లెక్కల్లో ఏ‘మార్చి’న ప్రభుత్వం!

అప్పు తగ్గిపోయింది... ఖర్చు తగ్గిపోయింది... రెవెన్యూ లోటు సైతం తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పుగా చెప్పుకొంటున్న మాటల్లోని అసలు మర్మం వెల్లడైంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి సర్కారు ఆర్థిక అవకతవకల బండారం బయటపడింది.

Published : 26 Jun 2022 05:09 IST

రూ.18,644 కోట్లు ఎలా వచ్చాయి?
చివరి నెలలో రెవెన్యూ ఖాతాలకు ఎలా చేరాయి?
40 గ్రాంట్లకు సంబంధించి గణాంకాలపై కాగ్‌ ప్రశ్నలు
మొత్తంగా చూస్తే పెరగనున్న రాష్ట్ర అప్పులు, రెవెన్యూ లోటు
ఈనాడు - అమరావతి

అప్పు తగ్గిపోయింది... ఖర్చు తగ్గిపోయింది... రెవెన్యూ లోటు సైతం తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పుగా చెప్పుకొంటున్న మాటల్లోని అసలు మర్మం వెల్లడైంది. 2021-22 సంవత్సరానికి సంబంధించి సర్కారు ఆర్థిక అవకతవకల బండారం బయటపడింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఆంధ్రప్రదేశ్‌ రూ.18,644 కోట్ల ఖర్చును... 40 రెవెన్యూ విభాగాధిపతుల ఖాతాల్లో తక్కువ చేసి చూపించినట్లు కాగ్‌ కనిపెట్టింది. ఈమేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. తొలుత 2022 మార్చి వరకు రూ.18,644 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పిన ప్రభుత్వం... మార్చిలో మాత్రం అంత ఖర్చు చేయలేదంటూ హఠాత్తుగా లెక్కలు మార్చేసిందని కాగ్‌ పేర్కొంది. అయితే... ఏయే విభాగాధిపతి పీడీ ఖాతా నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ రెవెన్యూ ఖాతాలకు మళ్లించారో అవసరమైన సమాచారం ఏదీ తమకు అందుబాటులో లేదని... అందువల్ల ఈ మొత్తాన్ని సస్పెన్స్‌ ఖాతాగా పరిగణించి 2021-22 లెక్కలు పూర్తి చేస్తామని అందులో స్పష్టంచేసింది. ఈ రూ.18,644 కోట్ల మొత్తాన్ని ఆయా రెవెన్యూ ఖాతాల్లో ఖర్చు చేయని మొత్తంగా చేర్చలేమని, దాన్ని సస్పెన్స్‌ ఖాతాలో రాసేస్తామని తేల్చి చెప్పింది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఖర్చు రూ.1,94,358 కోట్లుగా తేలనుంది. అప్పుడు రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, రుణ మొత్తం లెక్కలన్నీ మారిపోతాయి. అంతే కాదు... ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణమెంతో కూడా కాగ్‌కు చెప్పలేదు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.30 వేల కోట్లు. దీన్ని కూడా కలిపితే రాష్ట్ర మొత్తం అప్పు స్వరూపం మారిపోతుంది.

కాగ్‌ ఏం అడిగింది?
రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పథకాల అమలుకు కేంద్రం సాయం చేస్తుంది. వాటికి రాష్ట్రం తన వాటా నిధులను జత చేస్తుంటుంది. పథకాల ఖర్చులకు సంబంధిత విభాగాధిపతులు(హెచ్‌ఓడీ) పీడీ అకౌంట్ల ద్వారా చెల్లిస్తుంటారు. రాష్ట్ర రెవెన్యూ ఖాతాలకు వచ్చే నిధులను ప్రభుత్వం వెంటనే పీడీ ఖాతాలకు మళ్లిస్తుంది. అంటే నిధులను పుస్తకంలో సర్దుబాటు చేస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనేక రకాల పీడీ ఖాతాలను నిర్వహిస్తుంది. వివిధ పథకాలకు వచ్చిన నిధులను పీడీ ఖాతాలకు మళ్లించి, పుస్తకంలో సర్దుబాటు చేస్తుంది. సంబంధిత నిధులను తమ కార్యక్రమాలకు వాడుకుంటుంది. తర్వాత ఆయా పథకాల కింద పని పూర్తయ్యాక చెల్లించేస్తుంది.
* ఒక రెవెన్యూ ప్రధాన ఖాతాకు నిధులు వచ్చిన వెంటనే దాన్ని పీడీ ఖాతాకు బదలాయిస్తే, దాన్ని రెవెన్యూ ఖాతాలో ఖర్చుగా చూపిస్తారు. అంటే రెవెన్యూ ఖాతాలో ఖర్చు, సంబంధిత పీడీ ఖాతాలో జమ... రెండూ పుస్తకాల్లో సర్దుబాటు మాత్రమే.
* ఒకవేళ తిరిగి పీడీ ఖాతా నుంచి రెవెన్యూ ఖాతాకు నిధులను మళ్లిస్తే రెవెన్యూ ఖాతాలో జమగా చూపించాలి.
* 2022 మార్చిలో ఇలా 40 రెవెన్యూ ఖాతాలకు ఏవేవో పీడీ ఖాతాల నుంచి రూ.18,644 కోట్లను తిరిగి పంపినట్లు చూపించారు. అయితే... ఏ పీడీ ఖాతా నుంచి ఎందుకు? ఆ మొత్తం ఎలా వచ్చిందన్న వివరాల్లేవు.
* కాగ్‌ మరో అంశాన్నీ గుర్తించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆయా రెవెన్యూ ఖాతాల నుంచి పీడీ ఖాతాలకు తొలుత మళ్లించింది రూ.2,213.97 కోట్లే. కానీ... ఆర్థిక సంవత్సరం చివర్లో పీడీ ఖాతాల నుంచి రూ.18,644 కోట్లను రెవెన్యూ ఖాతాలకు తిరిగి మళ్లించింది. పైగా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఒక్క ఏడాదితో మురిగిపోవని, వాటిని హఠాత్తుగా రెవెన్యూ ఖాతాలకు మళ్లించాల్సిన అవసరమూ లేదని కాగ్‌ ప్రస్తావించింది.
* 2022 మార్చి లెక్కలను ఇలా మార్చడంతో మొత్తం మీద ఆ ఏడాది ఖర్చు, రెవెన్యూ లోటు, అప్పులు తగ్గించి చూపడానికి వీలైంది. ఇప్పుడు కాగ్‌ అదే మొత్తాన్ని సస్పెన్స్‌ ఖర్చుగా పేర్కొంటామని అంటోంది.


మరి కార్పొరేషన్‌ అప్పుల మాటేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా పథకాలను అమలు చేస్తున్నట్లు బడ్జెట్‌ పుస్తకాల్లో పేర్కొంటుంది. కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రణాళిక నిధులను ఖర్చు చేసే విషయంలో కాగ్‌ ఎన్నో రోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల ద్వారా రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు అంచనా. ఆ వివరాలపై కాగ్‌ పదేపదే లేఖలు రాస్తున్నా సర్కారు నుంచి స్పందన లేదు. కాగ్‌ తన నెలవారీ నివేదికల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉంది. కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుగా చూపిస్తే మొత్తం అప్పులు, రెవెన్యూ, ద్రవ్యలోటుల అసలు అంకెలు తేలుతాయి. పీడీ ఖాతాల లోగుట్టు, కార్పొరేషన్ల ఖర్చులోని లోగట్టే సర్కారు ఆర్థిక కనికట్టు అని నిపుణులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని