Cinema: ఏపీ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తాం: నిర్మాత దిల్‌ రాజు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవకాశమిస్తే చిత్ర పరిశ్రమ సమస్యలపై మాట్లాడాలనుకుంటున్నామని నిర్మాత దిల్‌ రాజు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని, అన్ని సమస్యలు త్వరలోనే

Updated : 28 Dec 2021 16:18 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవకాశమిస్తే చిత్ర పరిశ్రమ సమస్యలపై మాట్లాడాలనుకుంటున్నామని నిర్మాత దిల్‌ రాజు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని, అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్ల పరిస్థితిపై సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు దిల్‌ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే చిత్ర పరిశ్రమ తరఫున సీఎం, మంత్రుల్ని కలవాలనుకుంటున్నాం. తెలంగాణలో వచ్చినట్లే ఏపీలోనూ ఓ జీవో వస్తుందని ఆశిస్తున్నాం. ఏపీలో ఉన్న టికెట్ల రేట్లు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సినీ పెద్దలు అందులో సభ్యులుగా ఉన్నారు. వాళ్లే ప్రభుత్వంతో మాట్లాడతారు. దయచేసి ఈలోగా సినిమా వాళ్లెవరూ ఈ అంశంపై మాట్లాడొద్దు. ట్వీట్లు చేయొద్దు. నిర్మాతలుగా మాకూ కొన్ని సమస్యలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చినట్లే ఐదో ఆటకు ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి అడగాలనుకుంటున్నాం. ఎగ్జిబిటర్లకు కొన్ని సమస్యలున్నాయి. మా (నిర్మాతలు) సమస్యలు వేరు. వారి ఇబ్బందులు వేరు. కమిటీలో వీరూ ఉండనున్నారు. ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు తెలుస్తాయని భావిస్తున్నాం. జరిగిన దాని గురించి కాకుండా తెలుగు సినిమా మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా ఏం చేయాలో మాట్లాడతాం. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకముంది. త్వరలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాం’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, స్రవంతి రవికిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.


థియేటర్లు మూతపడుతుంటే ఏడుపొస్తోంది
ఆర్‌.నారాయణమూర్తి

‘ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూతపడ్డాయని వార్తలు చదువుతుంటే ఏడుపొస్తుంది. ఇండస్ట్రీపై ఆధారపడి ప్రత్యక్షంగా.. పరోక్షంగా కోట్లాది మంది బతుకుతున్నారు. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపించి.. అన్ని థియేటర్లు తెరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని నటుడు, దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విజయోత్సవ వేడుకలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా తీసేవాడు.. చూపించేవాడు బాగుంటేనే చలన చిత్ర పరిశ్రమ బాగుంటుంది. ఈ ఇండస్ట్రీపై ఆధారపడి కోట్లాది మంది బతుకుతున్నారు. థియేటర్‌ యజమానులారా సినిమా హాళ్లను మూయకండి. ఈ విషయమై ఫిల్మ్‌ ఛాంబర్‌ పెద్దలకు, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పెద్దలకు, ‘మా’ అధ్యక్షుడికి, సినీ నిర్మాతలు, నటులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్థానిక మంత్రుల్ని కలవండి. సమస్యని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్లండి. ప్రభుత్వంతో సానుకూలంగా ఉండండి. నెగెటివ్‌గా ఆలోచించవద్దు. ఎమోషన్‌ అవ్వొద్దు’ అని సూచించారు.


సినిమా టికెట్ల రేట్ల పరిశీలనకు కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్ల అంశాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయనుంది. దీనికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌ అండ్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. రెవెన్యూ, పురపాలక-పట్టణాభివృద్ధి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్లను సభ్యులుగా నియమించనుంది. ఎగ్జిబిటర్ల నుంచి వేమూరి బలరత్నం (శ్రీకృష్ణ థియేటర్స్‌, మచిలీపట్నం), డిస్ట్రిబ్యూటర్ల నుంచి తుమ్మల సీతారామప్రసాద్‌తో పాటు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఉపాధ్యక్షుడు ముత్యాల రామదాస్‌ కమిటీలో సభ్యులు. సినీ గోయర్స్‌ అసోసియేషన్‌ నుంచి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సర్టిఫికేషన్‌ సభ్యుడు వడ్డే ఓంప్రకాశ్‌ నారాయణ, నంద్యాలకు చెందిన డా.జూపల్లె రాకేశ్‌రెడ్డి, విజయనగరానికి చెందిన గంప లక్ష్మి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముసాయిదా జీవోను సిద్ధం చేసింది. మంగళవారం ఈ జీవో విడుదలయ్యే అవకాశముంది.


టికెట్ల సమస్యపై సీఎం స్పందించాలి
తూర్పుగోదావరి జిల్లా సినీ పంపిణీ, ప్రదర్శనదారులు

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: నగరాల్లో మాదిరిగానే దిగువ, కిందిస్థాయి (బి, సి) కేంద్రాల్లోనూ సినిమా టికెట్ల ధరలను నిర్ణయించాలని తూర్పుగోదావరి జిల్లా సినీ పంపిణీ, ప్రదర్శనదారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం జిల్లా సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమన్వయ కమిటీ సమావేశాన్ని సంఘం జిల్లా కార్యదర్శి కోళ్ల అచ్యుతరామారావు అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించారు. సమావేశంలో తీర్మానించిన అంశాలు, భవిష్యత్తు కార్యాచరణను సంఘ సభ్యులు విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35 ప్రకారం థియేటర్లను నడపాలంటే నెలకు సుమారు రూ.2 లక్షల సొంత సొమ్ము ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఈ మేరకు జేసీని కలిసి సమస్యను విన్నవించామని, ప్రస్తుతానికి ఆయన సెలవులో ఉన్నారని.. త్వరలో సినిమా టికెట్ల ధరల విషయంలో సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. జీవో 35ను హైకోర్టు రద్దు చేసినా ప్రభుత్వం డివిజనల్‌ బెంచ్‌ను ఆశ్రయించిందని, ఆ తీర్పునకు అనుగుణంగా మళ్లీ రాష్ట్ర స్థాయిలో సమీక్షించుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సీఎం స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని 134 థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.


నేడు మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్ల భేటీ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం మంత్రి పేర్ని నానితో భేటీ కానున్నారు. టికెట్ల ధరల్ని తగ్గించటంవల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. థియేటర్లలో జరుగుతున్నవరుస తనిఖీల అంశంపైనా చర్చించనున్నారు. మొత్తం 20 మంది డిస్ట్రిబ్యూటర్లు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని