Andhra News: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి

యూటీఎఫ్‌ తలపెట్టిన ‘సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి’ని భగ్నం చేసేందుకు పోలీసులు అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. క్యాంపు కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతాన్ని దిగ్బంధించారు.

Published : 25 Apr 2022 07:46 IST

‘సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి’ భగ్నానికి విస్తృత బందోబస్తు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు నేరవార్తలు, తాడేపల్లి: యూటీఎఫ్‌ తలపెట్టిన ‘సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి’ని భగ్నం చేసేందుకు పోలీసులు అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. క్యాంపు కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతాన్ని దిగ్బంధించారు. అక్కడ అయిదంచెల భద్రత ఏర్పాటుచేశారు. తనిఖీల కోసం 52 చోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. వెయ్యిమంది పోలీసుల్ని మోహరించారు. జాతీయ రహదారిపై నుంచి సీఎం నివాసానికి వెళ్లాలంటే తాడేపల్లి వద్ద సర్వీసు రోడ్డులోకి దిగాలి. అలా వెళ్లేందుకు వీల్లేకుండా 200 మీటర్ల మేర ఇనుప కంచె వేశారు. తాడేపల్లికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ తనిఖీలు విస్తృతం చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు రేంజ్‌ పరిధిలోని ఇతర జిల్లాల నుంచి బలగాలను రప్పించారు. సివిల్‌, ఏఆర్‌, ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ తదితర విభాగాల వారిని విధులకు పిలిపించారు. మారువేషాలు, సాధారణ దుస్తుల్లో పోలీసులు మాటు వేశారు. ఆదివారం రాత్రి నుంచి వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు అనుమానితులను, నిరసనకారులను, ఆయా సంఘాల వారిని అదుపులోకి తీసుకొని సమీప పోలీసుస్టేషన్లకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు ఆంక్షలు, నిర్బంధాల్ని లెక్కచేయకుండా ఎలాగైనా ముట్టడిని విజయవంతం చేయాలనే యోచనలో ఉపాధ్యాయులు ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలుసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులకు కార్యక్రమంలో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని