ఈ-వేలం ద్వారా ఓబుళాపురం ఇనుప ఖనిజ లీజుల కేటాయింపు

ఓబుళాపురం ప్రాంతంలో మూడు ఇనుప ఖనిజ లీజుల 50 ఏళ్ల కాలపరిమితి గత ఏడాదితో ముగిసిందని, వాటిని కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ-వేలం ద్వారానే మళ్లీ

Updated : 11 Aug 2022 05:38 IST

గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి

ఈనాడు, అమరావతి: ఓబుళాపురం ప్రాంతంలో మూడు ఇనుప ఖనిజ లీజుల 50 ఏళ్ల కాలపరిమితి గత ఏడాదితో ముగిసిందని, వాటిని కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ-వేలం ద్వారానే మళ్లీ కేటాయిస్తామని గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఓబుళాపురం ప్రాంతంలో అంతర్‌ రాష్ట్ర సరిహద్దు వివాదం న్యాయస్థానంలో విచారణలో ఉందని, సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన ప్రకారం సరిహద్దులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వే రాళ్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానంలో కేసును త్వరగా పరిష్కరించుకునేందుకు వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ను అభ్యర్థించినట్లు చెప్పారు. గాలి జనార్దనరెడ్డికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేది నిజంకాదని ఆయన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్‌ తవ్వకాలు లేవు
రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదని గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. లేటరైట్‌ పేరిట బాక్సైట్‌ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపించిన ప్రాంతంలో లభించేది లేటరైట్‌ ఖనిజమేనని 2010లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ఆరు లేటరైట్‌ లీజులు ఉండగా, వీటికి 2019కి ముందే అనుమతులు ఇచ్చారని చెప్పారు. టన్ను సిమెంట్‌ తయారీలో 88 గ్రాముల లేటరైట్‌ను మాత్రమే వినియోగిస్తారని వివరించారు. భారతీ సిమెంట్స్‌ పరిశ్రమకు మాత్రమే లేటరైట్‌ రవాణా కావడంలేదని, గత ఏప్రిల్‌ నుంచి 12 సిమెంట్‌ పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. రోజుకు 600 లారీల లేటరైట్‌ భారతీ సిమెంట్స్‌కు రవాణా అవుతోందని ఆరోపణ చేశారని, అంటే 12 వేల మెట్రిక్‌ టన్నులను ఒక్క పరిశ్రమ ఎలా కొనుగోలు చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని సిమెంట్‌ పరిశ్రమలు కలిసినా అంత ఖనిజాన్ని వినియోగించడం సాధ్యంకాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని