తెర వెనుక ఎవరు?

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం మూలాల శోధనలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం వెనుక కుట్రకోణం ఉందనే వ్యాఖ్యలు రావడంతో ఆ దిశగానూ

Updated : 27 May 2022 08:18 IST

అమలాపురంలో విధ్వంస మూలాలపై శోధన

కోనసీమ జిల్లాను జల్లెడపడుతున్న పోలీసులు

మంత్రి విశ్వరూప్‌ వ్యాఖ్యలతో  రాజకీయ కోణంలోనూ ఆరా

మళ్లీ నిలిచిపోయిన ఇంటర్నెట్‌ సేవలు

ఈనాడు- అమలాపురం, న్యూస్‌టుడే- అమలాపురం పట్టణం, పి.గన్నవరం, అల్లవరం: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం నాటి విధ్వంసం మూలాల శోధనలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడం వెనుక కుట్రకోణం ఉందనే వ్యాఖ్యలు రావడంతో ఆ దిశగానూ దర్యాప్తు ముమ్మరం చేశారు. తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులు వైకాపా బీసీ కౌన్సిలర్‌తో మంతనాలు జరిపారని మంత్రి విశ్వరూప్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతవరకూ కోనసీమ సాధన సమితి ఆందోళనలోకి రౌడీషీటర్లు చొరబడ్డారని భావించిన పోలీసులకు.. మంత్రి వ్యాఖ్యల దిశగానూ దర్యాప్తు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. మంత్రి వ్యాఖ్యలతో అధికారపార్టీ నాయకుడూ ఈ కుట్రలో ఉన్నారనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వ్యూహాత్మకమేనా?: వైకాపా కౌన్సిలర్‌ను తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ప్రభావితం చేశారనే మంత్రి వాదనతో.. అమలాపురంలో గతంలో మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక పదవి ఆశించి భంగపడ్డ ఓ నాయకుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇతర పార్టీల నాయకులెవరో స్పష్టత రాకపోవడంతో వారెవరనే చర్చ నడుస్తోంది. అప్పట్లో ఈ ప్రాంతానికి చెందిన ఓ సామాజికవర్గం అధిష్ఠానం మీద ఒత్తిడి తేవడంతో జిల్లాకు కోనసీమ పేరు అనివార్యమైంది. తర్వాత అధికార పక్షానికి చెందిన ఓ కీలకనేత అంబేడ్కర్‌ జిల్లాను ప్రకటించాలన్న ఉద్యమాన్ని తెర వెనుక నుంచి ప్రోత్సహించారనే ప్రచారం జరిగింది. జిల్లా పేరు మారిన తర్వాత పరిణామాలకూ ఈయనే ఆద్యుడనే ఆరోపణలున్నాయి. శాంతియుతంగా సాగాల్సిన ఉద్యమం హింసాత్మకంగా మారడం వెనుక కుట్రకోణంపైనా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా నిధులు సమకూర్చి.. రౌడీషీటర్లను, నేర చరితులను రంగంలోకి దింపడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయిని తెలుస్తోంది. 

కొనసాగుతున్న నిఘా

అమలాపురం విధ్వంసంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గత మూడు రోజులుగా అదనపు డీజీ, డీఐజీ, పలు జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులు, సిబ్బంది కోనసీమలోనే బసచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అమలాపురంలో నిఘా గురువారమూ కొనసాగింది. ప్రధానమార్గాల్లో, దుకాణాల వద్ద, బస్‌షెల్టర్ల వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. అమలాపురం అల్లర్లతోపాటు బుధవారం రావులపాలెంలో అలజడికి కారణమైన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అమలాపురం విధ్వంసం కేసు దర్యాప్తునకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, మీడియా చిత్రీకరించిన దృశ్యాలు, సామాజిక మాధ్యమాల్లో ఉన్న విధ్వంస దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. అమలాపురం పట్టణం, సమనస, సవరప్పాలెం గ్రామాలు.. అల్లవరం మండలం బెండమూడిలంక తదితర గ్రామాల నుంచి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బుధవారం నాటికి అల్లర్లలో పాల్గొన్నవారిలో వెయ్యి మందిని గుర్తించారు. వీరిలో 46 మందిని కీలక వ్యక్తులుగా భావించి ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పేర్లు చేర్చారు. వారిలో 26 మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలివారిలో దాదాపు అన్ని పార్టీలవారూ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా ఈ ఆందోళన జరిగినా.. ఇతరుల చొరబాటు హింసకు దారితీసింది. 

అగ్నిమాపక శాఖ నిస్సహాయత

అమలాపురం ఘటనలో అగ్నికీలలు చెలరేగినా సకాలంలో చేరుకుని మంటలు ఆర్పడంలో అగ్నిమాపక శాఖ విఫలమైంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 4.50కు తొలి ఫోన్‌కాల్‌ అందుకున్న అమలాపురం అగ్నిమాపక అధికారులు వాహనంతో కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నా.. ఆందోళనకారులు రాళ్లతో దాడికి దిగి వారిని అడ్డుకోవడంతో అచేతనంగా ఉండిపోయారు. ఆందోళన అక్కడినుంచి మళ్లిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోగా వాహనంలో నీరు అయిపోవడంతో కాలువలో నీరు నింపుతుండగా మంత్రి ఇంటిని కాల్చినట్లు సమాచారం వచ్చింది. ఆ దారిలోనూ ఆందోళనకారులు అడ్డుతగలడంతో సిబ్బంది ప్రాణభయంతో వేరే మార్గంలో వెళ్లిపోయారు. రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, కాకినాడ నుంచి వాహనాలు రప్పించినా.. నష్టం అంతా జరిగేవరకూ వాహనాలు చేరుకోలేకపోయాయి.

నిలిచిన ఇంటర్నెట్‌

ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్‌ సేవలను కోనసీమ జిల్లావ్యాప్తంగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాలతో బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు అన్ని ప్రైవేటు సెల్‌ నెట్‌వర్క్‌ సేవలు రెండు రోజులుగా నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం కొన్నిచోట్ల సిగ్నల్స్‌ కొద్దిసేపు అందినా తర్వాత స్తంభించాయి. ప్రభుత్వ కార్యకలాపాలతోపాటు.. బ్యాంకులు, ఏటీఎం, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఆన్‌లైన్‌ సేవలకు విఘాతం కలిగింది. గూగుల్‌పే, ఫోన్‌పే తదితర సేవలూ నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని