CM Jagan: 5 కి.మీ వరకు పోలీసు ఆంక్షలు.. జగన్‌ వచ్చింది పరామర్శకేనా?

ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారని, తమపై వరాలు జల్లు కురిపిస్తారని ఆశించిన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా లంకవాసులకు నిరాశే మిగిలింది.

Updated : 09 Aug 2023 07:37 IST

రాకపోకలకు సామాన్యుల అవస్థలు

ఈనాడు- కాకినాడ, న్యూస్‌టుడే- ముమ్మిడివరం: ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారని, తమపై వరాలు జల్లు కురిపిస్తారని ఆశించిన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా లంకవాసులకు నిరాశే మిగిలింది. ఇళ్లు నానిపోయి, భూములు కోతకు గురై, పంటలు కోల్పోయి.. తీవ్ర వేదనలో ఉన్న వారికి కనీసం తమ కష్టాలు చెప్పే అవకాశమూ దక్కలేదు. మంగళవారం నాటి సీఎం పర్యటన అంతా వైకాపా నేతల భజనతోనే సరిపోయింది. ‘గోదావరి వరదల్లో అన్ని విధాలా మాకు సాయం చేసి.. మా కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్న ముఖ్యమంత్రికి స్వాగతం.. జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ సీఎం, స్థానిక ఎమ్మెల్యే, ఇతర నాయకుల ఫ్లెక్సీలతో దారంతా నింపేశారు. గతంలో మత్స్యకారులకు ఇచ్చిన పరిహారం విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పరిహారం అందించారంటూ పలుచోట్ల ప్రచార పత్రాలు ఏర్పాటు చేశారు. 

నువ్వు దేవుడివన్నా.. అంటూ భజన

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎంతో ఎవరు మాట్లాడాలో ముందే ఎంపిక చేశారు. ఏం చెప్పాలో కూడా అధికారులు వారికి తర్ఫీదు ఇచ్చారు. వరదల్లో అవస్థలు పడిన వారిని సభావేదిక దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. ‘మీరు పంపిన అధికార యంత్రాంగం ఉరుకులు పరుగుల మీద మమ్మల్ని ఆదుకుంది. మాకు అన్నీ అందించారు. మీరు మాకు వరం.. మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని శతకోటి దండాలు పెడుతున్నాను. అమ్మ లాలన నాన్న దీవెన జగనన్న పాలన ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆకాశానికెత్తే ప్రయత్నం చేశారు. ‘మళ్లీ మళ్లీ మీరే రావాలి.. మా దేవుడు మీరే’ అంటూ కీర్తించారు. ‘అన్నా.. దేవుడు ఎలా ఉంటాడో తెలీదన్నా.. నువ్వు దేవుడివన్నా’ అంటూ మరో వ్యక్తి ఊగిపోయారు.

ఉదయం 6.30 నుంచి రైతుల నిరీక్షణ

లంక గ్రామాల్లో వరదలకు నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి పరామర్శించేలా ఏర్పాట్లు చేశారు. పొలం దగ్గర రైతు పేరు, దెబ్బతిన్న పంటల పేర్లు, విస్తీర్ణంతో బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ బాధిత రైతుతోపాటు.. ఉద్యాన శాఖ అధికారి, గ్రామ సచివాలయాల్లోని వీహెచ్‌ఏలను ఉదయం 6.30 గంటల నుంచే సిద్ధంగా ఉండమని చెప్పారు. దీంతో వారు వచ్చి ఎండలోనే గంటల కొద్దీ నిరీక్షించారు. ముఖ్యమంత్రి ఉదయమే రావాల్సి ఉన్నా.. మధ్యాహ్నానికి కూడా చేరుకోలేదు. దీంతో ఉదయం నుంచి అల్పాహారం లేక, తాగునీరందక వారంతా నీరసించిపోయారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ.. సోమవారం రాత్రి నుంచి ఆయన పర్యటించే మార్గాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 5 కి.మీ. పొడవున ఆంక్షలు విధించి రాకపోకలు స్తంభింపజేశారు. దీంతో ముమ్మిడివరం, అమలాపురంలలో చదువుతున్న లంక గ్రామాల విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి నానా పాట్లు పడ్డారు. కొండుకుదురు హైస్కూల్‌కు లంక గ్రామాల నుంచి విద్యార్థులు రాలేకపోయారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంక శివారు తొత్తరమూడివారిపేటకు చుట్టుపక్కల లంకగ్రామాల ప్రజలు ఉదయం 7 గంటల నుంచే వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం వచ్చేవరకు అక్కడి వారికి కనీసం తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదు. వారు నిలబడి నిరీక్షించలేక నేలపై కూర్చోవాల్సి వచ్చింది. సచివాలయ మహిళా పోలీసు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. ముమ్మిడివరం మండలం లంక ఆఫ్‌ ఠాణేలంకలోనూ సీఎం పర్యటనలో జాప్యంతో మహిళలు ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది.

కోడికత్తి కేసు నిందితుడి ఇంటి మార్గంలో అప్రమత్తం

సీఎం పర్యటన బందోబస్తుకు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 900 మందికి పైగా పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. అనుకూలమైన వారిని మాత్రమే వరద ప్రాంతాల పరామర్శ వేదిక వద్దకు అనుమతిచ్చారు. తెదేపా, జనసేన, ఇతర నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వారు కాపలా కాశారు. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు నివాసం ఠాణేలంకలో ఉండటంతో ఆయన కుటుంబీకులు సీఎంను కలవడానికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.


నా భార్య జ్వరంతో.. రెండున్నర కి.మీ. నడిచింది

నా భార్య మంగాదేవికి జ్వరం వచ్చింది. ఆసుపత్రికి ఇంజక్షన్‌ వేయించడానికి తీసుకెళుతుంటే పోలీసులు పల్లవారిపాలెం వంతెన దగ్గర వాహనాలు ఆపేశారు. దీంతో నీరసంగా ఉన్న ఆమెను రెండున్నర కి.మీ. నడిపించాల్సి వచ్చింది.

 బూసారపు శ్రీరాములు, కమినిలంక, ముమ్మిడివరం మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు