Budget 2023: ఆర్థిక గమనం ఎటువైపు?

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ఎలా ఉంటుందోనని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

Updated : 25 Jan 2023 10:08 IST

కరోనా ముందు స్థాయికి చేరని సామాన్యుడి స్థితిగతులు
పెరిగిన ధరలతో దుర్భరమైన పేదల జీవితాలు
అట్టడుగువర్గాల కొనుగోలు శక్తి పెంచాలి
అప్పుడే మెరుగైన వృద్ధి సాధ్యమంటున్న నిపుణులు
కేంద్ర బడ్జెట్‌ స్వరూపంపై సర్వత్రా ఆసక్తి
ఎన్‌.విశ్వప్రసాద్‌
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ఎలా ఉంటుందోనని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేంద్రంలో వరుసగా రెండు సార్లు ఏర్పడ్డ భాజపా ప్రభుత్వం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

కేంద్ర బడ్జెట్‌లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాకర్షక పథకాలకు ప్రాధాన్యం ఇస్తారా? లేక దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉంటాయా అన్న అంశంపై అందరి దృష్టీ ఉంది. కరోనా సృష్టించిన అల్లకల్లోలం దేశంలో సగటు మనిషి జీవన స్థితిగతులను దారుణంగా దెబ్బతీసింది. కరోనా ముప్పు తొలగి, కార్యకలాపాలు కుదురుకుంటున్న సమయంలో.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించడంతో ప్రపంచమంతటా సమస్యలు పెరిగాయి. సరకుల సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ద్రవ్యోల్బణం ప్రబలింది. ఐరోపా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారడంతో మరికొన్నాళ్లు అంతర్జాతీయంగా ఒడుదొడుకులు కొనసాగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో సరకులకు గిరాకీని పెంచడం ఆర్థిక వృద్ధికి చాలా కీలకమని, ఇందుకోసం పేదల జీవన ప్రమాణాలను పెంచేదిశగా ఆర్థిక విధానాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సగటు మనిషి జీవితం దారుణం

కరోనాకు ముందు నుంచే భారత ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భారతీయుడి తలసరి వార్షిక స్థూల జాతీయాదాయం ఇంకా కరోనా ముందు స్థాయికి చేరలేదు. కరోనా తర్వాత కార్యకలాపాలు పెరిగాయి. తగిన వనరులు ఉన్న వర్గాలు వేగంగానే పుంజుకున్నాయి. కరోనావల్ల ఆదాయాలు కోల్పోయి.. మనుగడ కోసం అప్పటివరకూ ఆదా చేసుకున్న కొద్దోగొప్పో మొత్తాలను వాడేసుకున్నవారు, అప్పుల పాలైన సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి కొనుగోలు శక్తి బాగా క్షీణించింది. దీంతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. భారతదేశంలో 2012-21 మధ్య సృష్టించిన సంపదలో జనాభాలో 1% ఉన్న కుబేరుల చేతుల్లోకి 40% వెళ్లిందని, అడుగున ఉన్న 50%కు 3% మాత్రమే దక్కిందని ‘ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ తాజా నివేదిక పేర్కొంది. మరోవైపు దేశంలో జీఎస్టీద్వారా ప్రభుత్వం పొందే ఆదాయంలో 64% అడుగున ఉన్న 50% మంది నుంచే వస్తోందని, అగ్రస్థానంలోని 10% మంది కట్టేది 4 శాతమేనని నివేదిక విశ్లేషించింది. కేంద్రానికి సంబంధించిన జాతీయ గణాంక కార్యాలయం 2019 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ‘అఖిల భారత అప్పులు, పెట్టుబడుల సర్వే’ నివేదిక దేశంలో పెరుగుతున్న అసమానతల గురించి కొన్ని కీలకాంశాలను వెల్లడించింది. దేశంలోని పట్టణ ఆస్తుల్లో 56% కేవలం 10 శాతంగా ఉన్న ఉన్నతశ్రేణి జనాభా చేతిలో ఉన్నాయని, అడుగున ఉన్న 50% చేతిలో కేవలం 6% ఆస్తులే ఉన్నాయని అది పేర్కొంది. గ్రామీణ ఆస్తుల్లోనూ ఉన్నత శ్రేణి చేతిలో 51% ఆస్తులు, అడుగున ఉన్న 50 శాతం ప్రజల చేతిలో 10% ఆస్తులున్నాయని విశ్లేషించింది. నీతి ఆయోగ్‌ నివేదికల్లోనూ దేశంలో ప్రాంతాలవారీ అసమానతలు బయటపడుతున్నాయి. అడుగున ఉన్న 50% ప్రజల జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి పెరగకుండా దేశ ఆర్థిక రంగం ముందుకెళ్లడం అసాధ్యమని వారు చెబుతున్నారు. కొన్నేళ్లుగా దిగువ మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి ఎంత తగ్గిపోయిందో తెలిపేలా ఆర్థిక నిపుణులు ఉదాహరణలు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల విక్రయాలు దేశంలో గణనీయంగా పడిపోయాయనేది వారి విశ్లేషణ. వ్యయాలు పెరిగిపోవడం, కొవిడ్‌తో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం వంటి కారణాలతో ద్విచక్ర వాహన రంగం పదేళ్లు వెనక్కి పోయిందని అగ్రశ్రేణి ద్విచక్ర వాహన సంస్థ ప్రతినిధులు చెప్పారు. 2018-19లో దేశంలో 2.12 కోట్ల వాహనాలు అమ్ముడవగా 2021-22లో 1.34 కోట్లే అమ్ముడయ్యాయి. 2022-23లో విక్రయాలు 1.25 కోట్ల లోపుండే అవకాశం ఉంది. మరోవైపు ఖరీదైన కార్ల విక్రయాలు 2019తో పోలిస్తే 2022లో పెరిగాయి. 2019లో దేశంలో విలావంతమైన కార్లు 35వేలు అమ్ముడుపోతే 2022లో వాటి సంఖ్య 38వేలకు చేరింది.

* ఆర్థికంగా బలమైన దేశంగా ఎదిగే సత్తా మన దేశానికి ఉంది. ఐటీ, ఫార్మా రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. మన వాతావరణ పరిస్థితులు పంటల సాగుకు అనుకూలమైనవి. బ్యాంకింగ్‌ రంగం కొద్దికాలంగా బలపడుతోంది. ముడి సరకులు, పరికరాలకు ఇంతకాలం చైనాపైనే ఆధారపడ్డ పలు దేశాలు.. ఇప్పుడు ఇతర దేశాలవైపూ చూస్తున్నాయి. ఉత్పత్తి పరిశ్రమలను పెంచుకునేందుకు భారత్‌కు ఇదో మంచి అవకాశం. రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కొంతకాలంగా బాగా ఖర్చు పెడుతోంది.

రిజర్వు బ్యాంకు ప్రకటించే బులెటిన్ల ప్రకారం.. 2019 ఫిబ్రవరితో పోలిస్తే 2022 ఆగస్టు నాటికి బ్యాంకుల్లో బంగారం తాకట్టు రుణాలు 218% పెరిగాయి. కరోనా కారణంగా తమ మనుగడ కోసం, వైద్యం వంటి ఇతర అవసరాల కోసం సామాన్యులు అప్పుల పాలవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ.

కరోనా కాలంలో పిల్లల చదువులు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. వారి భవిష్యత్తు, దేశ పురోగతి దృష్ట్యా విద్యా ప్రమాణాలను పెంచేందుకు నిధులు ఖర్చు పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉండాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వంటివారు చెబుతున్నారు.


వృద్ధిరేటును కాపాడుకోవడం కీలకం
- బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల నిపుణుడు తుమ్మల కిశోర్‌

వడ్డీ రేట్ల పెంపు, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, జాతీయ.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ వృద్ధి రేటును కాపాడుకోవడం కీలకమని బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల నిపుణుడు తుమ్మల కిశోర్‌ తెలిపారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండాలనే విషయమై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

ఆయన అభిప్రాయాలివీ...

* వృద్ధిరేటు పెరగాలంటే మౌలిక వసతులపై బాగా ఖర్చు చేయాలి. ప్రస్తుత ఏడాది మూలధన వ్యయం కోసం రూ.7.5 లక్షల కోట్లు కేటాయించారు. దీన్ని రూ.10-12 లక్షల కోట్లకు పెంచాలి. ప్రైవేటు పెట్టుబడులు ఇప్పుడే పెరుగుతున్నాయి. వాటికి మరింత ఊతమిచ్చేలా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను విస్తరించాలి.

* దేశ రుణభారం బాగా పెరిగింది. 2022 సెప్టెంబరు నాటికే రుణాలు రూ.147.19 లక్షల కోట్లకు చేరాయి. అందువల్ల పన్ను, పన్నేతర ఆదాయాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. మన దేశంలో జీడీపీలో పన్నుల వాటా 11.7 శాతమే. అది బ్రిటన్‌లో 33.5%, అమెరికాలో 26.6%, ఫ్రాన్స్‌లో 45.1% గా ఉంది. ఇక భారత్‌లో మొత్తం జనాభాలో ఆదాయ పన్ను చెల్లించేవారు 5.9 శాతమే. అమెరికాలో 59.9%, బ్రిటన్‌లో 63% మంది పన్ను కడతారు. దేశంలో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అసంఘటిత రంగంలో బాగా సంపాదిస్తూ పన్ను కట్టని వారిపై దృష్టి పెట్టాలి.

* గత ఆర్థిక సంవత్సరానికే దేశంలో పన్ను బకాయిలు రూ.16.19 లక్షల కోట్లకు చేరాయి. వివాదాస్పద పన్ను బకాయిలను వేగంగా పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి.

* ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రూ.65వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాల్సి ఉండగా ఇప్పటికి రూ.31వేల కోట్లనే ఉపసంహరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి.

* దేశ జీడీపీలో 60% వృద్ధి దేశీయ వినియోగంవల్ల వస్తున్నదే. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గుతోంది. అక్కడ ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు ఉండాలి. గత బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి రూ.73వేల కోట్లు కేటాయించారు. ఆ మొత్తాన్ని పెంచి, పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చాలి.

* రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇంకా అందని ద్రాక్షలానే ఉంది. రైతుల ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండాలి.

* ఒకపక్క ద్రవ్యోల్బణం, మరోపక్క ఉద్యోగాల కోతలతో భయంతో బతుకుతున్న మధ్యతరగతి ప్రజానీకానికి, ఉద్యోగులకు కొంత ఊరట ఇచ్చేలా కొన్ని ఆదాయ పన్ను మినహాయింపులను, రాయితీలను ప్రకటించాలి. పింఛనుపై పన్నులను మినహాయించాలని సీనియర్‌ సిటిజన్లు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఈ బడ్జెట్‌ వాటికి పచ్చజెండా ఊపాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని