3 రాజధానులపై పకడ్బందీ చట్టం తెస్తాం

‘రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నాక... లేని చట్టంపై హైకోర్టు తీర్పునివ్వడంపై అప్పట్లోనే దేశవ్యాప్త చర్చ జరిగింది. ఈ విషయంలో మేం భావించినట్లే.. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున ఆహ్వానిస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Updated : 30 Nov 2022 06:58 IST

మేం భావించినట్లే ఉన్నందున సుప్రీం తీర్పును ఆహ్వానిస్తున్నాం
అమరావతిలో అభివృద్ధిని ఏ ప్రభుత్వమైనా చేయక తప్పదు
వివేకా హత్యపై విచారణ ఎక్కడ జరిగినా నిజాలు బయటకు రావాలి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నాక... లేని చట్టంపై హైకోర్టు తీర్పునివ్వడంపై అప్పట్లోనే దేశవ్యాప్త చర్చ జరిగింది. ఈ విషయంలో మేం భావించినట్లే.. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున ఆహ్వానిస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘ఒక సరైన పద్ధతి ప్రకారం, లోతైన, మరింత పకడ్బందీగా 3 రాజధానుల చట్టాన్ని తీసుకొస్తాం. 3 ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వికేంద్రీకరణను న్యాయ ప్రక్రియకు, రాజ్యాంగానికి లోబడి ఎలా చేయాలో అదే తరహాలోనే ప్రభుత్వం పూర్తి చేస్తుంది’ అని ప్రకటించారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంవద్ద విలేకరులతో మాట్లాడారు. ‘కర్నూలులో హైకోర్టు వద్దని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. 3 రాజధానుల విషయంలో మా ఉద్దేశం స్పష్టంగా ఉంది. అమరావతి కోసం రైతులు భూములిచ్చింది వాస్తవం. వారికి న్యాయం చేస్తాం. తెదేపా కంటే యాన్యూటీని మరో ఐదేళ్లు మేమే పెంచాం. శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది. మిగిలిన సంస్థలూ వస్తాయి. అంత భూమి ఉన్నప్పుడు క్రమంగా అభివృద్ధి చేయాలి. ఏ ప్రభుత్వమైనా ఇది చేయక తప్పదు. మౌలిక సదుపాయాలను కల్పించాక వచ్చే అభివృద్ధితో రైతులు లబ్ధి పొందుతారు. దీనివల్ల అమరావతిలో ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం దుర్వినియోగం కాకుండా చూడవచ్చు. అభివృద్ధీ చేయవచ్చు’ అని సజ్జల పేర్కొన్నారు.

బయట విచారణ జరిగితే మరీ మంచిది

‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఏపీలో ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ట్రయల్‌ జరగదని వాళ్లంటున్నారు.  వాళ్లకు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు రాష్ట్రం బయట ట్రయల్‌ జరిపితే ఏమవుతుందని కోర్టు అడిగింది. మాకు అభ్యంతరం లేదు. కేసును సీబీఐకి ఇచ్చినప్పుడు అభ్యంతరం చెప్పలేదని ప్రభుత్వం పేర్కొంది’ అని సజ్జల వెల్లడించారు. ‘వివేకా కేసులో నిజాలు ఇప్పుడు కాకపోయినా సంవత్సరానికైనా బయటకు రావాలి. హంతకులకు కఠిన శిక్ష పడాలనే ముఖ్యమంత్రి జగన్‌ కోరుకుంటున్నారు. ఇందులో రాజకీయాన్ని చొప్పించి ముఖ్యమంత్రిపై బురద జల్లాలని తెదేపా కుట్రలు చేస్తోంది. ఈ కేసు విచారణను తెలంగాణకు మారిస్తే వెంటనే ట్వీట్‌ చేసిన చంద్రబాబు... అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎందుకు స్పందించలేకపోయారు? అయినా ఏపీలో విచారణ జరిగితే ప్రభావితం చేస్తారనుకుంటే... బయట విచారణ జరిగితే మరీ మంచిది. సీఎం జగన్‌ ఈ విషయంలో చాలా ఓపెన్‌గా... దేనికైనా సిద్ధంగా ఉన్నారు. తన గుట్టు బయటపడుతుందని గతంలో సీబీఐని రాష్ట్రానికి రావొద్దని చంద్రబాబు చెప్పారు. ఆయనకు ఉన్నట్లు మాకు లోగుట్లు... దాపరికాల్లేవు కాబట్టే... వివేకా హత్య కేసును సీబీఐకిచ్చినా, ట్రయల్‌ను పక్క రాష్ట్రానికిచ్చినా అభ్యంతరం చెప్పడం లేదు’ అని సజ్జల పేర్కొన్నారు.

పవన్‌కు 15 సీట్లు ఇస్తారట: ‘వారానికోసారి వలస పక్షిలా వచ్చి ప్రకటనలు చేసి వెళుతున్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు విలువ లేదు. ఆయన 30 అడిగితే 15 సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు మాకు అందిన సమాచారం. ఒకవేళ పొరపాటున గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేదెవరు చంద్రబాబా? పవనా’ అని సజ్జల ప్రశ్నించారు.  షర్మిల అరెస్టుపై సజ్జల స్పందిస్తూ.. ‘మాకు సంబంధించినంత వరకు మా మహా నేత కుమార్తెగా, జగన్‌ చెల్లెలుగా వ్యక్తిగతంగా ఇది అందరికీ బాధ కలిగించే అంశం’ అని వ్యాఖ్యానించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు