AP CMO: ట్యాపింగ్‌ ఆరోపణలపై సీఎంవోలో వరస సమీక్షలు!

రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల వ్యవహారం సంచలనంగా మారింది. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ ఆరోపించిన అధికార వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుధవారం తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టారు.

Updated : 02 Feb 2023 12:29 IST

ముఖ్యమంత్రి జగన్‌తో  సజ్జల, బాలినేని భేటీ
సీఎంవో అధికారులతో ఇంటెలిజెన్స్‌ అధిపతి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల వ్యవహారం సంచలనంగా మారింది. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ ఆరోపించిన అధికార వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుధవారం తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టారు. ఇటు రాజకీయంగానూ.. అటు ప్రభుత్వపరంగా పోలీసు శాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్యాపింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో రాత్రి వరకు హడావుడి నెలకొంది. వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైకాపా నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన నివాసంలో కలిసి, నెల్లూరులో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు ప్రభుత్వంపై చేసిన తీవ్ర వ్యాఖ్యల విషయమై చర్చించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి పార్టీ బాధ్యుడిగా ఎవరిని నియమించాలి వంటి అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. మరోవైపు ఇంటెలిజెన్స్‌ అధిపతి ఆంజనేయులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా సీఎంవోలో ఉన్నతాధికారులను కలిసి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై చర్చించారు.  

ట్యాపింగ్‌ అవసరం లేదు: సజ్జల

ముఖ్యమంత్రితో భేటీ తర్వాత సజ్జల తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు స్పందించారు. ‘ఫోన్‌ ట్యాప్‌ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తెదేపాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.. 2024లో తెదేపా నుంచి పోటీ చేస్తానంటూ శ్రీధర్‌రెడ్డి మాట్లాడిన మాటల ఆడియో బయటకు వచ్చింది. మరి సీటు కూడా ఖరారు చేసుకున్నాకనే దానికి గ్రౌండ్‌ సిద్ధం చేసుకోవడంలో భాగంగానే ఆయనిలా మాట్లాడుతున్నట్లుంది. ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాప్‌ చేస్తే ఆ రికార్డును ఇంటలిజెన్స్‌ ఛీఫ్‌ మళ్లీ ఆయన (ఎమ్మెల్యే)కే ఎందుకు పంపుతారు? బయట ఎక్కడో తన దృష్టికి వచ్చిన విషయాన్ని పంపించి ఉండొచ్చు.. వేరే పార్టీ అభ్యర్థిని అని శ్రీధర్‌రెడ్డే ప్రకటించుకున్నాక, ఆయన్ను సస్పెండ్‌ చేయడమో మరోటో మేమెందుకు చేయడం?’ అని వ్యాఖ్యానించారు. ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ.. ‘అలాంటి విపరీతాలకు సమాధానమివ్వలేం. ఆనం, కోటంరెడ్డి ఎక్కడ నుంచి వచ్చారో.. ఎలా వచ్చారో వారికీ తెలుసు. ఏదో ఇమేజ్‌ను పెంచుకోవాలని చూస్తున్నట్లున్నారు. ఇవన్నీ వారు సమన్వయంతోనే చేస్తున్నట్లుంది’.. అన్నారు.

అవినాష్‌.. నవీన్‌కు ఫోన్‌ చేయడంలో వింత ఏముంది?

వివేకా హత్య కేసులో నవీన్‌ పేరు బయటకు రావడంపై సజ్జల మాట్లాడుతూ.. ‘చిన్నాన్న చనిపోతే ఆ విషయాన్ని ఎంపీ అవినాష్‌ సీఎంకు చెప్పడానికి ఫోన్‌ చేయరా? నవీన్‌ సీఎం ఇంట్లో పనిచేస్తారు.. సీఎం ఇంట్లోవారితో మాట్లాడాలంటే నవీన్‌కు ఫోన్‌ చేసి, ఆ ఫోన్‌ను వారికివ్వమని అడగరా? ఇందులో వింతేముంది?’ అని ప్రశ్నించారు. ‘విశాఖకు రాజధాని త్వరలో రాబోతోందని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారే తప్ప ఎప్పుడనేది చెప్పలేదు కదా, ఆ వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు కేసుకు సంబంధం ఏముంది’ అని మరో ప్రశ్నకు సమాధానంగా సజ్జల స్పందించారు.

ఆ వ్యక్తితోనే మాట్లాడిస్తాం: బాలినేని

‘అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది జరిగితేనే కదా దాని గురించి చర్చించాలి.. అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శ్రీధర్‌రెడ్డి చెబుతున్న ఆడియోలో మాట్లాడిన వ్యక్తినే తీసుకువచ్చి అసలు విషయం చెప్పిస్తాం.. ఆయన ప్రస్తుతం భయపడి దాక్కున్నట్లున్నారు. బయటకు తీసుకువస్తాం. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి పార్టీ బాధ్యుడిని గురువారం ప్రకటిస్తాం’ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని