10 గ్రాముల బరువు.. 13 వేల ఖర్చు

తేలికపాటి నానో ఉపగ్రహాన్ని రూపొందించి అబ్బురపరిచాడు తిరుపతి జిల్లా రేణిగుంటకుచెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి సాయి హేమంత్‌కుమార్‌. దీన్ని వైర్‌లెస్‌ డేటా ట్రాన్స్‌మిషన్‌ సాయంతో తయారుచేసి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

Updated : 02 Oct 2022 07:29 IST

నానో ఉపగ్రహాన్ని రూపొందించిన రేణిగుంట యువకుడు

ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌  రికార్డ్స్‌లో స్థానం

శ్రీహరికోట - న్యూస్‌టుడే

తేలికపాటి నానో ఉపగ్రహాన్ని రూపొందించి అబ్బురపరిచాడు తిరుపతి జిల్లా రేణిగుంటకుచెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి సాయి హేమంత్‌కుమార్‌. దీన్ని వైర్‌లెస్‌ డేటా ట్రాన్స్‌మిషన్‌ సాయంతో తయారుచేసి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. హేమంత్‌ తండ్రి వెన్నెలకంటి కృష్ణమూర్తి ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి శ్రీకుమారి గృహిణి. పదో తరగతి వరకు రేణిగుంటలో చదివిన హేమంత్‌ తిరుపతిలో ఇంటర్‌ పూర్తిచేశాడు. తమిళనాడులోని హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సైన్సు కళాశాలలో ఏరోస్పేస్‌లో ఫైనలియర్‌ చదువుతున్నాడు. రాకెట్‌, ఉపగ్రహాల తయారీ, పనితీరుపై ఇంటర్‌నెట్‌ సాయంతో ఔపోసన పట్టాడు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దినేశ్‌కుమార్‌ మార్గదర్శకత్వంలో, ఐవోటీ సాంకేతికతతో ఐదు నెలల్లో తయారుచేసిన ఈ ఉపగ్రహానికి వెన్నెలాశాట్‌గా పేరుపెట్టాడు. తయారీకి అయిన రూ.13వేల ఖర్చును కళాశాల యాజమాన్యం అందించింది. ఇదే కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేసీజీ వర్గీస్‌ పేరుతో ఉపగ్రహం తయారు చేస్తున్నారు. దీనిని త్వరలోనే శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి కక్ష్యలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం డేటా కోసం కళాశాలలో నిర్మించిన గ్రౌండ్‌ స్టేషన్‌ను ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ ఇటీవల పరిశీలించారు. హేమంత్‌కుమార్‌ రూపొందించిన వెన్నెలాశాట్‌ను పరిశీలించి, అభినందించారు. ఈ తరహా ఉపగ్రహాన్ని తయారుచేసిన పిన్న వయస్కుడిగా హేమంత్‌కుమార్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఈ ఏడాది ఆగస్టు 7న నమోదయ్యారు. 10.31 గ్రాముల బరువు, 25×25×25 మి.మీ. పరిమాణంలోని ఈ ఉపగ్రహం వాయుపీడనం, ఉష్ణోగ్రత, ఎత్తుకు సంబంధించిన వివరాలను వైర్‌లెస్‌ విధానంలో పంపడానికి ఉపయోగపడుతుంది.

ఇతరులు చేయడాన్ని చూసి: హేమంత్‌కుమార్‌

ఇటీవల ఉపగ్రహాలను విద్యార్థులే తయారు చేస్తున్నారు. వాటిని ఇస్రో సాయంతో కక్ష్యలోకి పంపుతున్నారు. తమిళనాడులోని యూనివర్సిటీ విద్యార్థులు సత్యభామ శాట్‌, తదితరాలు రూపొందించారు. వారి స్ఫూర్తితో నేనూ ప్రయత్నించాను. ప్రధాని ఆలోచనల మేరకు కేసీజీ ఉపగ్రహాన్ని మా కళాశాల విద్యార్థులు రూపకల్పన చేస్తున్నారు. బ్రహ్మోస్‌ పితామహుడు శివథానుపిళ్లై మా కాలేజీకి తరచూ వచ్చేవారు. ఆయన సలహాలు తీసుకున్నాం. పది కి.మీ. పరిధిలో పనిచేసే ఈ శాటిలైట్‌తో వాతావరణ పరిస్థితులు అంచనా వేయొచ్చు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని