పోల్‌ 2023.. కేఎంఆర్‌..!

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులు ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది.

Published : 05 May 2024 07:44 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ బృందం నేతృత్వంలో 2 వాట్సప్‌ గ్రూప్‌లు
కామారెడ్డిలో కేసీఆర్‌ ప్రత్యర్థులు, అనుచరులపై ప్రత్యేక దృష్టి
గత అసెంబ్లీ ఎన్నికల వేళ నిరంతర నిఘా

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులు ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు కేసీఆర్‌ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం కార్యకలాపాలపై ట్యాపింగ్‌ ముఠా ప్రత్యేక నిఘా ఉంచింది. కేసీఆర్‌పై పోటీ చేసిన అభ్యర్థులపై.. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి కదలికలపై నిరంతరం కన్నేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘కేఎంఆర్‌ (కామారెడ్డి)’ పేరిట వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) అప్పటి డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు దాన్ని ఏర్పాటు చేయగా.. ఎస్‌ఐబీ అప్పటి అదనపు ఎస్పీ తిరుపతన్నతోపాటు క్షేత్రస్థాయిలో అతడి పర్యవేక్షణలో పనిచేసే పోలీసులు సభ్యులుగా ఉన్నారు.

రేవంత్‌రెడ్డికి, వెంకటరమణారెడ్డికి ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించారు. వారి ప్రధాన అనుచరుల కదలికలను కూడా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు గ్రూపులో చర్చించుకునేవారు.  కేసీఆర్‌ ప్రత్యర్థులను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూపులో చర్చలు నడిచాయి. మరోవైపు తిరుపతన్న ‘పోల్‌-2023’ పేరిట ఇంకో వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. తన బృందంలోని పోలీసులను అందులో సభ్యులుగా చేర్చారు. అక్రమ సొమ్ము జప్తు అయిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో షేర్‌ చేసుకునేవారు. ఎవరిపై నిఘా ఉంచాలనే సమాచారాన్ని తిరుపతన్న.. ప్రణీత్‌రావుకు చేరవేసేవారు. వారి ప్రొఫైళ్లను తయారుచేసి ఫోన్లను మానిటరింగ్‌ చేయడం ప్రణీత్‌రావు పని. అలా రాష్ట్రవ్యాప్తంగా భారాస ప్రత్యర్థుల కదలికలపై తిరుపతన్న బృందం పర్యవేక్షణ ఉండేది. వారు సొమ్ము తరలిస్తున్నట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్స్‌, ఇతర పోలీస్‌ బృందాలకు సమాచారం అందించేది. అలా కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సంబంధించిన సొమ్మును జప్తు చేయించగలిగారు.


పరారీలో ప్రభాకర్‌రావు..!

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చారు. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా(ఏ-1) చేర్చారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ప్రణీత్‌రావు ఉన్నారు. దర్యాప్తు క్రమంలో లభించిన సమాచారం ఆధారంగా ప్రభాకర్‌రావును మొదటి, ప్రణీత్‌రావును రెండో నిందితులుగా చేర్చారు. ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావును ఏ-6గా చేర్చారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై నాంపల్లి న్యాయస్థానంలో రెండు రోజుల క్రితం మెమో దాఖలు చేశారు. ఈ కేసులో వీరిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు న్యాయస్థానానికి వెల్లడించారు. ఇప్పటివరకు నిందితుల వాంగ్మూలాల్లో వారిద్దరి ప్రస్తావన వచ్చినా సాంకేతిక కారణాలతో నిందితుల జాబితాలో వారి పేర్లను చేర్చలేదు. తాజాగా వారిని పరారీలో ఉన్న నిందితులుగా చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వారు విదేశాల్లో ఉండటంతో అరెస్ట్‌కు అనుమతిస్తూ వారంట్‌ జారీ చేయాల్సిందిగా 73 సీఆర్పీసీ సెక్షన్‌ కింద న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సోమవారం నిర్ణయం వెలువడనుంది. వారంట్‌కు అనుమతి లభిస్తే అప్పుడు వారిద్దరిపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేయించే అవకాశముంది. నేరానికి పాల్పడి పోలీస్‌ విచారణను తప్పించుకునేందుకు దేశం దాటిపోయిన నిందితులపై దాన్ని జారీ చేస్తారు. ఇందుకోసం సీఐడీ ద్వారా సీబీఐకి సమాచారమిచ్చి.. అక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కు లేఖ రాయించాల్సి ఉంటుంది. అప్పుడు ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేసే అవకాశముంది. నిందితుడు ఇంటర్‌పోల్‌ సభ్య దేశంలో ఉండి ఉంటే అక్కడి పోలీసుల ద్వారా పట్టుకొని తీసుకొచ్చే వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని