రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశాం

రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘాన్ని  మూడేళ్ల కాలానికి ఏర్పాటు చేసినట్లు, ఈ మేరకు జీవో ఇచ్చినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.

Updated : 21 Mar 2023 05:31 IST

హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం 

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘాన్ని  మూడేళ్ల కాలానికి ఏర్పాటు చేసినట్లు, ఈ మేరకు జీవో ఇచ్చినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, మరో నలుగురు సభ్యుల వివరాలను ప్రభుత్వ న్యాయవాది శ్రేయాస్‌రెడ్డి మెమో రూపంలో కోర్టు ముందుంచారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్‌ రత్నకుమారిని ఛైర్‌పర్సన్‌గా, విశాఖ ఏయూ  విశ్రాంత రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎం.ప్రసాదరావు, విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎంవీఎన్‌ పద్మారావు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రకాశం జిల్లా పూర్వ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కాకి కృపారావును సభ్యులుగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రస్తుత డైరెక్టర్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ కేవీ రమణారెడ్డిని సభ్యకార్యదర్శిగా నియమించినట్లు చెప్పారు. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జారీచేసిన నోటిఫికేషన్‌ వివరాలను కోర్టుకు జీపీ అందించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర స్పందిస్తూ.. కమిషన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో... కోర్టు ముందు ప్రభుత్వం ఉంచిన వివరాలను నమోదు చేసి, వ్యాజ్యంపై విచారణను ముగించాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఆవివరాలను నమోదు చేసి వ్యాజ్యంపై విచారణను ముగించింది. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి హైకోర్టులో పిల్‌వేసిన విషయం తెలిసిందే. ఏపీలో నాలుగో ఆర్థిక సంఘం కాలపరిమితి 2020తో ముగిసినా ఐదో సంఘాన్ని ఏర్పాటు చేయలేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని