Suneetha Narreddy: సజ్జల చెప్పినట్టు చెయ్యమన్నారు

వివేకా హత్య నేపథ్యంలో ఇకపై ఏం చేయాలనుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించి చేయాలని ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ భార్య వై.ఎస్‌.భారతీరెడ్డి 2019 మార్చి 23న తనకు చెప్పారంటూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సీబీఐకి తెలిపారు.

Updated : 23 Jul 2023 07:45 IST

ఆ విధంగా భారతీరెడ్డి నాకు సలహా ఇచ్చారు
ఆమె ఎందుకో ఆందోళనగా కనిపించారు
జగన్‌తోపాటు అవినాష్‌ పేరునూ చెప్పాలన్న సజ్జల
తెదేపా నేతలే హత్యకు కారణమంటూ ఫిర్యాదు రాసిచ్చారు
వివేకా హత్య కేసులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతారెడ్డి


సమస్యలున్నా ఎప్పుడూ హత్యలు చేసుకోలేదు

మాది చాలా పెద్ద కుటుంబం. 700 మందికిపైగా ఉన్నాం. మాలో సమస్యలున్నా ఎప్పుడూ హత్యలు చేసుకునే స్థాయి లేదు. జగన్‌ను సీఎంగా చూడాలని మా నాన్న నిర్విరామంగా కృషిచేశారు. నాన్న గౌరవంగా జీవించారు. మరణానంతరం కూడా అదే గౌరవం ఇవ్వాలని మీడియాతో మాట్లాడాను. ఆ ప్రాంతమన్నా, అక్కడ వ్యవసాయం చేసుకోవడమన్నా మా నాన్నకు ఇష్టమనే చెప్పాను. దర్యాప్తులో పోలీసులను ప్రభావితం చేయొద్దని కోరాను. అయితే, కొందరు పెద్ద వ్యక్తులు దీని గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఇది సమస్యను పక్కదారి పట్టించి తప్పుడు సందేశం పంపడమేనని ప్రెస్‌మీట్లలో పేర్కొన్నాను.

సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో సునీత


ఈనాడు, హైదరాబాద్‌: వివేకా హత్య నేపథ్యంలో ఇకపై ఏం చేయాలనుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించి చేయాలని ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ భార్య వై.ఎస్‌.భారతీరెడ్డి 2019 మార్చి 23న తనకు చెప్పారంటూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సీబీఐకి తెలిపారు. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా గత ఏడాది మే 13, సెప్టెంబరు 19, ఈ ఏడాది మే 31, జూన్‌ 13 తేదీల్లో సునీతారెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇస్తూ పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. హత్య గురించి తనకు తెలిసిన, సేకరించిన సమాచారాన్ని పెన్‌డ్రైవ్‌లలో అందజేశారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి...

‘‘ధర్మారెడ్డి సాయంతో 2019 మార్చి 22న సీఈసీని, ఆయన సాయంతో హోంశాఖ కార్యదర్శిని కలిశాను. అప్పటికి ధర్మారెడ్డి ఎవరో తెలియదు. మేం దిల్లీలో ఉన్న అవినాష్‌ అపార్ట్‌మెంట్‌ నుంచి ధర్మారెడ్డి రావడం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడి నుంచి అదేరోజు హైదరాబాద్‌కు వచ్చాను. 23న తాను కలవడానికి వస్తున్నట్లు భారతీరెడ్డి ఫోన్‌ చేశారు. నేను కడపకు వెళ్లే హడావుడిలో ఉన్నానని చెప్పినా.. కొంతసేపేనంటూ భారతి చెప్పారు. కాసేపటికి భారతీరెడ్డి, వై.ఎస్‌.విజయమ్మ, వై.ఎస్‌.అనిల్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రావడంతో ఆశ్చర్యపోయాను. లిఫ్ట్‌ పక్కన భారతితో మాట్లాడుతుండగా ఆమె ఎందుకో ఆందోళనగా కనిపించారు. మా తండ్రి మరణం తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినందుకు కలత చెందుతున్నారని భావించాను. వివేకా హత్య విషయంలో ఇకపై ఏం చేయాలనుకున్నా సజ్జలను సంప్రదించి చేయాలని భారతి నాకు చెప్పారు. తర్వాత మీడియాతో మాట్లాడాలని సజ్జల చెప్పగా కాస్త ఇబ్బందిగా అనిపించి వీడియో చేయించి పంపాను. అందులో శంకరయ్య గురించి ఫిర్యాదు, సంఘటన స్థలాన్ని శుభ్రం చేయించడంపై, పోలీసులు కుటుంబసభ్యులను ఇరికించే ప్రయత్నం చేయడంపై మాట్లాడాను. రామకృష్ణారెడ్డి చూసి, తాను కోరుకున్నది ఇలాంటిది కాదన్నారు. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి ఈ అధ్యాయాన్ని ముగించాలని చెప్పారు.

అందులో జగనన్నతో పాటు అవినాష్‌రెడ్డి పేరును ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారు. అప్పటివరకు నేను ఎక్కడా అవినాష్‌రెడ్డి పేరు ప్రస్తావించలేదు. సజ్జల సలహా మేరకు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టాను. నా తండ్రి అవినాష్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో పాటు దశాబ్దాలుగా విభేదాలు ఉండటంతో.. అవినాష్‌రెడ్డి పేరు ప్రస్తావించాలన్న సూచన కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఎన్నికల సభల్లో అప్పటి ముఖ్యమంత్రి చెబుతున్న విషయాల్లో కొంత వాస్తవం ఉన్నా వాటిని ఎందుకు బయట పెట్టరని, పోలీసులు నిందితులను ఎందుకు పట్టుకోలేదని అనుకున్నాను. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అది హత్య అని భావించకపోవడంతో శుభ్రం చేయడానికి అనుమతించారని భావించాను. దీంతో మా కుటుంబానికి సంబంధమేంటి? నేరస్తుల ఆలోచన ఎలా ఉంటుందో అర్థం చేసుకోలేకపోయాను. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని ప్రతిసారీ చెబుతూనే ఉన్నాను. జగనన్న సీఎం కావాలని మా తండ్రి కష్టపడ్డారు.

తెదేపా నేతలే కారణమంటూ లేఖ

2019 మార్చి 15న తండ్రి మరణవార్తను తెలుసుకుని మా కుటుంబసభ్యులం పులివెందులకు వెళ్లి, అక్కడి నుంచి మార్చురీకి వెళ్లాం. డాక్టరుగా గాయాలను పరిశీలించి బయటకు వచ్చి నిలబడిన తర్వాత పోస్టుమార్టం పూర్తయింది. నేను బయట నిలబడి ఉండగా ఓ ఫిర్యాదు రాసిచ్చి దానిపై సంతకం చేయాలన్నారు. ఇందులో బీటెక్‌ రవితో పాటు ఇతర తెలుగుదేశం నేతలకు వ్యతిరేకంగా ఆరోపణలున్నాయి. ఇది ఎవరు ఇచ్చారో గుర్తులేదు. అయితే దానిపై నేను సంతకం చేయలేదు. మా తండ్రి వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో వైకాపా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండటంతో తెలుగుదేశం వ్యక్తులు భయపడి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పాలని అవినాష్‌ సూచించారు. ఆ సమయంలో అవినాష్‌తో పాటు ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు’’ అని సునీత పేర్కొన్నారు.

డ్రైవర్‌ ప్రసాద్‌ ప్రాణానికి ప్రమాదమనే లేఖ దాచాలన్నాను: నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి

హత్య తర్వాత అక్కడ వివేకా రాసినట్లుగా ఉన్న లేఖ గురించి ఎం.వి.కృష్ణారెడ్డి తనకు ఫోన్‌ చేశారని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన హత్యకు కారణం డ్రైవర్‌ ప్రసాద్‌ కారణమని వివేకా రాసినట్లు కృష్ణారెడ్డి చెప్పారని, రాజారెడ్డి హత్యకు గురైనప్పుడు చెలరేగిన హింసను దృష్టిలో ఉంచుకుని డ్రైవర్‌ ప్రసాద్‌ ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చని భావించినట్లు తెలిపారు. అందువల్ల లేఖను తన వద్దనే ఉంచుకోవాలని కృష్ణారెడ్డికి చెప్పానని, తర్వాత దాన్ని తీసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అవినాష్‌కు వివేకా మద్దతుపై సీబీఐ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హత్యకు ముందురోజు జమ్మలమడుగులోని అల్లె ప్రభావతమ్మతో వివేకా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదని.. అవినాష్‌కు మద్దతు ఇవ్వాలన్నారని, ఆయన ఎంపీగా పోటీచేయాలని భావించినట్లు తర్వాత తెలిసిందన్నారు. వివేకా పేరుతో కొన్ని ఆస్తులున్నట్లు ఆయన హత్యకు ముందే తనకు తెలుసని సీబీఐ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాజశేఖర్‌రెడ్డి చెప్పారు.

గూగుల్‌ టేక్‌ఔట్‌కు ధ్రువీకరణ

2019 మార్చి 13వ తేదీ ఉదయం 8.08 గంటలకు వివేకా ఇంట్లో శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ఔట్‌ ద్వారా తెలిసిన సమాచారంపై రాజశేఖర్‌రెడ్డి సమాధానమిస్తూ ఇదే సమయంలో ఎంవీ కృష్ణారెడ్డి తనకు ఫోన్‌చేసి వివేకా పులివెందుల ఎప్పుడు వస్తున్నారని అడిగారన్నారు. తాము కడపలో ఉన్నామని చెప్పానని, అంతకుముందు కృష్ణారెడ్డి ఫోన్‌ చేశారని, అందువల్ల వివేకాతో తాను ఉన్నట్లు వారికి తెలుసన్నారు. శివశంకర్‌రెడ్డి సాధారణంగా వివేకా ఇంటికి వచ్చేవారు కాదని వెల్లడించారు.


భారతి సందేశాలతో సహా కీలక సమాచారం అందజేత

2019 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 7 వరకు మధ్య భారతికి, తనకు మధ్య ఫోన్‌ మెసేజ్‌ల వివరాలను, మార్చి 27న రామకృష్ణారెడ్డితో మెసేజ్‌ వివరాల స్క్రీన్‌షాట్లతో పాటు ఫోన్‌ను కూడా సీబీఐకి సునీత అప్పగించారు. గత ఏడాది సీబీఐ ముందు హాజరైనప్పుడు రెండు పెన్‌డ్రైవ్‌లను అందజేశారు. ఇందులో ఇంటి లోపల, బయట ప్రాంతాల వీడియో, మార్చి 15న వివేకా మృతదేహాన్ని మార్చురీకి తరలించడం, 15న కడప ఎస్పీ ప్రెస్‌మీట్‌, ఏజీపీ ఓబుల్‌రెడ్డి పేరుతో ఏపీ బార్‌ కౌన్సిల్‌కు చేసిన ఫిర్యాదు, అవినాష్‌కు క్లీన్‌చిట్‌ ఇస్తూ 2021 నవంబరు 19న అసెంబ్లీలో సీఎం ప్రసంగం, భరత్‌ యాదవ్‌కు చెందిన వీడియో క్లిప్‌లను అందజేశారు. 2019 వైకాపా అభ్యర్థుల జాబితా, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రాజకీయ ప్రాబల్యాన్ని చాటేలా ఉన్న ప్లెక్సీలతో పత్రాలు, వీడియోలు, మాట మార్చిన సాక్షుల వివరాలు, గంగధర్‌రెడ్డి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు, శివశంకర్‌రెడ్డి అరెస్టు సమయంలో అవినాష్‌ హాజరు, 2009లో వై.ఎస్‌.భాస్కరరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి, 2019 వై.ఎస్‌.షర్మిలకు ఎంపీ అభ్యర్థిత్వానికి ఉన్న అవకాశాలకు చెందిన పత్రాలు, వీడియోలను అందజేశారు. అవినాష్‌ పుట్టిరోజు సందర్భంగా జగన్‌, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో ఉన్న ఫ్లెక్సీల వివరాలు, శివశంకర్‌రెడ్డి కడపలో రిమ్స్‌ను సందర్శించినప్పటి వీడియో, ఇందులో వైకాపా స్థానిక నాయకులు వివరాలు, మే 2022 కడపలో డాక్టర్‌ చైతన్యరెడ్డి ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా అవినాష్‌, జగన్‌, శివశంకర్‌రెడ్డి తదితరుల ఫోటోలతో ఫ్లెక్సీలు వేసిన వివరాలను పెన్‌డ్రైవ్‌ల ద్వారా అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని