రైస్‌మిల్లర్లకు ఎర్రతివాచీ!
ధాన్యం సేకరణలో ఈ ఏడాది కొత్త విధానం తెచ్చామని, మిల్లర్ల ప్రమేయం లేకుండా చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా చెబుతుండగా అదే మిల్లర్లకు పౌర సరఫరాలశాఖ ఎర్ర తివాచీ పరచి ఆహ్వానిస్తోంది.
రైతు నుంచి ధాన్యం తీసుకెళ్లేది వారే
చౌక దుకాణాలకు బియ్యం సరఫరా చేసేదీ వారే
టెండరు ద్వారా కట్టబెడుతున్న పౌరసరఫరాల శాఖ
9 జిల్లాల్లో రబీ నుంచి అమలు
ధాన్యం సేకరణలో అక్రమాలకు మరింత అవకాశం
రీసైక్లింగ్‌కు ఊతమిచ్చేలా కొత్త విధానం
ఈనాడు - అమరావతి
ధాన్యం సేకరణలో ఈ ఏడాది కొత్త విధానం తెచ్చామని, మిల్లర్ల ప్రమేయం లేకుండా చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా చెబుతుండగా అదే మిల్లర్లకు పౌర సరఫరాలశాఖ ఎర్ర తివాచీ పరచి ఆహ్వానిస్తోంది. రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లడం నుంచి బియ్యంగా మార్చి నేరుగా రేషన్ దుకాణాలకు సరఫరా చేసే వరకు.. బాధ్యతంతా రైస్‌మిల్లర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రబీ నుంచే గంపగుత్తగా కట్టబెట్టాలని భావిస్తోంది. ధాన్యం అమ్ముకోవాలంటే ఇప్పటికే పడరాని పాట్లు పడుతూ, క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 నష్టపోతున్న అన్నదాతల భవిష్యత్తును..మిల్లర్ల చేతిలో పెట్టబోతోంది. ఇందులో భాగంగా 9 జిల్లాల్లో సీఎంఆర్ బియ్యం సరఫరాకు టెండర్లు పిలిచింది. వారికి సేవాప్రదాతలు(సర్వీస్ ప్రొవైడర్) అనే కొత్త పేరు పెట్టింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం సేకరణ వ్యవహారమంతా కేంద్రీకృతం చేసి.. ఎంపిక చేసిన కొందరికి, అదీ అధికారపార్టీ కనుసన్నల్లోని వారికి అప్పగించేందుకు ఇది తొలి అడుగుగా కొందరు మిల్లర్లే పేర్కొంటున్నారు. వైకాపాలోని కొందరు పెద్దల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని.. ఈ విధానం అమలులోకి వస్తే రేషన్ బియ్యం రీసైక్లింగ్ అక్రమాలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని దశాబ్దాలుగా పౌరసరఫరాల సంస్థ గోదాములపైనే ఆధారపడ్డ హమాలీల ఉపాధి కూడా ప్రశ్నార్థకం కానుంది. కొత్త విధానంలో పొలాల వద్దకు వచ్చి ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మిల్లర్లపైనే ఉంటుంది. రైతులకు గోనెసంచులు సమకూర్చడం నుంచి కూలీలు, వాహనాలను ఏర్పాటు చేసుకుని.. ఆర్‌బీకే(రైతుభరోసా కేంద్రం)ల్లో నిర్దేశించిన సమయానికి అనుగుణంగా ధాన్యాన్ని ఎత్తించాలి. తర్వాత ఆర్‌బీకేలో నాణ్యత పరీక్షలు నిర్వహించి.. అక్కడి నుంచి వేబ్రిడ్జికి తీసుకెళ్లి రైతులు, కొనుగోలుసిబ్బంది సమక్షంలో తూకం వేయించాలి. ట్రక్‌షీట్, ఎఫ్‌టీఓ తయారు చేసి ఇవ్వాలి.
* ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లాక నెల లోపు మర ఆడించి బియ్యంగా మార్చాలి. సార్టెక్స్, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కొత్త గోతాల్లో నింపాలి.
* సీఎంఆర్(కస్టమ్ రైస్ మిల్లింగ్) ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసిన బియ్యాన్ని గోదాముకు తరలించి నిల్వ చేయాలి.
* తహసీల్దారు ఇచ్చే తరలింపు ఉత్తర్వులకు అనుగుణంగా చౌకధరల దుకాణాలకు 24 గంటల్లోగా రవాణా చేయాలి.
రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న వారైతేనే
బిడ్లు దాఖలు చేసేవారు గత రెండేళ్లలో కనీసం రూ.100 కోట్ల మేర టర్నోవర్ చేసి ఉండాలని టెండరులో నిబంధన పెట్టారు. 5వేల నుంచి 7వేల టన్నుల సామర్థ్యంతో కూడిన రైస్‌మిల్ ఉండాలని పేర్కొంది. తమ సంస్థ, భాగస్వాములు, డైరెక్టర్ల పేరుతో కనీసం అయిదు సొంత వాహనాలు ఉండాలని వివరించింది.
దీంతో పెద్ద వారు తప్పితే చిన్నచిన్న వాళ్లకు ఇందులో పాల్గొనడం కష్టమేనని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు ఒకరికి బాధ్యతల్ని అప్పగించడం ద్వారా సేకరణ విధానాన్ని కేంద్రీకృతం చేస్తూ.. గుత్తాధిపత్యానికి తెరతీస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.
గోదాములు, నిల్వ కేంద్రాలుండవు
ప్రస్తుతం రెండు దశల్లో గోదాములు, రవాణా వ్యవస్థలు ఉన్నాయి. సీఎంఆర్ బియ్యాన్ని గోదాములకు తరలించి నిల్వ చేస్తారు. వాటిని ప్రతి నెలా మండలస్థాయి నిల్వ కేంద్రాలకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
* కొత్త విధానంలో బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయాల్సిన బాధ్యత రైస్‌మిల్లరుదే. అక్కడ్నుంచి చౌకధరల దుకాణాలకు పంపిస్తారు. మధ్యలో మండలస్థాయి నిల్వ కేంద్రాలు ఉండవు. అక్కడ హమాలీల అవసరమూ ఉండదు.
* ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 268 మండలస్థాయి గోదాముల్లో పనిచేసే 5వేల మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారనుందని రాష్ట్ర పౌరసరఫరాల మండలస్థాయి గోదాముల హమాలీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య ఆందోళన వెలిబుచ్చారు.
అప్పటికప్పుడు మిల్లింగ్ చేసి పంపిస్తే
కొన్ని నెలల పాటు ధాన్యాన్ని నిల్వ చేసి తర్వాత మిల్లింగ్ చేసి..చౌక దుకాణాలకు తరలించాలి. ఇది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. గోదాముల అద్దె భరించాలి. కొన్నాళ్లపాటు వాటిలో నిల్వ చేయాలి. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు నేరుగా అప్పటికప్పుడు మిల్లింగ్ చేసి చౌకధరల దుకాణాలకు చేరవేసే అవకాశం ఉంది. అలాంటి బియ్యాన్ని వండితే అన్నం ముద్దగా మారుతుంది.
* మండలస్థాయి నిల్వ కేంద్రం నుంచి వచ్చే బియ్యంలో తూకం తగ్గుతోంది. రాబోయే రోజుల్లో మిల్లర్లే నేరుగా డీలర్లకు సరఫరా చేస్తారు. రాజకీయ పలుకుబడి ఉన్న మిల్లరును.. ప్రశ్నించే పరిస్థితి ఉండదని డీలర్లు పేర్కొంటున్నారు. మిలర్ల ఆధిపత్యానికి తలొగ్గి పనిచేయాల్సి వస్తుందని వాపోతున్నారు.
అక్రమాలకు మరింత ఊతమిచ్చేలా..?
రేషన్ బియ్యంలో రీసైక్లింగ్ అతి పెద్ద సమస్య. కార్డుదారుల నుంచి కొని..వాటినే రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద పౌరసరఫరాల సంస్థకు అందిస్తున్న పరిస్థితి ఉంది. కొందరు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు మిల్లరు చేతికే మొత్తం వ్యవహారాన్ని అప్పగించడం ద్వారా.. ఇది మరింత పెరుగుతుందనే మాట వినిపిస్తోంది. రీసైక్లింగ్ బియ్యాన్ని నేరుగా మిల్లు నుంచి డీలర్లకు పంపేందుకు వీలుంటుంది. డీలర్లు, ఎండీయూలతో అవగాహన కుదుర్చుకోవడం ద్వారా కేటాయించిన మేరకు కాకుండా.. బియ్యాన్ని తగ్గించి పంపవచ్చు. అంతా మిల్లరు చేతిలో పనే. అధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్నా.. అదంతా కాగితాలకే పరిమితమవుతుందని డీలర్లు పేర్కొంటున్నారు.
పెద్దల్ని ప్రశ్నించగలరా?
ధాన్యం సేకరణలోనూ మిల్లర్ల పాత్ర కారణంగానే రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. తేమ, నూక పేరుతో బస్తాకు రూ.200 నుంచి రూ.300 కోత పెడుతున్నారు. ఇప్పుడు వారినే నేరుగా పొలాల వద్దకు తీసుకొస్తున్నారు. ధాన్యం తీసుకెళ్లడం నుంచి మిల్లింగ్ చేసి బియ్యం ఇచ్చే వరకు మొత్తం వ్యవహారమంతా ఒకరికే అప్పగించడం ద్వారా.. మిల్లరుకు పెద్దపీట వేస్తున్నారు. టెండరులో పేర్కొన్న వివిధ నిబంధనలను అమలయ్యేలా మండల, జిల్లాస్థాయి అధికారులు పనిచేసే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
7లక్షల టన్నుల సేకరణ
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 7 లక్షల టన్నుల మేర సేకరించి మిల్లింగ్ చేసి చౌకధరల దుకాణాలకు తరలించేలా పౌర సరఫరాలశాఖ టెండర్లు పిలిచింది. తూర్పు గోదావరి జిల్లాలో 95వేలు, పశ్చిమగోదావరి-1.50 లక్షలు, కృష్ణా-43వేలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా-లక్ష, కాకినాడ జిల్లా- 65వేలు, ఎన్టీఆర్ జిల్లా-29వేలు, ఏలూరు-1.10లక్షలు, నెల్లూరు జిల్లా-85వేలు, తిరుపతి జిల్లాలో 23వేల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు రవాణా చేసి మిల్లింగ్ చేయాల్సి ఉంటుందని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు.
అధ్యయనం చేస్తున్నాం.. అప్పటి వరకు అమలు నిలిపేస్తున్నాం
- హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ
సంచులు, వాహనాల సరఫరాలో సమన్వయ లోపాల కారణంగా.. రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. సేవలు సరిగా అందకపోవడంతో సమయానికి ధాన్యాన్ని తరలించలేకపోతున్నాం. ఇవన్నీ ప్యాకేజీగా చేసి.. ఏజెన్సీకు ఇవ్వాలనే ఆలోచనలో భాగంగానే టెండర్లు పిలిచాం. బియ్యం రవాణాలోనూ జాప్యాన్ని నివారించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. సమన్వయ లోపాలతోపాటు అనవసర ఖర్చులు తగ్గించడానికే ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించాం. దీనిపై పూర్తి వివరాలు తీసుకుంటున్నాం. అధ్యయనం చేశాకే ముందుకు వెళ్తాం. అప్పటి వరకు టెండర్లను నిలిపేయాలని నిర్ణయించాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు
-
Movies News
Ram Charan: రామ్ చరణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు..: బాలీవుడ్ డైరెక్టర్
-
Sports News
CSK vs GT: ఇదంతా ‘మహి’మే: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
-
World News
Elon Musk: చైనాలో ల్యాండ్ అయిన ఎలాన్ మస్క్..!
-
India News
Wrestlers Protest: మా పతకాలను నేడు గంగలో కలిపేస్తాం.. రెజ్లర్ల హెచ్చరిక
-
Crime News
Hyderabad: రాజేశ్‌ది హత్యేనా? ప్రభుత్వ టీచర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?