75% పూర్తయిన ప్రాజెక్టులకే ప్రాధాన్యం!

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ సంవత్సరం ఏది పూర్తిచేయాలన్న విషయమై జగన్‌ ప్రభుత్వం రూపొందించిన తొలి ప్రణాళికలేవీ ఫలించలేదు.

Published : 28 Nov 2022 04:51 IST

తొలి ప్రణాళికలపై చేతులు ఎత్తేసినట్లే!
మళ్లీ జలవనరులశాఖ కసరత్తు
వివరాలు సేకరిస్తున్న అధికారులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ సంవత్సరం ఏది పూర్తిచేయాలన్న విషయమై జగన్‌ ప్రభుత్వం రూపొందించిన తొలి ప్రణాళికలేవీ ఫలించలేదు. అవసరమైన మొత్తంలో 25% నిధులనూ ఖర్చు చేయలేదు. 2019 నవంబరులో ఒకసారి, 2020 సెప్టెంబరులో మరోసారి ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం జగన్‌ వద్ద అధికారులు చర్చించారు. ఈ ప్రణాళికలు కొలిక్కి రాకపోగా అప్పటికే 80% నిర్మాణం పూర్తయిన సంగం, నెల్లూరు బ్యారేజిలనే జాతికి అంకితం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇక ఏడాదిన్నర గడువే ఉంది. అసలు ప్రాజెక్టుల పూర్తికి ఎలా ముందుకెళ్లాలనే విషయంలో మళ్లీ కొత్త ఆలోచనలు చేస్తున్నారు.  ఇకపై 75% పనులు పూర్తయినవాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా కసరత్తు సాగుతోంది. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రాజెక్టులను నాలుగు కేటగిరీలుగా విభజించి సమాచారం సేకరిస్తున్నారు. 1) 50% కన్నా తక్కువ పని జరిగినవి 2) 50-75% మధ్య పూర్తయినవి 3) 75% దాటి పూర్తయినవి 4) దాదాపు 100% పనులు కొలిక్కి వచ్చినవి. వీటన్నింటికీ ఇంకా ఎంత మొత్తం అవసరమనే సమాచారం సేకరిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్తగా టెండర్లు పిలిచి 20% లోపు పనులు పూర్తయిన వాటన్నింటినీ రద్దు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి, వాటిలో అవసరమైన కొన్నింటినే కొనసాగించాలని తీర్మానించారు. వాటికి జతగా అనేక కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చి టెండర్లు పిలిచింది. కృష్ణా వరద జలాలను రాయలసీమ జిల్లాలకు తక్కువ రోజుల్లోనే ఎక్కువగా మళ్లించాలనే ఆలోచనతో ప్రారంభించిన సీమ కరవు నివారణ పథకం అంతంతగానే ఉంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పాత, కొత్త ప్రాజెక్టులు అనేకం పడకేశాయి. పెద్ద పెద్ద గుత్తేదారులు సైతం చేతులెత్తేశారు.

2019 నవంబరు ప్రణాళిక ప్రకారం..

ముఖ్యమంత్రి వద్ద 2019 నవంబరులో సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, పోలవరం సహా మొత్తం ప్రాజెక్టుల పూర్తికి రూ.1,64,815 కోట్లు అవసరమని తేల్చారు. అందులో పోలవరంలో +41.15 మీటర్ల స్థాయికే నీళ్లు నిలబెడితే రూ.1,41,499 కోట్లు కావాలని లెక్కించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యాల వారీగా వర్గీకరించారు. తొలి ప్రాధాన్యంలో మళ్లీ రెండుగా వర్గీకరించారు. ఏయే ప్రాధాన్య ప్రాజెక్టులకు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయిస్తే 2024 నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయగలరో ప్రణాళిక సిద్ధం చేశారు.


2020 సెప్టెంబరు నాటికి..

మళ్లీ 2020 సెప్టెంబరులో సీఎం జగన్‌ వద్ద ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి ప్రణాళికను కొలిక్కి తెచ్చారు. రూ.1,078 కోట్లు ఖర్చుచేస్తే అయిదు ప్రాజెక్టులను 2020-21 నాటికి పూర్తి చేయవచ్చని నిర్ణయించారు. పాత, కొత్తగా టెండర్లు పిలిచేవి కలిపి 54 ప్రాజెక్టులకు ప్రణాళిక సిద్ధం చేశారు.  రూ.15,085 కోట్లతో 19 ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యంగా పూర్తిచేయాలనేది అందులో ఆలోచన. వీటిలో 2020లో మూడు, 2021లో అయిదు, 2022లో ఏడు, 2024లో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చని అంచనాలు వేశారు. రెండో ప్రాధాన్యం కింద రూ.1,104 కోట్లు ఖర్చు చేసి తొమ్మిది ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని నాడు లెక్కించారు. వాటిలో చాలా ప్రాజెక్టుల అంచనాలు ఇప్పుడు పెరిగిపోయాయి. రూ.4,155 కోట్లతో 14 ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని లెక్కించారు. ఈ ప్రణాళికలేవీ ఫలించేలా ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోయింది. ఇవికాకుండా కొత్త ప్రాజెక్టులకు రూ.72,458 కోట్లు అవసరమవుతాయని లెక్కించారు. రుణాలు తీసుకోవాలనీ భావించారు. ఈ రెండు విభాగాల్లోనూ పోలవరం ప్రాజెక్టు లేదు. వీటిలో ఏదీ సాకారం కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు