AP Police - AP Govt - CBI: సహకరించమంటే.. చేతులెత్తేస్తారా?

పనితీరు, సమర్థత సహా అన్నింటా పేరు ప్రఖ్యాతలతో ఒకప్పుడు దేశంలోనే ముందు వరుసలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగం.. ఇప్పుడు పాతాళానికి పతనమైపోయింది.

Updated : 23 May 2023 13:04 IST

రాష్ట్ర పోలీసులకు మాయని మచ్చ
అవినాష్‌ అరెస్టు వ్యవహారంలో సీబీఐకి సహకరించని వైనం

ఈనాడు, అమరావతి: పనితీరు, సమర్థత సహా అన్నింటా పేరు ప్రఖ్యాతలతో ఒకప్పుడు దేశంలోనే ముందు వరుసలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగం.. ఇప్పుడు పాతాళానికి పతనమైపోయింది. సీబీఐ లాంటి ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయటానికి సహకరించాలని కోరితే తమ వల్ల కాదని చేతులెత్తేసింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 పేరిట ఆంక్షలు విధించి ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టనీయకుండా నిర్బంధాలు అమలు చేసే పోలీసులు.. హత్య కేసు నిందితుడికి రక్షణకవచంలా నిలిచి, సీబీఐని ఆ సమీపంలోకి రాకుండా మోహరించిన ఆయన అనుచరుల్ని మాత్రం అక్కడి నుంచి మాత్రం చెదరగొట్టలేదు. ఆ దిశగా కనీస ప్రయత్నమైనా చేయలేదు. అవినాష్‌ అనుచరులు, వైకాపా కార్యకర్తలు మీడియాపైన దాడులు చేస్తూ, కెమెరాలు ధ్వంసం చేస్తూ, అల్లర్లకు, దౌర్జన్యానికి తెగబడుతున్నా సరే వారిని చూస్తూ ఉండిపోయారే తప్ప చర్యలు తీసుకోలేదు. జీవో నంబర్‌ 1 పేరిట రోడ్డుపైన ఎలాంటి సభలు, కార్యక్రమాలు నిర్వహించకూడదంటూ నిషేధాజ్ఞలు అమలు చేసిన పోలీసులు.. విశ్వభారతి ఆసుపత్రి వద్ద వందల మంది అవినాష్‌రెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు ఆందోళన చేయటంతో ఆ సందులోని దాదాపు పది ఆసుపత్రులు, క్లినిక్‌లకు వచ్చే వందల మంది రోగులు, వారి బంధువులు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

జిల్లా ఎస్పీ తలుచుకుంటే గంటల వ్యవధిలో వారందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. కర్నూలు నగరంలోనే 5 పోలీసుస్టేషన్లు, చుట్టుపక్కల మరో 15 వరకూ పోలీసుస్టేషన్లున్నాయి. ఎస్పీ ఆధీనంలోనే వందల మంది ఏఆర్‌ సిబ్బంది ఉంటారు. కర్నూలు నడిబొడ్డున ఏపీఎస్సీ బెటాలియన్‌ కూడా ఉంది. పక్క జిల్లాల నుంచి కూడా గంటల వ్యవధిలోనే భారీగానే బలగాల్ని రప్పించొచ్చు. కనీసం రెండు, మూడు గంటల్లో దాదాపు వెయ్యి మంది పోలీసులను ఎస్పీ చాలా సులువుగా తీసుకొచ్చి విశ్వభారతి ఆసుపత్రి వద్ద అల్లర్లు, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించొచ్చు. అందులోనూ కర్నూలు ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు ఎస్పీగా ఇదే తొలి పోస్టింగ్‌. నిరూపించుకోవటానికి ఇదొక మంచి అవకాశం. అయినా ఈ విషయంలో తానేమీ చేయలేనని ఆయన చేతులేత్తేశారంటే దీని వెనక ఎంతటి శక్తిమంతులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సీబీఐకి సహాయ నిరాకరణ చేయటం వల్ల కెరీర్‌పై మచ్చ పడుతుందని తెలిసి కూడా కర్నూలు ఎస్పీ అలా వ్యవహరించారంటే ఆయన చేతులు, కాళ్లు కట్టేసేలా ఎవరి ఆదేశాలు పనిచేసుంటాయో సులువుగా అవగతమవుతుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరైనా ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, వారిని అరెస్టు చేయటానికి సీబీఐ వంటి సంస్థలు వస్తే రాష్ట్ర పోలీసులు ఇలానే వ్యవహరిస్తారా? దగ్గరుండీ మరీ సీబీఐకి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు సమకూర్చి మరీ సహకరిస్తారు కదా! మరి అవినాష్‌ అరెస్టు విషయంలో సీబీఐకి సహాయ నిరాకరణ చేయటానికి ప్రభుత్వ ఒత్తిళ్లు కారణం కాదా? ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ల్లో నెలకొన్న పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చిన ఘనత జగన్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకే దక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని