కేసులు నమోదు చేస్తే నిబంధనలు పాటించండి

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ ఈ నెల 4న వస్తున్నందున.. ఆ కార్యక్రమానికి వెళ్తే రాష్ట్రప్రభుత్వం తనపై తప్పుడు

Published : 02 Jul 2022 05:10 IST

ఎంపీ రఘురామ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశం

కేంద్రం భద్రతను పెంచడంతో.. రాష్ట్ర పోలీసులను ఆదేశించాల్సిన అవసరం లేదు

స్పష్టం చేసిన న్యాయమూర్తి

ఈనాడు, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ ఈ నెల 4న వస్తున్నందున.. ఆ కార్యక్రమానికి వెళ్తే రాష్ట్రప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలో తన పర్యటనకు పోలీసులతో రక్షణ కల్పించాలన్నారు. ఈ అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ శుక్రవారం విచారణ జరిపారు. భీమవరం పర్యటనలో పిటిషనర్‌పై ఏమైనా కేసులను నమోదు చేస్తే.. చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం వై కేటగిరీ నుంచి జడ్‌ కేటగిరీకి భద్రత పెంచడంతో ఆ విషయమై రాష్ట్ర పోలీసులను ఆదేశించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తొందరపాటు చర్యలు వద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున మరోసారి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. కేంద్ర బలగాలు ఎంపీకి భద్రత కల్పించినా.. రాష్ట్రానికి వచ్చాక రక్షణగా నిలవాల్సింది స్థానిక పోలీసులేనన్నారు. ఎంపీ తన నియోజకవర్గానికి వస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని వైకాపా నేత విజయసాయిరెడ్డి హెచ్చరిస్తున్నారన్నారు. సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడంపై ఆందోళన వ్యక్తంచేశారు.

* రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రధాని పర్యటన కారణంగా భారీగా పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. భద్రతపై పిటిషనర్‌ది ఆధారరహిత ఆందోళన అన్నారు. ప్రచారం కోసమే ఈ వ్యాజ్యం వేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. భద్రత, పాత కేసుల విషయాల్లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదన్నారు. భీమవరం పర్యటన సందర్భంగా ఏమైనా కేసులు నమోదు చేస్తే చట్ట నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని