రూ.475 కోట్లు ఇస్తారా? మళ్లిస్తారా?

నిధుల సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ప్రపంచ బ్యాంక్‌ నుంచి వడ్డీలేని రుణం కింద సుమారు రూ.475 కోట్లు రాబోతున్నాయి.

Published : 04 Feb 2023 07:37 IST

ప్రపంచ బ్యాంక్‌ రుణం కోసం వైద్య ఆరోగ్య శాఖ ఎదురుచూపులు
‘సింగిల్‌ నోడల్‌ ఎకౌంట్‌’కు చేరిన నిధుల రాకలోనూ జాప్యం
ప్రైవేట్‌ ఏజెన్సీలకు నిలిచిన చెల్లింపులు

ఈనాడు, అమరావతి: నిధుల సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ప్రపంచ బ్యాంక్‌ నుంచి వడ్డీలేని రుణం కింద సుమారు రూ.475 కోట్లు రాబోతున్నాయి. ఇవి ఖజానాకు చేరిన వెంటనే ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు మళ్లిస్తుందా?లేదా అన్న దానిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. రోగులకు అందించే వైద్య సేవల మెరుగు కోసం వైద్య ఆరోగ్యశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనల మేరకు ప్రపంచ బ్యాంక్‌ రూ.475 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ నిధులు త్వరలో ప్రభుత్వ ఖజానాకు చేరుకోనున్నందున ఇతర అవసరాలకు మళ్లించకుండా వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వీటి ద్వారా కొంతవరకైనా నిధుల సంక్షోభ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆశిస్తున్నాయి.

రూ.675 కోట్లు తెప్పించి..!

నిధుల లభ్యత, ఆర్థికశాఖతో సంప్రదింపులు లేకుండానే వైద్య ఆరోగ్య శాఖ చేపట్టాల్సిన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి చర్యలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ అరకొర కేటాయింపులతో అవసరమైన చర్యలు తీసుకోలేక..వైద్య ఆరోగ్య శాఖ సతమతమవుతోంది. కొద్దికాలం కిందట ప్రభుత్వాసుపత్రులు, హెచ్‌ఓడీ కార్యాలయాల బ్యాంకు ఖాతాల నుంచి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సింగిల్‌ నోడల్‌ ఎకౌంట్‌’కు సుమారు రూ.670 కోట్లు చేరాయి. వీటిని తిరిగి ఆసుపత్రులు, హెచ్‌ఓడీ కార్యాలయాలకు పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో పీపీపీ విధానంలో రోగులకు వివిధ రకాల సేవలు అందించే ప్రైవేట్‌ ఏజెన్సీల వారికి గత ఆరేడు నెలల నుంచి చెల్లింపులు స్తంభించాయి. రోగులకు డయాలసిస్‌ చేసే సంస్థకు రూ.15 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. అలాగే..ముఖ్యమంత్రి ‘ఐ’ కేంద్రాలు, ఇతర సర్వీసులు అందిస్తున్న సంస్థలకు బిల్లులు గత కొద్దినెలల నుంచి ఆగాయి. వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, పెస్ట్‌ అండ్‌ రోడెంట్‌ కింద పనులు చేస్తున్న సంస్థలకు గత జులై నుంచి చెల్లింపులు జరగడంలేదు. సుమారు రూ.70 కోట్ల వరకు బిల్లులు నిలిచాయి. ఎక్స్‌రే, సీటీ స్కానింగ్‌ సేవలు అందించే సంస్థకు కూడా చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీని ప్రభావం పనుల నాణ్యతపై కనిపిస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ తరఫున ప్రభుత్వాసుపత్రులకు సర్జికల్‌, మందులు సరఫరా చేసిన సంస్థలకు చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. సుమారు రూ.200 కోట్లకుపైగా బిల్లులు పెండింగులో ఉన్నట్లు తెలిసింది.


2 నెలల నుంచి వేతనాల్లేవ్‌

* 108, 104 ఉద్యోగులకు డిసెంబరు నుంచి వేతనాల చెల్లింపులు జరగడంలేదు. వీటిని నిర్వహించే సంస్థలకు గత జులై నుంచి సుమారు రూ.150 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. తల్లీబిడ్డ పథకం కింద వాహనాలు నడిపే సంస్థకు 5 నెలల నుంచి చెల్లింపులు నిలిచాయి. ఈ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు గత రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు.

* వైద్య విధాన పరిషత్‌ ద్వారా కొత్తగా విధుల్లోకి వచ్చిన వైద్యులు, జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చినందున అక్కడ పనిచేసే వారికి వేతనాల చెల్లింపుల్లో నెల, రెండు నెలల నుంచి జాప్యం జరుగుతోంది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా చర్యలు కొరవడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని