ఊరెళ్లినా... సభకు రావాల్సిందే!

‘ఎవరైనా ఊరెళితే వెంటనే తిరిగొచ్చి, బహిరంగసభకు హాజరు కావాలి.. లేకపోతే తర్వాత పరిణామాలకు బాధ్యులు కావాల్సి వస్తుంది...’ అని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు అధికారులు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ‘సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర’  శుక్రవారం పాత గాజువాక కూడ

Published : 27 May 2022 05:36 IST

మంత్రుల యాత్రపై డ్వాక్రా గ్రూపులకు ఆదేశాలు

గాజువాక, న్యూస్‌టుడే: ‘ఎవరైనా ఊరెళితే వెంటనే తిరిగొచ్చి, బహిరంగసభకు హాజరు కావాలి.. లేకపోతే తర్వాత పరిణామాలకు బాధ్యులు కావాల్సి వస్తుంది...’ అని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు అధికారులు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ‘సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర’  శుక్రవారం పాత గాజువాక కూడలికి చేరనుంది. అక్కడే బహిరంగసభ నిర్వహణకు వైకాపా శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్వాక్రా పొదుపు సంఘాల సభ్యుల్లో ఏ ఒక్కరూ గైర్హాజరు కాకూడదంటూ జీవీఎంసీ పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం (యూసీడీ) అధికారులు హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన ఆడియోలు గురువారం సాయంత్రం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆర్పీలు, సీఓలు సామాజిక మాధ్యమాలద్వారా గంట గంటకూ గ్రూపుల్లో సభ్యులను అప్రమత్తం చేస్తున్నారు. దీనిపై పలువురు మహిళలు తీవ్ర అభ్యంతరాలు చెబుతూ ఇలా బలవంతపు తరలింపులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే డ్వాక్రా నుంచి తొలగిపోతామని పేర్కొంటున్నారు.

మహిళలను సభకు తీసుకురావాలి

తొలుత గురువారం ఉదయం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జోన్‌-6 పరిధి డ్వాక్రా సీవో (కమ్యూనిటీ ఆర్గనైజర్లు), రిస్సోర్సు పర్సన్లు (ఆర్‌పీ), యూసీడీ విభాగ అధికారులతో జన సమీకరణకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సభకు ప్రతి మహిళను తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు. గాజువాక జోన్‌లో 6,100 గ్రూపుల్లో 67,910 మంది సభ్యులు ఉన్నారని, వీరిలో కనీసం 30 వేల మందిని సభకు తీసుకురావాలని ఆదేశాలిచ్చారు. ఆటోలు, శివారు ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేసే బాధ్యతలను వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇన్‌ఛార్జులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని