Updated : 12 Feb 2022 05:25 IST

Andhra News: ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.6,72,214 కోట్లు

చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.2,02,543 కోట్లు
రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పులపాలు చేసింది
మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి
రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ గత రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. 2019 మేలో సీఎంగా చంద్రబాబు దిగి పోయే నాటికి అప్పు రూ.2,02,543 కోట్లని ప్రస్తుత ప్రభుత్వం విచక్షణారహితంగా అప్పులు చేయడంతో 2021 డిసెంబర్‌ నాటికి అది రూ.6,72,214 కోట్లకు చేరిందని తెలిపారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఎనిమిది ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరపాటుతో ఆమోదించిన విభజన చట్టం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తోంది. రాజకీయాలను పక్కనపెట్టి మా రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలి. రాజధాని అమరావతిని కాపాడి, దానికి మద్దతు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి అనిశ్చితి నెలకొల్పింది. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు కేటాయించాలి. ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే 8 ఏళ్లు గడిచిపోయింది.

రాష్ట్రంలో అపసవ్య పాలన
ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అన్ని వ్యవహారాలూ బడ్జెట్‌లో పొందుపరిచిన విధానాలకు విరుద్ధంగా సాగుతున్నాయి. 2019 మే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,02,543 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన గ్యారెంటీలు రూ.1,53,134 కోట్లు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.79వేల కోట్లు. డిస్కంల బకాయిలు రూ.29వేల కోట్లు. ఇవన్నీ కలిపితే ప్రస్తుత అప్పు రూ.6,72,214 కోట్లకు చేరింది. 2018-19లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.44,234 కోట్లు రాగా 2021-22నాటికి అది రెట్టింపై రూ.86,866కోట్లు వచ్చింది. కేంద్రం నుంచి ఈ స్థాయిలో నిధులు వస్తున్నా రాష్ట్రం విచక్షణారహితంగా అప్పులు చేస్తోంది. కాగ్‌ అంచనాల ప్రకారం 2019-20లో రెవెన్యూ లోటు అంచనాలకు మించి.1486 శాతం పెరిగినట్లు కాగ్‌ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే రెవెన్యూలోటు రూ.40,829 కోట్లకు చేరింది. రెవెన్యూలోటు రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా వేయగా అది 816% పెరిగినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ నిబంధనలను ఉల్లంఘించి రూ.41,043 కోట్లు ఉపసంహరించుకోవడం పట్ల  ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ 2021 మే 4న రాసిన లేఖలో అభ్యంతరం తెలిపారు.  రాష్ట్ర రుణ సేకరణ కూడా బడ్జెట్‌ అంచనాలను మించిపోయినట్లు కాగ్‌ హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం గ్యారెంటీల నిష్పత్తిని 90% నుంచి 180%కి పెంచుతూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించింది. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ ఇటీవల విజయవాడకు వెళ్లినప్పుడు వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి రూ.25వేల కోట్ల రుణాలు సేకరించారు. 2021-22లో రాష్ట్ర రుణ సేకరణ పరిమితిని రూ.42,474 కోట్లకు పెంచాలని సీఎం జనవరి 3న ప్రధానికి లేఖ కూడా రాశారు. యేటా రాష్ట్ర ప్రభుత్వం రూ.80వేల కోట్ల మేర అప్పులు చేస్తోంది. ఇది అనుమతిచ్చిన దానికంటే రెట్టింపు. నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న అప్పులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి’ అని కనకమేడల డిమాండ్‌ చేశారు.

మోదీతో పోట్లాడే ధైర్యం లేదా..?
‘రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. దానిపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్‌  స్పందించలేదు. న్యాయం చేయమని ప్రధానమంత్రి మోదీతో పొట్లాడే ధైర్యం ముఖ్యమంత్రికి, వైకాపాకు లేదా’ అని కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రధానిని వైకాపా ప్రశ్నించలేకపోవడానికి కారణం వారి అసమర్థతా? లేక కేసుల భయమా? ప్రత్యేక హోదా కోసం ప్రధాని మెడలు వంచుతారా లేక కాలయాపన చేస్తారా? తేల్చుకోండి. కేంద్రంపై వైకాపా ఎంపీలు పోరాడితే మేము వారి వెంట ఉంటాం’ అని ఆయన అన్నారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని