Updated : 31 Dec 2021 04:24 IST

AP News: జేసీలను కలవండి

లోపాల దిద్దుబాటుపై హామీ ఇవ్వండి
పరిశీలించే అధికారం వారిదే..
థియేటర్ల యజమానులతో మంత్రి పేర్ని నాని

ఈనాడు- అమరావతి, మచిలీపట్నం కార్పొరేషన్‌- న్యూస్‌టుడే: థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని జిల్లాల సంయుక్త కలెక్టర్లకు విన్నవిస్తే వారు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిని సీనియర్‌ నటుడు ఆర్‌.నారాయణమూర్తి గురువారం కలిశారు. ఈ సందర్భంగా అక్కడున్న సినీ పరిశ్రమ వారినుద్దేశించి మంత్రి మాట్లాడారు. సీజ్‌ చేసిన థియేటర్లకు సంబంధించిన అనుమతుల పునరుద్ధరణ, ఇతర లోపాలను నెలలోగా సరిదిద్దుకుంటామని యజమానులు హామీ ఇస్తే పరిశీలించే అధికారం జేసీలకు ఉందని స్పష్టం చేశారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘చట్ట ప్రకారం థియేటర్ల తనిఖీ, సంజాయిషీ నోటీసుల జారీ, సీజ్‌ చేసే అధికారం జేసీలకు ఉంది. బీఫాం అనుమతులు పునరుద్ధరించుకోకుండా.. అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర పత్రం లేకుండా థియేటర్లను నడపడం దుర్మార్గం. నిబంధనల ప్రకారం అనుమతులు పునరుద్ధరించుకోవాలని సెప్టెంబరులోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా డిసెంబరు వరకు స్పందించకుండా థియేటర్లను నడిపితే ఎలా? వాటి తనిఖీ సమయంలో గుర్తించిన లోపాల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల బాగోగులను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? దీనికి భిన్నంగా కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నామని ఎలా చెబుతారు? అనుమతుల్లేని థియేటర్లను నడిపించడం ధర్మమా? కొందరు ప్రభుత్వం గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. జిల్లాల్లో అధికారులను కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని నన్ను కలిసిన పలువురు కృష్ణా జిల్లా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లకు స్పష్టంగా చెప్పా’ అని తెలిపారు.

పంతాలను సినీ పరిశ్రమకు ముడిపెట్టొద్దు: నారాయణమూర్తి

‘సినీ పరిశ్రమకు పంతాలను ముడిపెట్టొద్దు. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ బడ్జెట్‌ సినిమాలకు టికెట్‌ ధరలు ఎంతైనా పెంచుకోవచ్చనే డిమాండును ఖండిస్తున్నా. సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టికెట్‌ ధరలు నిర్ణయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో సినిమా తీసేవాళ్లు, చూపించేవాళ్లు, చూసేవాళ్లందరికీ మంచి అనిపించే నిర్ణయం తీసుకోవాలి. దీనిపై ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌, ఫిలిం ఛాంబర్‌, సినిమా పెద్దలకు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసే అవకాశం కల్పించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి పేర్నిని కోరా. ఎవరైనా సరే వ్యక్తిగత ఇష్టాఇష్టాలను పరిశ్రమకు ముడిపెట్టడం సరికాదు’ అని ఆర్‌.నారాయణమూర్తి పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని