటీ ఉందంటున్నారు. ఇది మోసం, దగా కాదా? చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించండి. తెదేపా ఎంపీలూ రాజీనామా చేస్తారు. అంతా కలిసి పోరాడదాం. ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాల్‌కు సిద్ధమా?’ అని ప్రశ్నించారు. శనివారం తెదేపా కార్యాలయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా అధికారంలో ఉన్న చివరి రోజుకు రాష్ట్రంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3.14 లక్షల కోట్లుంటే.. రెండున్నరేళ్లలో దాన్ని రూ.7 లక్షల కోట్లకు చేర్చారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు. కలెక్టరేట్లు తాకట్టు పెడుతున్నారు. నిధులివ్వకపోవడంతో ఆసుపత్రుల్లో రోగులకు భోజనం లేదు. మందులు లేవు. చిన్నపిల్లలకు పోషకాహారం లేదు. మధ్యాహ్న భోజనం లేదు’ అని దుయ్యబట్టారు. ‘ఎన్టీఆర్‌ హయాంలో ఇచ్చిన ఇళ్లకూ కప్పం కట్టాలా? ధైర్యం ఉంటే ఏ ఊరికైనా రండి.. బలవంతంగా ఓటీఎస్‌ చేస్తున్నారని నిరూపిస్తా’ అని సవాల్‌ విసిరారు. ‘తెదేపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. అధికారంలోకి వచ్చి మూడో ఏడాదైనా మీ ప్రభుత్వం ఎందుకివ్వలేదు? సీపీఎస్‌ సమస్యను వారంలో పరిష్కరిస్తామన్న మీ హామీ ఏమైంది?’ అని నిలదీశారు. ‘తడిసిన ధాన్యానికి క్వింటాలుకు రూ.వెయ్యి వస్తోంది. వరి వేసేందుకు కౌలు రైతులు ముందుకు రావడం లేదు’ అని విమర్శించారు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక జగన్‌ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను ప్రదర్శిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు.


హోదాపై జగన్‌ ఏమన్నారంటే

ఎన్నికలకు ముందు: 25కి 25మంది ఎంపీలు ఒక్కతాటిపై నిలబడి రాజీనామాలు చేసి, నిరాహారదీక్షకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు ఎందుకు చూడదో చూస్తాం.. కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం.  
ఎన్నికల తర్వాత: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి.. అక్కడున్న ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి.. ప్రత్యేక హోదాపై పదే పదే అడగడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం.
దీనిపై చంద్రబాబు ఏమన్నారంటే: రాష్ట్రంలో యువత దీన్ని అర్ధం చేసుకోవాలి. 25 ఎంపీ స్థానాలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, ఆంధ్రప్రదేశ్‌కు అదే సంజీవని అని, అందరికీ ఉద్యోగాలొస్తాయని, ఒంగోలు లాంటి నగరం హైదరాబాద్‌లా తయారవుతుందని జగన్‌ చెప్పారు. ఇప్పుడేమో లోక్‌సభలో భాజపాకు మెజారిటీ ఉందంటున్నారు. మేం భాజపాతో కలిసి ఉన్నప్పుడూ వారికి సొంతంగా మెజారిటీ ఉంది. కానీ కేంద్రంలో మా మంత్రులతో రాజీనామా చేయించి పోరాడాం. మీరెందుకు అలా చేయరు?


రైల్వేజోన్‌పై...
ఎన్నికల ముందు: ప్రతి రాష్ట్రానికి రైల్వే జోన్‌ ఉంది. జోన్‌ లేని అతి తక్కువ రాష్ట్రాల్లో ఖర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ఉంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖ రైల్వేజోన్‌ ఇవ్వాలి. మనకంటూ జోన్‌ ఉంటే.. ఉద్యోగార్థులు తలెత్తుకుని పోయి రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు రాయగలుగుతారు. అది లేకనే పరీక్షలకు ఒడిశా, ఇతర రాష్ట్రాలకు పోతే తరిమికొట్టి పంపిస్తున్నారు. దీనిపై కలిసికట్టుగా పోరాడదాం.
చంద్రబాబు ఏమన్నారంటే: ముఖ్యమంత్రి జగన్‌ దీనికి సమాధానం చెప్పాలి. 17 రైల్వే జోన్లు ఉన్నాయని, విశాఖపట్నం పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. రాజధాని చేస్తామంటూ విశాఖపట్నంపై ప్రేమ చూపిస్తున్నారు. కానీ అక్కడికి రావాల్సిన రైల్వే జోన్‌ పోయిందని విశాఖపట్నం, పరిసర ప్రాంతాల యువత అర్ధం చేసుకోవాలి.

విశాఖ ఉక్కుపై...
ఎన్నికల ముందు: ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదంతో 32 మంది ప్రాణాలర్పించారు. (విశాఖ ఉక్కులో పెట్టుబడులకు పోస్కో సంస్థ వస్తుందన్న విషయాన్ని జగన్‌కు చెప్పానని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ చెప్పినట్లున్న వార్తా కథనాన్ని ప్రదర్శించారు)
చంద్రబాబు ఏమన్నారంటే: ఎందుకీ లాలూచీ రాజకీయాలు? పోస్కో ప్రతినిధులతో మీరు మాట్లాడారా? లేదా? పైకి ఒకటి చెబుతూ, తెర వెనుక ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి సెంటిమెంటు లేదు, రాష్ట్రం అన్నా అభిమానం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే ఆలోచనను లోక్‌సభలో రామ్మోహన్‌నాయుడు వ్యతిరేకించారు. నేను అప్పటి ప్రధాని వాజపేయితో మాట్లాడి నిధులు సాధించా.


అమరావతి రాజధానిపై జగన్‌ ఏమన్నారంటే..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు: విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రమైంది. ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
ముఖ్యమంత్రి అయ్యాక: అధ్యక్ష్యా? మనం మారాలి. దక్షిణాఫ్రికా లాంటి దేశానికి మూడు రాజధానులున్నాయి. అమరావతిలో శాసన రాజధాని పెడితే అసెంబ్లీ నడుస్తుంది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని పెడితే యంత్రాంగమంతా అక్కడ నుంచే పని చేయొచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ లెక్కన ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయి.
చంద్రబాబు ఏమన్నారంటే: చిన్న రాష్ట్రం, విద్వేషాలు మంచిది కాదని అప్పుడు చెప్పి.. ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. జగన్‌ తాడేపల్లిలో ప్యాలెస్‌ కట్టారని అప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పారు.. ప్యాలెస్‌ కట్టి ఏం ఉద్ధరించారు? ప్రజావేదిక నుంచి అమరావతి దాకా అన్నింటా విధ్వంసమే చేశారు.

పోలవరం ప్రాజెక్టు పై  

ఎన్నికల ముందు: ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. పోలవరం తామే కడతామని తీసుకున్నారు. ఆ వెంటనే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.53 వేల కోట్లకు పెంచేశారు.
ఎన్నికల తర్వాత: పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ చేశాం.. వర్షాలు తగ్గిన తర్వాత పనులు మొదలయ్యాయి. 2021 జూన్‌ నాటికి పూర్తి చేస్తాం, నీళ్లిస్తామని చెబుతున్నా.
చంద్రబాబు ప్రశ్న: 2020 నాటికి పూర్తి చేస్తామన్నారు. తర్వాత 2021.. ఇప్పుడు 2022 అంటున్నారు. అప్పటికి కూడా సందేహమే అని కేంద్ర మంత్రి అంటున్నారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. పరిహారం కింద ఎకరానికి రూ.19 లక్షలిస్తామని రైతుల్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు అధోగతి పాల్జేశారు. తెదేపా హయాంలో పోలవరం నిర్మాణానికి రూ.11,537 కోట్లు ఖర్చు చేసి 70% పూర్తి చేశాం. మేముంటే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని