Krishna River: కృష్ణమ్మ గలగలలు.. గోదారి ఉరకలు

కృష్ణా గోదావరి నదుల్లో ఉద్ధృత ప్రవాహం నమోదవుతోంది. కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం గేట్లను ఒక్కోటి పెంచుతూ మంగళవారం రాత్రికి ఎనిమిదింటిని తెరిచారు. ఏపీ, తెలంగాణ ఉత్పత్తి కేంద్రాల ద్వారా జలవిద్యుత్‌ను తయారు చేస్తున్నారు.

Updated : 10 Aug 2022 06:25 IST

 రెండు నదులకూ భారీ ప్రవాహాలు

శ్రీశైలం 8 గేట్లు ఎత్తిన అధికారులు

రేపు సాగర్‌ నుంచి నీటి విడుదల?

గోదావరిలో మేడిగడ్డ  వద్ద 7.30 లక్షల క్యూసెక్కుల వరద

భద్రాద్రికి మళ్లీ ముంపు పోటు

ఈనాడు, హైదరాబాద్‌, భద్రాచలం, న్యూస్‌టుడే: కృష్ణా గోదావరి నదుల్లో ఉద్ధృత ప్రవాహం నమోదవుతోంది. కృష్ణానదికి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం గేట్లను ఒక్కోటి పెంచుతూ మంగళవారం రాత్రికి ఎనిమిదింటిని తెరిచారు. ఏపీ, తెలంగాణ ఉత్పత్తి కేంద్రాల ద్వారా జలవిద్యుత్‌ను తయారు చేస్తున్నారు. జలాశయం నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. నారాయణపూర్‌ నుంచి 1.46 లక్షల, తుంగభద్ర డ్యాం నుంచి 1.59 లక్షల క్యూసెక్కులు విడుదలవుతుండగా ఇవి మరింత పెరిగే సూచనలున్నాయి. మరోవైపు నాగార్జునసాగర్‌ వద్ద 1.83 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మంగళవారం సాయంత్రానికి ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు 578.20 అడుగుల వద్ద ఉంది. 589.50 అడుగులకు చేరుకున్నాక గేట్లు తెరవాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటాన్ని బట్టి గురువారం గేట్లు తెరచుకునే అవకాశాలున్నాయి. గతేడాది ఆగస్టు నెలలోనే సాగర్‌ గేట్లు తెరచుకున్నాయి. కృష్ణానదికి భారీ వరదలు వచ్చినపుడు తప్ప మరెప్పుడూ ఆగస్టులో గేట్లు తెరచుకున్న దాఖలాలు లేవు. 

భద్రాచలం వద్ద భారీ ప్రవాహం

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల్లో లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) వద్ద 7.30 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన మానేరు ఇతర ఉపనదులు, వాగులతోపాటు ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో మేడిగడ్డ నుంచి దిగువకు పెద్దఎత్తున ప్రవాహం వెళ్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి భీకర రూపం దాల్చుతోంది. మంగళవారం మధ్యాహ్నం 4.10 గంటలకు 43 అడుగుల నీటిమట్టం నమోదైంది. కలెక్టర్‌ అనుదీప్‌ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. లోతట్టు ప్రాంతవాసులకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాత్రి 11 గంటలకు నీటిమట్టం 47 అడుగులకు చేరింది. మరో అడుగు పెరిగితే రెండో హెచ్చరిక అమల్లోకి రానుంది. బుధవారం ఉదయానికి నీటిమట్టం 50 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

వర్షాలు తగ్గుముఖం

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఒడిశాపై కేంద్రీకృతమై ఉంది. రుతుపవనాల ద్రోణి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి వాయుగుండం ఏర్పడిన ప్రాంతం వరకూ వ్యాపించింది. తెలంగాణలో బుధ, గురువారాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని, అక్కడక్కడ ఒక మోస్తరుగా కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ..రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో 4.3, డిచ్‌పల్లిలో 3.9, సాలూరలో 3.3, చిమ్నంపల్లిలో 3.3, నిజామాబాద్‌లో 3.2 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది.


వాగులో చిక్కిన లారీ

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లో దంచి కొడుతున్న వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాయపూర్‌ వెళ్తున్న ఓ మినీలారీ మంగళవారం దంతరి జిల్లాలోని లోతట్టు వంతెనపై నుంచి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకుంది. డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీవర్షాలకు చాలాచోట్ల రహదారులు జలదిగ్భంధంలో చిక్కుకొని రాకపోకలు స్తంభించాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని