‘విదేశీ విద్య’పై సమీక్షిస్తున్నాం

వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విదేశీ విద్య పథకం అమలు తీరు, సాధించిన ఫలితాలను మదింపు/సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని మైనారిటీ సంక్షేమ

Published : 24 Jun 2022 04:18 IST

2020-21కి ఆ పథకాన్ని పక్కనపెట్టాం
ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని ప్రకటిస్తుంది..
హైకోర్టులో మైనారిటీ సంక్షేమశాఖ అఫిడవిట్‌

ఈనాడు, అమరావతి: వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విదేశీ విద్య పథకం అమలు తీరు, సాధించిన ఫలితాలను మదింపు/సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి (అదనపు బాధ్యతలు) ఎండీ ఇంతియాజ్‌ హైకోర్టులో అఫిడవిట్‌ వేశారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యం, పథకాన్ని మదింపు చేస్తున్నందున 2020-21 సంవత్సరానికి తాత్కాలికంగా పక్కనపెట్టాలని అన్ని కార్పొరేషన్లకు ప్రభుత్వం సమాచారమిచ్చిందని తెలిపారు. మదింపు చేస్తూ జిల్లా అధికారుల నివేదికలు కోరిందని.. అవి అందాల్సి ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు విదేశీ విద్య సాయం అందినవారి విషయంలో విజిలెన్స్‌ విచారణ సాగుతోందని తెలిపారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. పథకం కింద కొత్తగా దరఖాస్తులను స్వీకరించలేదని వివరించారు. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 21న ఎండీ ఇంతియాజ్‌ హైకోర్టులో అఫిడవిట్‌ వేశారు. ముస్లింలకు ‘విదేశీ విద్య’ను అమలు చేయకపోవడాన్ని, 527 మంది విద్యార్థులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహ్మద్‌ ఫరూక్‌ షిబ్లీ, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాజావలీ వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. అవి గురువారం విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులిచ్చింది. దీంతో మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఏప్రిల్‌లో అఫిడవిట్‌ వేశారు. ఈ వ్యాజ్యం తాజాగా హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వ అఫిడవిట్‌పై కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని ఒక పిటిషనర్‌ తరఫు న్యాయవాది సలీంపాషా కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను జులై 8కి వాయిదా వేసింది. సంక్షేమ పథకాల అమలు ఆర్థికాంశాలతో ముడిపడి ఉంటాయని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. వాటిని న్యాయసమీక్ష చేయలేరని వివరించింది. సంక్షేమ పథకాలను కొనసాగించాలని, అవి తమ చట్టబద్ధమైన ఆకాంక్ష అని పిటిషనర్‌ చెప్పడానికి వీల్లేదని తెలిపింది. సుప్రీంకోర్టు నిబంధనలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత వ్యాజ్యాలను కొట్టేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని