ప్రకటనల బోర్డుల నిర్వహణలో రూ.కోట్లలో అవినీతి

గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రకటన బోర్డుల నిర్వహణ, ఫీజుల వసూళ్లలో ఏళ్లుగా రూ.కోట్లలో అవినీతి జరుగుతోందని, పాలకవర్గం వచ్చినా అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు షేక్‌ రోషన్‌, అచ్చాల వెంకటరెడ్డి, వెంకటకృష్ణ ఆచారి ధ్వజమెత్తారు.

Published : 01 Dec 2022 04:29 IST

గుంటూరు పట్టణ ప్రణాళికాధికారులను నిలదీసిన వైకాపా కార్పొరేటర్లు

నగర పాలక సంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే:  గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రకటన బోర్డుల నిర్వహణ, ఫీజుల వసూళ్లలో ఏళ్లుగా రూ.కోట్లలో అవినీతి జరుగుతోందని, పాలకవర్గం వచ్చినా అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు షేక్‌ రోషన్‌, అచ్చాల వెంకటరెడ్డి, వెంకటకృష్ణ ఆచారి ధ్వజమెత్తారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్‌ మినీ హాల్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అనేక అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకటన బోర్డుల అవినీతిపై గతంలోనే పలుమార్లు కౌన్సిల్‌ సమావేశాల్లో చర్చించినా అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదన్నారు. భవానీ యాడ్స్‌ అనే సంస్థకు చెందిన వారే అనేక డమ్మీ సంస్థలు పెట్టి పట్టణ ప్రణాళిక అధికారులతో కుమ్మక్కై నగరంలో 75 శాతం వరకు ప్రకటన బోర్డులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రకటనల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్న సదరు వ్యక్తి జీఎంసీకి చెల్లింపులు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దీనిపై అధికారులు సీపీ మూర్తి, డీసీపీ కోటయ్య మాట్లాడుతూ నగరంలో బోర్డులు, హోర్డింగ్‌లు తదితర వాటి గురించి కొన్ని లెక్కలు చెప్పారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... అధికారులు తమ తీరు మార్చుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కార్పొరేటర్లు డిమాండు చేశారు. ‘గడప గడప’ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తుంటే స్థానిక సమస్యలపై నిలదీస్తున్నారని పలువురు కార్పొరేటర్లతో పాటు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా పేర్కొన్నారు. ‘ప్రజలు చిన్నపాటి పనులు చేయించాలని కోరుతున్నారు. అవి పూర్తికాకపోతే ఆ వీధిలోకి ఎలా వెళ్లగలం’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని