Updated : 28 May 2022 07:02 IST

నీరు లేకున్నా పండే వరి!

కరవును తట్టుకునే జన్యువు 

గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు 

ఈనాడు, ప్రత్యేక విభాగం: వరి సాగు అనగానే నిండా నీళ్లున్న పొలాలే మదిలో మెదులుతాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ప్రధాన ఆహారమైన ఈ పంటకు భారీగా జలం  వినియోగమవుతోంది. వర్షాభావ, కరవు పరిస్థితులు ఉన్నప్పుడు వరి సాగు కష్టమవుతోంది. దీన్ని అధిగమించే ఒక జన్యువును చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీటి కొరత ఉన్నా.. మంచి దిగుబడులు సాధించేందుకు ఇది వీలు కల్పిస్తుందని వారు చెబుతున్నారు.

ఎందుకు?: ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆహార ధాన్యాల్లో వరి ఒకటి. గోధుమ, మొక్కజొన్న వంటి పంటలతో పోలిస్తే నీటి కొరత ప్రభావం దీనిపై ఎక్కువ. సంప్రదాయసిద్ధంగా భారీగా నీటిని ఉపయోగించి ఈ పంటను సాగు చేయడమే ఇందుకు కారణం. కిలో వరి ధాన్యాన్ని పండించడానికి 4,500-5,000 లీటర్ల నీరు అవసరమని అంచనా. నిజానికి ఇది నీటిలో పెరిగే మొక్క కాదు. అయితే నీట మునిగినా తట్టుకునే లక్షణం దీని సొంతం. వరి పంటలో కలుపు మొక్కల బెడదను తగ్గించడానికి రైతులు ఈ గుణాన్ని ఉపయోగించుకుంటున్నారు. వరి పొలాన్ని భారీగా నీటితో ముంచెత్తుతూ.. నేలకు సూర్యకాంతి, గాలి అందని పరిస్థితి కల్పిస్తున్నారు. దీనివల్ల కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతోంది. 

అయితే అంతిమంగా.. వరిసాగు చేయాలంటే భారీ నీటి వినియోగం అవసరంగా మారిపోయింది. కొన్నిచోట్ల నీటి యాజమాన్య పద్ధతులు సరిగా లేక వృథా ఎక్కువగా జరుగుతోంది. సరైన విధానాలు అవలంబిస్తే కిలో వరి సాగుకు 600 లీటర్ల నీరు చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భారత్‌లో సరాసరిన 15వేల లీటర్ల మేర వాడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడిని తట్టుకునే వరి వంగడాలను అభివృద్ధి చేయాల్సిన తక్షణావసరం ఏర్పడింది. 

ఈ జన్యువే కీలకం: చైనాలోని షాంఘై ఆగ్రోబయలాజికల్‌ జీన్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ అంశంపై దృష్టి పెట్టారు. కరవు పరిస్థితుల్లో సాగు చేసిన వరిని.. సాధారణ పరిస్థితుల్లో పెరిగిన మొక్కలతో పోల్చి చూశారు. తద్వారా నీటి కొరతను అధిగమించడంలో సాయపడే ఓఎస్‌ఆర్‌ఐఎన్‌జీజడ్‌ఎఫ్‌1 జన్యువును కనుగొన్నారు. క్రోమోజోమ్‌4ను నిశితంగా మ్యాప్‌ చేయడం ద్వారా దీని జాడను పసిగట్టారు. ఈ జన్యువు వరి మొక్కల్లోని కణాల్లో నీటి ప్రవాహ మార్గాలను తగ్గిస్తుంది. తద్వారా కరవు పరిస్థితుల్లో నీటిని పరిరక్షించుకునే సామర్థ్యాన్ని మొక్కలో పెంచుతుంది. 

* ఈ జన్యువు క్రియాశీలత అధికంగా ఉంటే.. కరవు, లవణీయత వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వరి మొక్కకు సమకూరుతుంది. అది లోపిస్తే నీటి ఎద్దడి తాకిడికి ఎక్కువగా లోనవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.   

* ఈ జన్యువు క్రియాశీలత అధికంగా ఉన్న వరి వంగడం.. కరవు పరిస్థితుల్లో సాధారణ వరి కన్నా 10 శాతం అధికంగా దిగుబడినిస్తుందని తేల్చారు.

* ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరే ప్రధాన ఆహారం. 

* వందకుపైగా దేశాల్లోని 6.4 కోట్ల హెక్టార్లలో ఈ పంటను పండిస్తున్నారు. 

* ఏటా 70 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతోంది. 

* ప్రపంచ వరి ఉత్పత్తిలో ఆసియా వాటా 90 శాతం.   

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని