మనోళ్లే.. మరో ఆరు నెలలు ఇచ్చేద్దాం!

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) పదవీకాలాన్ని పొడిగించేందుకు ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కొత్త నాటకానికి తెరతీశాయి.

Published : 28 Nov 2022 03:25 IST

నలుగురు వీసీల పదవీకాలం పొడిగింపునకే ప్రకటనలో జాప్యం
ఆదికవి నన్నయ వర్సిటీపై విచారణకు అనుమతివ్వని ఉన్నతాధికారి

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) పదవీకాలాన్ని పొడిగించేందుకు ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కొత్త నాటకానికి తెరతీశాయి. తమకు అనుకూలంగా ఉన్న వారికి లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశపూర్వకంగా కొత్త ప్రకటనను అడ్డుకుంటున్నాయి. వీసీల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు కొత్త వీసీల కోసం ప్రకటన విడుదల చేయాల్సి ఉండగా... ఈ రెండు శాఖలు కావాలని జాప్యం చేశాయి. ఇప్పుడు సమయం లేదంటూ వీసీ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పద్మావతి మహిళ, యోగివేమన, కృష్ణా, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల వీసీల పదవీకాలం జనవరి 7తో ముగియనుంది. ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు అనుమతివ్వాలని ఉన్నత విద్యామండలి అక్టోబరు మొదటి వారంలో దస్త్రాన్ని ఉన్నత విద్యాశాఖకు పంపింది. దీన్ని వెంటనే పరిష్కరించాల్సిన ఉన్నత విద్యాశాఖ నవంబరు మొదటి వారం వరకు అట్టిపెట్టుకుంది. అనంతరం కొత్త వీసీల ప్రకటనకు ఆమోదం తెలుపుతూ ఉన్నత విద్యామండలికి దస్త్రాన్ని పంపగా... 20 రోజులుగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాశాఖ నుంచి దస్త్రం వచ్చిన వెంటనే ప్రకటన విడుదల చేయాలి. ప్రకటన విడుదల తర్వాత దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు నెలన్నర సమయం పడుతుంది. సెర్చ్‌కమిటీలో యూజీసీ తరఫున నామినీని నియమించేందుకు నెల రోజుల సమయం కావాలి. ఉన్నత విద్యాశాఖ నెల రోజులు దస్త్రాన్ని ఆపేయగా... ఉన్నత విద్యామండలి 20 రోజులుగా ప్రకటన ఇవ్వకుండా పక్కన పెట్టింది. దీంతో డిసెంబరులో ప్రకటన ఇచ్చినా కొత్త వీసీ పోస్టులు భర్తీ చేసేందుకు సమయం సరిపోదని, ప్రస్తుతమున్న వారికే ఆరు నెలలు పొడిగించాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదిస్తోంది. యోగివేమన, పద్మావతి మహిళ, కృష్ణా విశ్వవిద్యాలయాల వీసీలు ఉన్నత స్థాయిలోని ఒక వ్యక్తికి కావాల్సిన వారు కావడంతోనే ఇలా చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరి కారణంగా ఆదికవి నన్నయ వీసీ పోస్టు భర్తీ కూడా పెండింగ్‌లో ఉంది.

ఆర్జీయూకేటీ వీసీ ఎప్పటికో...

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఉపకులపతిని ఈనెల 18న ఎంపిక చేస్తామని ఇటీవల ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ వర్సిటీలో వీసీకి ఎలాంటి అధికారాలు లేవని ఆయన పేర్కొన్నారు. అలాంటప్పుడు వీసీ పోస్టుకు 60 దరఖాస్తులు ఎలా వచ్చాయి? ఈ పోస్టును భర్తీ చేసేందుకు ఎందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారు? ఈనెల 19న సెర్చ్‌ కమిటీ సమావేశమైనా ఎందుకు అభ్యర్థులను ఎంపిక చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి దరఖాస్తులను స్వీకరించి, మంచి అభ్యర్థులు రాలేదంటూ రద్దు చేశారు. ఈసారి ఇదే విధానం అమలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు మూడున్నరేళ్లుగా వీసీ పోస్టును భర్తీ చేయలేదు.

విచారణపై ఏం చేస్తారు?

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అక్రమాలు జరిగినట్లు వర్సిటీ మాజీ ప్రత్యేక అధికారి ఏఎస్‌వీఎస్‌ సాంకృత్యాయన్‌ గవర్నర్‌, ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ ఉన్నత విద్యాశాఖకు ఉన్నత విద్యామండలి దస్త్రాన్ని పంపింది. దస్త్రాన్ని ఉన్నత విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పక్కన పెట్టారు. దీంతో ఇప్పుడు మరోసారి అనుమతి కోసం దస్త్రాన్ని పంపేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని