‘రూసా’కూ సర్కారు దెబ్బ!

ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, ఎంఐటీ, కేంబ్రిడ్జి వారి పాఠ్యపుస్తకాలు, బోధన పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం విభిన్నంగా ఉంటుంది. మనకు, వారికి ఎందుకు తేడా ఉంటుంది? ఇవి చేయకపోతే వెనుకబడతాం.

Updated : 04 Aug 2023 06:41 IST

మాటలతోనే మాయ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌
ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి నిధుల విడుదలలో నిర్లక్ష్యం
కేంద్రం మంజూరు చేస్తున్న రూ.కోట్లను సైతం దారిమళ్లిస్తున్న వైనం
ఈనాడు, అమరావతి


ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, ఎంఐటీ, కేంబ్రిడ్జి వారి పాఠ్యపుస్తకాలు, బోధన పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం విభిన్నంగా ఉంటుంది. మనకు, వారికి ఎందుకు తేడా ఉంటుంది? ఇవి చేయకపోతే వెనుకబడతాం

ఈ ఏడాది జులై 13న వీసీల సమావేశంలో సీఎం జగన్‌ మాటలివి..


- కానీ వాస్తవ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం ఇతర అవసరాలకు మళ్లిస్తే ఉన్నత విద్యా సంస్థలు ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జిలతో ఎలా పోటీ పడతాయి? అక్కడున్న మౌలిక సదుపాయాలు మన ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నాయా? కేంద్రం రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్ష అభియాన్‌ (రూసా) కింద నిధులిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 40 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు కూడా ఇవ్వడం లేదు. నిధులు ఖర్చు చేసి ధ్రువపత్రాలు ఇవ్వాలని కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కేంద్రం 60 శాతం వాటాగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.176.25 కోట్లను నిలిపివేసింది.


ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి నిలపడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న రూసా నిధులను సైతం ఇతర అవసరాలకు వాడేసుకుంటోంది. నిధులు ఖర్చు చేసి ధ్రువపత్రాలు ఇస్తే మిగిలిన వాటిని విడుదల చేస్తామని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చివరకు గుత్తేదార్లు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కితేగాని చెల్లించని దుస్థితి. న్యాయస్థానం ఆదేశాలతో ఇటీవల గుత్తేదార్లకు ప్రభుత్వం రూ.48 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రూసా కింద రెండు విడతలకు కలిపి రూ.857.47 కోట్లు మంజూరు చేసింది. దీనికి రాష్ట్రం వాటాగా 40 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వాలి. 2020 మార్చి నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నా కరోనా, ఇతర కారణాలతో కేంద్ర ప్రభుత్వం  గడువు పొడిగిస్తూ వస్తోంది. కేంద్రం తన వాటాగా రూ.514.48 కోట్లు ఇవ్వాల్సి ఉండగా..రూ.338.23 కోట్లు విడుదల చేసింది. నిధుల వినియోగం ధ్రువపత్రాలు ఇస్తే 60 శాతం కింద మిగతా రూ.176.25 కోట్లు ఇస్తామంటోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వకుండా మౌనంగా ఉంటోంది. దీంతో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో పనులు నిలిచిపోయాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తే జాతీయ ర్యాంకుల్లోనూ విద్యా సంస్థలు ముందుండేందుకు అవకాశం ఉంటుంది. విద్యపై శ్రద్ధ చూపుతున్నామని, భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న  జగన్‌ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాల అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేసింది.


నిధులిస్తామన్నా నిర్లక్ష్యమే..

రూసా కింద ఉన్నత విద్య సంస్థలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులిస్తామన్నా ప్రభుత్వం తన వాటా ఇవ్వలేక నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో  పలు వర్సిటీల్లో విద్యార్థినులకు వసతి గృహాలు సక్రమంగా లేవు. కనీస మౌలిక సదుపాయాలూ లేని దుస్థితి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ సరైన వసతులు లేవు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి ? కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. జగన్‌ ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇస్తున్న నిధులను వాడేసుకుని ఉన్నత విద్య చదివే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.


వర్సిటీలదీ అదే దుస్థితి..

ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు ఒక్కోదానికి రూ.100 కోట్ల చొప్పున కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో  గుత్తేదారులు పనులు నిలిపివేశారు.ఇప్పటి వరకు కేవలం రూ.41 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఈ నిధులు ఖర్చు చేస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు నిధులు వ్యయం చేయలేక పోవడంతో వర్సిటీల్లో అభివృద్ధి జరగక పోగా..కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం ఆగిపోయాయి.

  • వెనుకబడిన ప్రాంతాల్లో అన్ని సదుపాయాలతో డిగ్రీ విద్య అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కొత్త ఆదర్శ డిగ్రీ కళాశాలలు (ఎన్‌ఎండీసీ) ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. రూసా కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 8 ఎన్‌ఎండీసీలను మంజూరు చేసింది. ఒక్కో దానికి రూ.12 కోట్లు ఇచ్చింది. కేంద్రం నిధులిస్తున్నా ఇప్పటికీ ఎర్రగొండపాలెం, జగ్గంపేట కళాశాలలు పూర్తి కాలేదు. అకడమిక్‌ భవనం, వసతి గృహాలు, కంప్యూటర్ల ల్యాబ్‌, గ్రంథాలయం, భోజనశాల, ఆడిటోరియం నిర్మించాల్సి ఉంది.

ఎయిడెడ్‌ సంస్థలపై వివక్ష..

రాష్ట్రంలో న్యాక్‌ గుర్తింపు ఉన్న 33 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు కేంద్రం రూసా కింద నిధులు ఇచ్చింది. విజయవాడలోని ఆంధ్ర లయోలా, ఏలూరులోని థెరిస్సా కళాశాలలకు రూ.5 కోట్ల వంతున, మిగతా 31 కళాశాలలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. ఆంధ్ర లయోలా కళాశాలకు ఇప్పటి వరకు రూ.3.5 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత వెనక్కి వెళ్లేందుకు ఐచ్ఛికం ఇవ్వడంతో ఎయిడెడ్‌లోకి వెళ్లిపోయాయి. వీటికి నిధులు ఇవ్వడంపై ప్రభుత్వం జాప్యం చేస్తోంది. గుంటూరులోని హిందూ కళాశాలకు రూ.2 కోట్లు మంజూరు కాగా.. రూ.కోటి మాత్రమే విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు