Single Subject Degree: ప్రభుత్వ డిగ్రీలో సింగిల్‌ సబ్జెక్టు కల్లోలం

డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకొస్తున్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.

Updated : 30 May 2023 09:56 IST

సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టులను తగ్గించేస్తున్న కమిషనరేట్‌
పేద విద్యార్థులకు అవకాశాలను దూరం చేస్తున్న ప్రభుత్వం
ప్రైవేటు కళాశాలలకు విద్యార్థులు తరలిపోయేలా నిర్ణయాలు

ఈనాడు, అమరావతి: డిగ్రీలో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకొస్తున్న సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి అధ్యయనం లేకుండా ఉన్నత విద్యామండలి హడావుడిగా తీసుకొచ్చిన ఈ విధానం ఇప్పుడు పేద విద్యార్థుల అవకాశాలకు గండికొడుతోంది. అధ్యాపకుల కొరత పేరుతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టులను తగ్గించేస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సి ఉండగా... వీటిని కొన్నింటికే పరిమితం చేస్తున్నారు. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో చదివేందుకు విద్యార్థులు జిల్లాలు దాటి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. 54 మేజర్‌, 53 మైనర్‌ సబ్జెక్టుల్లో అవకాశం కల్పిస్తున్నామని, ఇవి కాకుండా కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ఉపాధి నిచ్చే మరో 45 మైనర్‌ సబ్జెక్టులు ఉంటాయని ఉన్నత విద్యామండలి సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టును తీసుకొస్తున్న సమయంలో వెల్లడించింది.

వీటికి కళాశాలల్లో అధ్యాపకులు లేకపోతే ఉన్నత విద్యామండలే ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతుందని తెలిపింది. కానీ, ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే ఉన్న సబ్జెక్టులను తొలగించేస్తున్నారు. ఒక సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టును ప్రవేశపెట్టాలంటే కనీసం 25 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధనను కళాశాల విద్య కమిషనరేట్‌ తీసుకొచ్చింది. విద్యార్థుల ఆసక్తిని పట్టించుకోకుండా కమిషనరేట్‌ నుంచే ఏ కోర్సులు పెట్టాలో నిర్ణయించేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని కోర్సులనే పెడుతూ ఆదేశాలు ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ మేజర్‌లను ప్రవేశపెడితే అధ్యాపకుల అవసరం పెరుగుతుంది. అధ్యాపకుల సంఖ్యను తగ్గించుకునేందుకు కొన్ని సబ్జెక్టుల్లోనే కోర్సులు ప్రవేశపెడుతున్నారు.

కోరుకున్న చదువు దూరం

డిగ్రీలో ఈ ఏడాది సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఒక సబ్జెక్టు మేజర్‌గా.. మరో సబ్జెక్టును మైనర్‌గా చదవొచ్చు. ఉదాహరణకు బీఎస్సీలో గణితం మేజర్‌గా సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మైనర్‌గా భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్‌సైన్సు ఇలా నచ్చిన సబ్జెక్టును చదువుకోవచ్చు. విద్యార్థులు ఎంచుకునేందుకు విస్తృతంగా ఐచ్ఛికాలు ఇవ్వాలి. కానీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పేద విద్యార్థులకు అవకాశాలను తగ్గించేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఆరు ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. వీటిల్లో గణితం, భౌతికశాస్త్రం చదివేందుకు అవకాశం లేకుండా పోయింది. గణితం కనీసం మైనర్‌ సబ్జెక్టుగాను చదివే అవకాశం లేదు. ఈ జిల్లాలో 400 మందికిపై విద్యార్థులున్న ఓ కళాశాలలో గతంలో 8 గ్రూపులు ఉండేవి. బీఎస్సీలో గణితంతోపాటు కంప్యూటర్‌సైన్సు చదువుకునే అవకాశం ఉండేది.

ఇప్పుడు సింగిల్‌ సబ్జెక్టు విధానంలో ఇక్కడ కేవలం ఆర్థిక శాస్త్రం, కామర్స్‌, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం మేజర్‌ సబ్జెక్టులుగా పెట్టారు. గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్‌సైన్సు మేజర్‌ సబ్జెక్టులు చదివే అవకాశాన్ని విద్యార్థులకు దూరం చేశారు. ఆర్థికశాస్త్రం చదివే విద్యార్థి మైనర్‌గా చరిత్ర, జంతుశాస్త్రం వారికి మైనర్‌గా వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం వారికి మైనర్‌గా భౌతికశాస్త్రం చదివేలా అవకాశాన్ని తగ్గించేశారు. ఈ కొత్త విధానంలో మూడేళ్ల డిగ్రీలో మేజర్‌ సబ్జెక్టులో 21 పేపర్లు ఉంటాయి. ఈ లెక్కన ఆయా సబ్జెక్టుకు నలుగురు అధ్యాపకులు అవసరం అవుతారు. సైన్సు కోర్సుల్లో అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉన్నందున కొన్ని కళాశాలల్లో కోర్సులను తీసేస్తున్నారు. దీంతో ఉన్న వారినే సర్దుబాటు చేస్తున్నారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, ఆయనే ఏ కళాశాలలో ఏ కోర్సు పెట్టాలో నిర్ణయించేస్తున్నారు. విద్యార్థులకు ఉన్న అవకాశాలు, మార్కెట్‌లో ఉపాధిని పట్టించుకోవడం లేదు.

ప్రవేశాలపై ప్రభావం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ఇప్పటికే తగ్గిపోతున్నాయి. గతేడాది 57 వేల సీట్లు ఉంటే 26 వేల మందే ప్రవేశాలు పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టులను తగ్గించేయడంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్లిపోయే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ కళాశాలలు ఉంటే  రెండు కళాశాలల్లోనే గణితం మేజర్‌ సబ్జెక్టుగా డిగ్రీ ఉంది. సింగిల్‌ సబ్జెక్టులో విద్యార్థులకు అవకాశాలు లేకుండా చేసి, విద్యార్థులను ప్రైవేటు కళాశాలలకు వెళ్లిపోయేలా ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ కళాశాలలకు వచ్చే వారిలో ఎక్కువ మంది నిరుపేదలే ఉంటారు. వీరికి అన్ని రకాల అవకాశాలను కల్పించాల్సి ఉండగా.. కొన్ని సబ్జెక్టుల్లోనే చదవాలనే ఆంక్షలు ఎలా పెడతారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులు చదువుకునేందుకు బహుళైచ్ఛికాలు ఉండాలి.

గణితం చదివే వారు సంగీతం నేర్చుకుంటామన్నా అవకాశం ఇవ్వాలి. ఒకేసారి రెండు డిగ్రీలు చదువుకునేలా ప్రణాళిక ఉండాలి. కానీ, ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులకు అవకాశాలను దూరం చేస్తోంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చూస్తే ఎక్కువ మంది ఎంపీసీ చదువుతున్న వారే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులు మేజర్‌గా డిగ్రీ లేకపోతే వారందరూ ఎక్కడికి వెళ్తారు? గతంలో బీఎస్సీ, బీకాం, బీఏ గ్రూపులుగా ఉన్నప్పుడు బీఎస్సీలో వివిధ ప్రోగ్రాముల్లో 60చొప్పున సీట్లు ఉండేవి. ఇప్పుడు సింగిల్‌ సబ్జెక్టుకు మార్చడంతో సీట్ల సంఖ్య తగ్గిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని