CM Jagan: కరోనా విపత్తు కనువిప్పు కావాలి

కరోనా విసిరిన సవాలును దృష్టిలో ఉంచుకుని వైద్య రంగంలో సమూల మార్పులు అవసరమని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. దావోస్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు సోమవారం ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్‌) భవిష్యత్తుకు సాక్ష్యంగా ఆరోగ్య వ్యవస్థలు (ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టం) అనే అంశంపై నిర్వహించిన పబ్లిక్‌ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు.

Updated : 11 Aug 2022 14:17 IST

వైద్య రంగంలో సమూల మార్పులు అవసరం
దావోస్‌ డబ్ల్యూఈఎఫ్‌లో సీఎం జగన్‌
పలు సంస్థలతో సమావేశాలు, చర్చలు
రాష్ట్రంలో అదానీ భారీ పెట్టుబడులు

ఈనాడు, అమరావతి: కరోనా విసిరిన సవాలును దృష్టిలో ఉంచుకుని వైద్య రంగంలో సమూల మార్పులు అవసరమని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. దావోస్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు సోమవారం ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్‌) భవిష్యత్తుకు సాక్ష్యంగా ఆరోగ్య వ్యవస్థలు (ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టం) అనే అంశంపై నిర్వహించిన పబ్లిక్‌ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. కొవిడ్‌ విపత్తును ఎదుర్కోవటంలో రాష్ట్రం అనుసరించిన విధానాలను వివరించారు. అనంతరం వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు మన దేశానికి చెందిన హీరో గ్రూపు ఛైర్మన్‌, ఎండీ పవన్‌ ముంజల్‌, టెక్‌ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీలతో ఏపీ పెవిలియన్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పబ్లిక్‌ సెషన్‌లో సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘కొవిడ్‌ మన తరంలో ఎన్నడూ చూడని విపత్తు. ఇది ఎన్నో గుణపాఠాల్ని నేర్పింది. వాటికి అనుగుణంగా వైద్య రంగంలో మార్పులు చేయాలి. విపత్తు సమయంలో నివారణ, నియంత్రణ చికిత్స విధానాలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు వైద్య సేవలను సామాన్యులకూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఏర్పడింది. పరిమిత వనరులతోనే విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాం. ప్రధానంగా గుర్తింపు.. పరీక్షలు.. చికిత్సపై (ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌) దృష్టి పెట్టాం’ అని సీఎం పేర్కొన్నారు.

శక్తి మేరకు పని చేశాం

‘మాది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అత్యాధునిక వైద్య సేవల విషయంలో వెనుకబడి ఉన్నాం. ఈ లోపాన్ని ముందుగానే అంచనా వేసి ప్రాథమిక స్థాయిలోనే కరోనా కేసులను గుర్తించి మహమ్మారి వ్యాప్తిని నియంత్రించాలని భావించాం. 44 సార్లు ఇంటింటా సర్వే నిర్వహించాం. దీనివల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయి. దేశంలో మరణాల రేటు 1.21 శాతం ఉంటే... రాష్ట్రంలో 0.63 శాతమే. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చర్యల్లో భాగంగా విలేజ్‌ క్లినిక్‌లు, ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) అందుబాటులోకి తెస్తున్నాం’ అని సీఎం వివరించారు. ‘ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని మెడికల్‌ కళాశాలల నిర్మాణం చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలు అందించాలన్నదే దీని ఉద్దేశం’ అని పేర్కొన్నారు.

ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు

* విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో టెక్‌ మహీంద్రా సహకరిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ఆయన దావోస్‌లో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంతోపాటు, 30 నైపుణ్య కళాశాలలు, 175 నైపుణ్య హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఆయనకు వివరించారు. సీఎంతో సమావేశం తర్వాత గుర్నానీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి మహీంద్ర అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది. దీనికి అన్ని విధాలా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు’ అని చెప్పారు.  
* విద్యారంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంపై సీఎంతో చర్చించారు. స్మార్ట్‌ పోర్టులు, కొత్త తరహా ఇంధనాలపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.  
* భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌ బృందంతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై బృందంతో చర్చించారు.
* భారత్‌లో ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి కంపెనీ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తామని టోక్యో ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, సీఈవో తకిషి హషిమొటో పేర్కొన్నారు. సీఎం జగన్‌తో సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ‘షిప్పింగ్‌, సరకు రవాణా రంగంలో రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై చర్చించాం. మేమూ మా వ్యాపారాన్ని విస్తరిస్తాం’ అని పేర్కొన్నారు. కంటైనర్‌, లాజిస్టిక్‌ రంగాలపై సంస్థ పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆయన్ను కోరారు. కాకినాడలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
* రాష్ట్రంలో ప్లాంటు విస్తరణ గురించి హీరో గ్రూపు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజల్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చించారు.

రాష్ట్రంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు

రాష్ట్రంలో రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్‌లో ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్‌, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తరఫున ఆశిష్‌ రాజ్‌వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా కాలుష్యం లేని ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ సంస్థ అంగీకరించింది.  3,700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టు, 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.60వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని