AP HighCourt: సెషన్స్‌ కోర్టు ఉండగా మేజిస్ట్రేట్‌ ముందు ఎందుకు హాజరుపరిచారు?

సెషన్స్‌ (ప్రత్యేక) కోర్టు సమీపంలో ఉండగా.. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేసులో ఛార్టెర్డ్‌ ఎకౌంటెంట్‌ కుదరవల్లి శ్రావణ్‌ను విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ (ఏసీఎంఎం) కోర్టు ముందు ఎందుకు హాజరుపరిచారని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది.

Updated : 18 Apr 2023 10:22 IST

సీఐడీకి హైకోర్టు ప్రశ్న
మేజిస్ట్రేట్‌ రిమాండు విధించడం సరిదిద్దలేని లోపమని వ్యాఖ్య
ఆడిటర్‌ శ్రావణ్‌కు రిమాండును సవాలు చేస్తూ హైకోర్టులో ఆయన భార్య వ్యాజ్యం
బెయిలు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై తీర్పు వాయిదా

ఈనాడు, అమరావతి: సెషన్స్‌ (ప్రత్యేక) కోర్టు సమీపంలో ఉండగా.. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేసులో ఛార్టెర్డ్‌ ఎకౌంటెంట్‌ కుదరవల్లి శ్రావణ్‌ను విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ (ఏసీఎంఎం) కోర్టు ముందు ఎందుకు హాజరుపరిచారని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. ఆచరణ సాధ్యంకాని ఇబ్బంది ఉంటే అర్థం చేసుకోగలమని, సమీపంలో ప్రత్యేక కోర్టు ఉండగా మేజిస్ట్రేట్‌ వద్ద హాజరుపరచడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. శ్రావణ్‌కు బెయిలు కోసం ఆయన భార్య దాఖలుచేసిన అనుబంధ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. మార్గదర్శి కేసులో శ్రావణ్‌ను జ్యుడిషియల్‌ రిమాండుకు పంపే అధికారం విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టుకు లేదంటూ ఆయన భార్య డాక్టర్‌ కె.నర్మద హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా రిమాండు విధించారు

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదించారు. శ్రావణ్‌ను 48 గంటలకు పైగా సీఐడీ అక్రమంగా నిర్బంధంలో ఉంచుకుందని, ఈ విషయాన్ని మేజిస్ట్రేట్‌ పరిగణనలోకి తీసుకోకుండా యాంత్రికంగా రిమాండు విధించారన్నారు. ఆడిటర్లు పొరపాటు చేస్తే.. కంపెనీ చట్ట పరిధిలోకి వస్తుందని, ఈ వ్యవహారాన్ని ప్రత్యేక కోర్టు మాత్రమే విచారణ జరపాలన్నారు. డిపాజిటర్ల చట్టం కింద (ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం) నమోదు చేసిన కేసులో మేజిస్ట్రేట్‌కు జ్యుడిషియల్‌ రిమాండు విధించే అధికారం లేదన్నారు. ఆడిట్‌ నిర్వహణలో శ్రావణ్‌ చట్టబద్ధ విధులను నిర్వహించారన్నారు. ‘ఒకే విషయంలో బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి వీల్లేదు. దీనిపై ఉమ్మడి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. విజయవాడ జైలులో ఉన్న శ్రావణ్‌ను పీటీ వారంటుపై విశాఖకు తీసుకెళ్లారు. బెయిలు రాకుండా మరికొన్ని చోట్లకు తిప్పే ప్రమాదముంది. బెయిలు మంజూరు చేయాల’ని కోరారు.

బెయిలు పిటిషన్‌ వేసుకోవాలి: సీఐడీ

సీఐడీ తరఫున న్యాయవాది శివకల్పనారెడ్డి వాదిస్తూ.. ‘రిమాండు విధింపుపై హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలుకు వీల్లేదు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. బెయిలు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలన్నారు. ‘జ్యుడిషియల్‌ రిమాండు నిమిత్తం శ్రావణ్‌ను తొలుత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచాం. తర్వాత కేసు ఫైలును విజయవాడలోని సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేశాం. సెషన్స్‌ కోర్టు న్యాయాధికారి రిమాండును పొడిగించారు. రిమాండు విధింపు చట్టబద్ధమే. జోక్యం చేసుకోవద్ద’ని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. డిపాజిటర్ల చట్టంతో ముడిపడిన ఈ కేసులో మేజిస్ట్రేట్‌కు రిమాండు విధించే అధికార పరిధి లేదనే పిటిషనర్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసినట్లు చెబుతున్నారని తెలిపింది. రిమాండు విధించడం సరిదిద్దలేని లోపంగా అభిప్రాయపడింది. బెయిలుపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని