Andhra News: కొత్త పోస్టుని సృష్టించి.. కాటమనేని భాస్కర్‌ మళ్లీ బదిలీ

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ని ప్రభుత్వం నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో కొత్తగా... పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌

Updated : 13 Aug 2022 09:52 IST

నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి

మరో నలుగురు ఐఏఎస్‌లకూ స్థానచలనం

ఈనాడు, అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ని ప్రభుత్వం నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో కొత్తగా... పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌ పోస్టుని సృష్టించి భాస్కర్‌ను దానిలో నియమించింది. ఆయనతో పాటు మరో నలుగురు ఐఏఎస్‌ అధికారులనూ బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ సి.నాగరాణిని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించారు. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న ఎం.ఎం.నాయక్‌ను చేనేత, జౌళి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయనకు ఆప్కో వీసీ, ఎండీగాను, ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగాను పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జి.జయలక్ష్మికి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా బి.శ్రీనివాసరావుని నియమించారు. ఆయనకు సీఈఓ, రైతు బజార్ల పోస్టుని పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించారు.

సిఫారసులకు తలొగ్గలేదని..! 

కాటమనేని భాస్కర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 4న రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖలో వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగుల బదిలీల విషయంలో ఆయన నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని చెప్పడం కొందరికి రుచించలేదు. ప్రజాప్రతినిధుల సిఫారసులకు ఆయన తలొగ్గలేదు. దాంతో జూన్‌ 29, 30 తేదీల్లో సాధారణ బదిలీలకు కౌన్సెలింగ్‌ జరుగుతుందనగా, జూన్‌ 28న రాత్రి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను అంతగా ప్రాధాన్యం లేని కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్‌కు కమిషనర్‌గా నియమించింది. ఇప్పుడు మళ్లీ పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేసింది. కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్‌ కమిషనర్‌ పోస్టునీ ఆయనకు పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. పాఠశాల విద్యపై శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో... పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియిమంచాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సీఎం ఆదేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వం కొత్త పోస్టుని సృష్టించి, భాస్కర్‌ను దానిలో నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని