దేవాదాయశాఖ బదిలీల్లో ఒత్తిళ్ల పర్వం

దేవాదాయశాఖలోని సహాయ కమిషనర్‌ (ఏసీ) కేడర్‌ గల జిల్లా దేవాదాయశాఖ అధికారులు (డీఈవో), ఆలయాల ఈవోల బదిలీల్లో అధికారపార్టీ నేతల సిఫార్సులు, ఒత్తిళ్ల ప్రభావం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Published : 02 Jun 2023 04:43 IST

ఏడాది, రెండేళ్లకే పలువురు అధికారులకు స్థానచలనం
వివాదాస్పద అధికారిణికి ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల బాధ్యత

ఈనాడు-అమరావతి: దేవాదాయశాఖలోని సహాయ కమిషనర్‌ (ఏసీ) కేడర్‌ గల జిల్లా దేవాదాయశాఖ అధికారులు (డీఈవో), ఆలయాల ఈవోల బదిలీల్లో అధికారపార్టీ నేతల సిఫార్సులు, ఒత్తిళ్ల ప్రభావం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకచోట రెండేళ్లలోపు పనిచేసేవారిని బదిలీచేయొద్దని, అయిదేళ్ల సర్వీసు దాటిన వారిని తప్పనిసరిగా మార్చాలని మార్గదర్శకాలున్నాయి. అయితే వీటిని తోసిరాజని ఏడాది, రెండేళ్లలోపే వేర్వేరుచోట్ల పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేశారు. మరికొందరు సుదీర్ఘకాలంగా అదే స్థానంలో కొనసాగున్నప్పటికీ వారి జోలికి వెళ్లలేదు.

వివాదాస్పద అధికారికి రెండు జిల్లాల బాధ్యతలు

వివాదాస్పద అధికారిణిగా పేరున్న కె.శాంతి.. తాజా బదిలీల్లో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల డీఈవోగా పోస్టింగ్‌ పొందారు. గతంలో ఈమె విశాఖలో ఏసీగా ఉన్నప్పుడు అక్కడి ఉపకమిషనర్‌ (డీసీ) పుష్పవర్ధన్‌పై ఇసుక చల్లడం సంచలనమైంది. తర్వాత ఈమెపై చర్యలు లేకుండా, డీసీని అక్కడి నుంచి కమిషనరేట్‌కు బదిలీ చేయడంతో.. ఆయన తన ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయారు. గత ఏడాది జూన్‌లో శాంతి ఎన్టీఆర్‌ జిల్లా నెమలి వేణుగోపాలస్వామి ఆలయ ఈవోగా బదిలీకాగా, ఎన్టీఆర్‌ జిల్లాకు డీఈవోగా ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆమెను అనకాపల్లి డీఈవోగా గత నవంబరులో సర్దుబాటు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాకు ఆమె స్థానంలో శ్రీకాకుళం నుంచి అన్నపూర్ణ అనే అధికారిని నియమించారు. అయితే అనకాపల్లి వెళ్లడం ఇష్టంలేని శాంతి, ఇక్కడి డీఈవోగా వచ్చిన అన్నపూర్ణకు బాధ్యతలు అప్పగించలేదు. ఇద్దరూ విధులకు హాజరవడం వివాదంగా మారడంతో.. చివరకు శాంతి తన బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఇపుడు తాజాగా ఆమెనే ఎన్టీఆర్‌ జిల్లాతోపాటు, కృష్ణాజిల్లాకు కూడా డీఈవోగా నియమించారు.

* శాంతికి పోస్టింగ్‌ కోసం పలువురు అధికారులను బదిలీ చేశారు. కృష్ణా డీఈవోగా గత ఏడాది నియమితులైన డి.సాయిబాబును అప్పనపల్లి బాలబాలాజీ ఆలయ ఈవోగా పంపారు. అప్పనపల్లి ఆలయ ఈవో శ్రీరామవరప్రసాద్‌ను నెమలి వేణుగోపాలస్వామి ఆలయ ఈవోగా స్థాన చలనం కల్పించారు. వీరిలో సాయిబాబును కృష్ణా డీఈవోగా కొనసాగించాలని కొందరు లేఖలు ఇచ్చినప్పటికీ.. ఆయనను మార్చేశారు.

* ఎస్‌.చంద్రశేఖర్‌ను ఏడాదిలో నాలుగుసార్లు బదిలీచేశారు. కొద్దినెలల క్రితం వరకూ ఆయన అనకాపల్లి నూకాలమ్మ ఆలయ ఈవోగా ఉండగా.. కొత్త అమావస్య రోజు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అమ్మవారి దర్శనానికి వచ్చినపుడు ఆయన్ను కొంతసేపు వేచి వుంచడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెనువెంటనే చంద్రశేఖర్‌ను అక్కడి నుంచి తప్పించారు. ఇప్పుడు ఆయనను శ్రీకాకుళం డీఈవోగా నియమించారు.

* జోన్‌-2 పరిధిలోకి వచ్చే సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గురుప్రసాద్‌ను.. జోన్‌-1లోని విజయవాడ దుర్గగుడి ఆలయ డిప్యూటీ ఈవోగా బదిలీచేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.


వైయస్‌ఆర్‌ జిల్లా డీఈవో అక్కడే..

* కొందరు అధికారులు అయిదేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్నప్పటికీ వారిని కదిపే ప్రయత్నం చేయలేదు.

* వైయస్‌ఆర్‌ జిల్లా ఇంఛార్జి డీఈవోగా శంకర్‌బాలాజీ దాదాపు ఎనిమిదేళ్లుగా పనిచేస్తుండగా అయనను మార్చలేదు. ఆయన బ్రహ్మంగారి మఠానికి ఫిట్‌ పర్సన్‌, ప్రొద్దుటూరులో రెండు ముఖ్య ఆలయాలకు ఈవోగా కూడా ఉన్నారు. కానీ ఆయనను అక్కడే కొనసాగిస్తున్నారు.

* రాష్ట్రంలో పలువురు గ్రేడ్‌-1 ఈవోలు కూడా పెద్దసంఖ్యలో అయిదేళ్లకుపైగా వివిధ ఆలయాల ఈవోలుగా ఉన్నప్పటికీ వారిని అక్కడే కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని