నా బిడ్డకు అపాయం జరిగితే మంత్రి దాడిశెట్టి రాజాయే కారణం

తన బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు, వారిని కాపాడుతున్న మంత్రి దాడిశెట్టి రాజాయే కారణమవుతారని కాకినాడ జిల్లా రాయుడిపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర పేర్కొన్నారు.

Updated : 25 Jan 2023 08:23 IST

కాకినాడకు చెందిన మహిళ రాజులపూడి ఆరుద్ర ఆవేదన
మరోసారి తాడేపల్లి వచ్చి స్పందనలో వినతిపత్రం అందజేత

ఈనాడు, అమరావతి: తన బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు, వారిని కాపాడుతున్న మంత్రి దాడిశెట్టి రాజాయే కారణమవుతారని కాకినాడ జిల్లా రాయుడిపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర పేర్కొన్నారు. మంగళవారం ఆమె సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి స్పందన విభాగంలో వినతిపత్రం అందజేశారు. ‘కానిస్టేబుళ్లు శివ, కన్నయ్యలు నన్ను వేధించి, ఇల్లు అమ్ముకోకుండా అడ్డుపడటం వల్లే నా కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు సకాలంలో వైద్యం చేయించలేకపోయాను. ఇప్పుడు సమయం మించిపోయిందని, శస్త్ర చికిత్స చేస్తే ఆమె మెదడు అచేతనమై పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు’ అని ఆరుద్ర బోరున విలపించారు. వెన్నెముకకు సంబంధించిన తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ, అచేతన స్థితిలో ఉన్న తన కుమార్తెకు వైద్యం చేయించేందుకు సొంత ఇంటిని అమ్ముకుందామనుకుంటే పొరుగున ఉండే ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడి, తనను వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ గత ఏడాది నవంబరులో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంవద్ద ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. వినతిపత్రం ఇచ్చిన అనంతరం తల్లి ఆరుద్ర విలేకరులతో మాట్లాడుతూ.. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, వారు వేసిన కేసులో తనను కోర్టు చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో కన్నయ్య.. మంత్రి దాడిశెట్టి రాజాకు గన్‌మన్‌గా పని చేశారన్నారు. శివ, కన్నయ్యలపై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన అప్పటి అన్నవరం సీఐ రజనీకాంత్‌, ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ సాక్ష్యాధారాల్ని ప్రభుత్వ న్యాయవాదికి అందజేయలేదని, అందుకే తాను కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు